8
పక్వానికి వచ్చిన పండును గూర్చిన దర్శనం
1 యెహోవా ఇది నాకు చూపించాడు. వేసవి కాలపు పండ్లగంప నొకదానిని నేను చూశాను.
2 “ఆమోసూ, నీ వేమి చూస్తున్నావు?” అని యెహోవా నన్నడిగాడు.
“ఒక గంపెడు వేసవి కాలపు పండ్లు” అని నేను చెప్పాను.
అప్పుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు: “నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు అంతం వచ్చింది. నేనిక ఎంత మాత్రం వారి పాపాలను చూసి చూడనట్లు ఉండను.
3 ఆలయంలో పాడే పాటలు శోక గీతాలుగా మారతాయి. నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు. ప్రతి చోటా శవాలు పడి ఉంటాయి. ప్రజలు నిశ్శబ్దంగా శవాలను మోసుకుపోయి పీనుగుల గుట్టమీద వేస్తారు.”
ఇశ్రాయేలు వ్యాపారుల ధనాశ
4 నేను చెప్పేది వినండి! నిస్సహాయులైన ప్రజలపై మీరు నడిచి వెళ్తారు.
ఈ దేశ పేదప్రజలను నాశనం చేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు.
5 వర్తకులారా, మీరిలా అంటారు,
“మేము ధాన్యాన్ని అమ్ముకొనేటందుకు అమావాస్య ఎప్పుడు వెళ్లిపోతుంది?
అమ్మకానికి మా గోధుమలు తేవటానికి
విశ్రాంతి దినం ఎప్పుడైపోతుంది?
కొలతలు తగ్గించి, ధరలు పెంచుతాము.
దొంగ త్రాసువేసి ప్రజలను మోసగిస్తాము.
6 పేదవారు ఎలాగో వారి అప్పులు తీర్చ లేరు గనుక,
మేము వారిని బానిసలనుగా కొంటాము.
జత చెప్పుల విలువకు ఆ నిస్సహాయులను మేము కొంటాము.
ఆహా, నేలపై ఒలికిన ధాన్యాన్ని కూడా మేము అమ్ముకోవచ్చు.”
7 యెహోవా ఒక మాట ఇచ్చాడు. యాకోబుకు గర్వ కారణమైన తన పేరు మీద ఈ ప్రమాణం చేశాడు:
“ఆ ప్రజలు చేసిన పనులను నేనెన్నడూ మరువను.
8 ఆ పనుల కారణంగా భూమి అంతా కంపిస్తుంది.
దేశంలో నివసించే ప్రతివాడు చనిపోయినవారి కొరకు విలపిస్తాడు.
ఈజిప్టులోని నైలు నదిలా భూమి అంతా ఉవ్వెత్తుగా లేచి పతనమవుతుంది.
భూమి అటూ ఇటూ ఊగిసలాడుతుంది.”
9 యెహోవా ఈ విషయాలు కూడా చెప్పాడు:
“ఆ సమయంలో మధ్యాహ్న సమయంలో సూర్యుడు అస్తమించేలా నేను చేస్తాను.
మబ్బులేని పగటి సమయంలో భూమిపై చీకటి కమ్మేలా చేస్తాను.
10 మీ పండుగ దినాలను చనిపోయిన వారి కొరకు దుఃఖించే దినాలుగామార్చుతాను.
మీ పాటలన్నీ మృతులకొరకు విలాప గీతాలవుతాయి.
ప్రతివాని పైన విషాద సూచిక దుస్తులు వేస్తాను.
ప్రతివాని తలను బోడితల చేస్తాను.
ఏకైక పుత్రుడు చనిపోయినప్పుడు కలిగే గొప్ప
దుఃఖంలాంటి దుఃఖాన్ని నేను కలిగిస్తాను.
అది ఒక భయంకరమైన అంతం.”
దేవుని వాక్యం కొరకు రానున్న తీవ్రమైన కరువు స్థితి
11 యెహోవా చెపుతున్నాడు:
“చూడు, దేశంలో కరువు పరిస్థితిని
నేను కల్పించే సమయం వస్తూవుంది.
ప్రజలు ఆహారం కొరకు ఆకలిగొనరు.
ప్రజలు నీటి కొరకు దప్పిగొనరు.
కాని యెహోవా వాక్యాలు కొరకు ప్రజలు ఆకలిగొంటారు.
12 ప్రజలు ఒక సముద్రం నుండి
మరొక సముద్రం వరకు తిరుగుతారు.
వారు ఉత్తరాన్నుండి తూర్పుకు పయనిస్తారు.
యెహోవా వాక్యం కొరకు ప్రజలు ముందుకు, వెనుకకు పోతారు.
కాని వారు దానిని కనుగొనలేరు.
13 ఆ సమయంలో అందమైన యువతీ యువకులు
దప్పికతో సోమ్మసిల్లుతారు.
14 షోమ్రోను యొక్క పాపము సాక్షిగా వారు ప్రమాణం చేసేవారు
ఇలా అంటారు: ‘దానూ, నీ దేవుని జీవముతోడు.’
బెయేర్షెబా మార్గంతోడు ఆ ప్రజలు పతనమవుతారు,
వారు మరెన్నడూ లేవరు.”