14
ఇశ్రాయేలు పెద్దలలో కొంతమంది నా వద్దకు వచ్చారు. వారు నాతో మాట్లాడాలని నావద్ద కూర్చున్నారు. ఆ సమయంలో యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఈ విధంగా చెప్పాడు. “నరపుత్రుడా, ఈ మనుష్యులు నీతో మాట్లాడాలని వచ్చారు. వారు నా సలహా కోరమని నిన్ను అడగటానికి వచ్చారు. కాని ఈ మనుష్యులు ఇంకా హేయమైన విగ్రహాలను కలిగివున్నారు. వారు పాపం చేయటానికి కారణమైన వస్తువులను వారింకా విడనాడలేదు. ఆ విగ్రహాలను వారింకా పూజిస్తూనే వున్నారు. అందువల్ల వారు నా సలహా కొరకు రావలసిన అవసరం ఏముంది? వారి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలా? అవసరం లేదు! అయినా నేను వారికి ఒక సమాధానం ఇస్తాను. ఆది నేను వారిని శిక్షించటం! ఈ విషయాలు నీవు వారికి చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ఇశ్రాయేలుకు చెందిన వాడెవడైనా ఒక ప్రవక్త వద్దకు వచ్చి నా సలహా కోరితే, ఆ ప్రవక్త వానికి సమాధానం చెప్పడు. వాకై నేనే ఆ వ్యక్తి ప్రశ్నకు సమాధానమిస్తాను. ఆ వ్యక్తి తన హేయమైన విగ్రహాలను కలిగివున్నా, తన పాపాలకు కారణమైన వస్తువులను దాచివుంచినా, అతడా విగ్రహారాధన చేసినా, నేనతనికి సమాధానమిస్తాను. వానివద్ద అపవిత్ర విగ్రహాలున్నా నేనతనితో మాట్లాడతాను. ఎందుకనగా నేను వారి హృదయాలను తాకకోరుచున్నాను. వారి నీచమైన విగ్రహాల కొరకు వారు నన్ను విడిచిపెట్టినా, నేను వారిని ప్రేమిస్తున్నట్లు చూపదలిచాను.’
“కావున ఇశ్రాయేలు వంశం వారికి ఈ విషయాలు చెప్పు. వారితో ఇలా అనాలి, ‘నా ప్రభువైన యెహోవా ఏమి చెబతున్నాడనగా: నా వద్దకు తిరిగి రండి. మీ అపవిత్ర విగ్రహాలను వదిలివేయండి. ఆ బూటకపు దేవుళ నుండి దూరంకండి. ఏ ఇశ్రాయేలీయుడు గాని, ఇశ్రాయేలులో నివసించే పరదేశియుడుగాని నా వద్దకు సలహా కోరివస్తే, వానికి నేను సమాధానమిస్తాను. అతను అపవిత్ర విగ్రహాలను కలిగియున్నా, తనుపాపాలు చేయటానికి కారుకమైన వస్తువులను దాచుకున్నా, అతను విగ్రహాలను ఆరాధించినా, అతనికి నేను సమాధాన మీస్తాను. నేను వారికిచ్చే సమాధాన మిది: నేనా వ్యక్తికి వ్యతిరేకినవుతాను. నేను వానిని నాశనం చేస్తాను. ఇతర ప్రజలకు అతడొక ఉదాహరణగా మిగులుతాడు. ప్రజలతనిని చూసి నవ్వుతారు. నా ప్రజల మధ్యనుండి అతనిని తొలగిస్తాను. అప్పుడు నేను యెహొవానని మీరు తెలుసుకొంటారు! ఏ ప్రవక్తయేగాని మూర్ఖంగా తన స్వంత సమాధానమిస్తే, అతడెంత మూర్ఖుడో నేనతనికి నిరూపిస్తాను! అతనికి వ్యతిరేకంగా నా శక్తిని వినియోగిస్తాను. అతనని నాశనం చేసి, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల నుండి అతనిని తొలగిస్తాను. 10 కావున, సలహా కొరకు వచ్చిన వ్యక్తి, సమాధాన మిచ్చిన ప్రవక్త, ఇద్దరూ ఒకే శిక్షకు గురియవుతారు. 11 ఎందుకంటే, దానివల్ల ఆ ప్రవక్తలు నా ప్రజలను నాకు దూరం చేయకుండా ఆగిపోతారు. తద్వారా, నా ప్రజలు వారి పాపాలలో అపవిత్రము కాకుండా ఆగిపోతారు. అప్పుడు వారు నా ప్రత్యేక ప్రజలవుతారు. నేను వారి దేవుడనవుతాను.’ ” ఈ విషయాలన్నీ ప్రభువైన యెహోవా చెప్పాడు.
12 పిమ్మట యెహోవా వాక్కు నాకు తిరిగి వినిపించింది. ఆయన ఇలా చెప్పాడు, 13 “నరపుత్రుడా, నన్ను వదిలిపెట్టిన, నా పట్ల పాపంచేసిన ఏ దేశాన్నయినా నేను శిక్షిస్తాను. వారికి ఆహార సరఫరాలను నిలిపి వేస్తాను. వారికి కరుపు కాలం రప్పించి, ఆ దేశ జనాభాని పశుసంపదను తొలగిస్తాను. 14 ఆ దేశంలో నోవహు, దానియేలు, యోబు నివసిస్తున్నప్పటికీ దానిని నేను శిక్షిస్తాను. ఆ మనష్యులు వారి మంచితనం చేత వారి ప్రాణాలను కాపాడుకొనగలరు. కాని మొత్తం దేశాన్ని వారు రక్షించలేరు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
15 దేవుడు ఇంకా ఇలా తెలియజెప్పాడు: “లేదా, నేను ఆ రాజ్యానికి కృర మృగాలను పంపవచ్చు. ఆ జంతువులు ప్రజలందరినీ చంపివేయవచ్చు. ఈ కృర మృగాల కారణంగా ఆ దేశం గుండా ఎవ్వరూ ప్రయాణం చేయరు. 16 ఒకవేళ ఆ దేశంలో నోవహు, దానియేలు, యోబు* నివసిస్తూవుంటే ఆ ముగ్గురు మంచి వ్యక్తులనూ నేను రక్షిస్తాను. ఆ ముగ్గురు మనుష్యులూ తమ ప్రాణాలను కాపాడుకోగలరు. నా జీవ ప్రమాణంగా వారు ఇతరుల ప్రాణాలను గాని, కనీసం వారి కుమారులను, కుమార్తెలను గాని రక్షించలేరని నిశ్చయంగా చెబతున్నాను! ఆ చెడ్డదేశం నాశనం చేయబడుతుంది!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
17 దేవుడు ఈ విధంగా చెప్పాడు: “లేదా, నేను శత్రుసైన్యాన్ని ఆ దేశం మీదికి పంపవచ్చు. ఆ సైనికులు ఆ రాజ్యాన్ని నాశనం చేస్తారు. దేశంలో వున్న మనుష్యులను, జంతువులను తొలగించి వేస్తాను. 18 నోవహు, దానియేలు, యోబు అక్కడ వుంటే, ఆ ముగ్గురు మంచి వ్యక్తులను నేను రక్షిస్తాను. ఆ ముగ్గురు మునుష్యులూ వారి ప్రాణాలను కాపాడుకోగలుగుతారు. కాని, నా జీవ ప్రమాణంగా ఇతర ప్రజల ప్రాణాలను గాని, తమ స్వంత కుమారుల, కుమార్తెల ప్రాణాలను గాని కాపాడలేరని చెబతున్నాను. ఆ చెడ్డదేశం నాశనం చేయబడుతుంది!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
19 దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “లేదా, ఆ దేశం మీద ఒక వ్యాధి ప్రబలేలా నేను చేయవచ్చు. ఆ ప్రజల మీద నా కోపం కుమ్మరిస్తాను. ఆ రాజ్యంనుండి ప్రజలందరినీ, పశువులన్నిటినీ నేను తొలగించి వేస్తాను. 20 ఒకవేళ నొవహు, దానియేలు, యోబు అక్కడ నివసిస్తే, ఆ ముగ్గురు మనుష్యులను నేను రక్షిస్తాను. ఎందువల్ల నంటే వారు మంచి వ్యక్తులు. ఆ ముగ్గురూ తమ ప్రాణాలను కాపాడుకోగలరు. కాని, నా ఆత్మ సాక్షిగా వారు ఇతర ప్రజలను గాని, వారి స్వంత కొడుకులను, కుమారైలను గాని రక్షించలేరు!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
21 మళ్లీ నా ప్రభువైన యెహోవా ఈ విధంగా చెప్పాడు: “కావున యెరూషలేము పరిస్థితి ఎంత దారుణంగా వుంటుందో ఆలోచించు. ఆ నాలుగు రకాల శిక్షలనూ ఆ నగరం మీదికి పంపుతాను! ఆ నగరం మీదికి శత్రుసైన్యాలను. క్షామాన్ని, రోగాలను, క్రూర మృగాలను పంపుతాను. ఆ రాజ్యం నుండి ప్రజలను, పశువులను అందరినీ తొలగిస్తాను! 22 కొంతమంది ప్రజలు ఆ దేశంనుండి తప్పించు కుంటారు. వారు తమ కుమారులను, కుమారైలను తీసుకొని నీ సహాయం కొరకు వస్తారు. నిజంగా వారెంత చెడ్డవారో నీవప్పుడు తెలుసుకొంటావు. నేను యెరూషలేము మీదకి రప్పించే కష్టాలను గూర్చి నీవప్పుడు యోచించి అవి వారికి తగినవేనని నీవనుకుంటావు. 23 నీవు వారి జీవన విధానాన్ని, వారు చేసే చెడుకార్యాలను చూస్తావు. నేనా ప్రజలను శిక్షించటానికి తగిన కారణమున్నట్లు నీవు అప్పుడు తెలుసుకుంటావు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
* 14:16 నోవహు, దానియేలు, యోబు ఈ ముగ్గురు ప్రాచీన కాలపు మనుష్యులు. వీరు మంచితనానికి, తెలివి తేటలకు ప్రసిద్ధి చెందినవారు. నోవహు, యోబలకు చెందిన కథలు బైబిలు గ్రంథలో ఉన్నాయి. దానియేలును గురించిన కథలు రాస్‌షామ్రా రచనల్లో లభ్యమవుతాయి.