12
పస్కా పండుగ
1 మోషే, అహారోనులు ఇంకా ఈజిప్టులో ఉండగానే, యెహోవా వాళ్లతో మాట్లాడాడు. యెహోవా ఇలా చెప్పాడు:
2 “ఈనెల మీకు సంవత్సరంలో మొదటి నెలగా ఉంటుంది.
3 ఈ ఆజ్ఞ ఇశ్రాయేలు సమాజం అంతటికీ చెందుతుంది. ఈ నెల పదో రోజున ఒక్కొక్కరు తన ఇంటివారి కోసం ఒక గొర్రె పిల్లను తీసుకోవాలి.
4 ఒక గొర్రెపిల్లను పూర్తిగా తినగలిగినంత మంది తన ఇంట్లో లేకపోతే, అలాంటి వారు తమ భోజనం తినేందుకు ఇంటి పక్కవాళ్లను ఆహ్వానించాలి. ప్రతి ఒక్కరూ తినడానికి సరిపడినంతగా గొర్రెపిల్ల ఉండాలి.
5 గొర్రెపిల్ల ఒక సంవత్సరం వయసు గల మగది కావాలి, అది మంచి ఆరోగ్యంగా ఉండాలి. ఈ జంతువు చిన్న గొర్రె లేక చిన్న మేక కావచ్చును.
6 నెలలో 14వ రోజువరకు మీరు ఆ జంతువును గమనించాలి. ఆ రోజు ఇశ్రాయేలు సమాజంలోని ప్రజలంతా సాయంకాల సమయంలో ఈ జంతువులను చంపాలి.
7 ఈ జంతువుల రక్తం అంతా భద్రం చేయాలి. ఏ ఇండ్లలోనైతే ప్రజలు ఈ ఆహారం భోజనం చేస్తారో ఆ ఇళ్ల ద్వార బంధాల నిలువు కమ్ములమీద, పైకమ్మి మీద ఆ రక్తం చల్లాలి.
8 “ఆ రాత్రే మీరు ఆ గొర్రెపిల్ల మాంసం కాల్చి దాన్ని మొత్తం తినెయ్యాలి. చేదుగా ఉండే ఆకు కూరలు, పొంగని రొట్టె కూడా మీరు తినాలి.
9 గొర్రె పిల్ల మాంసాన్ని మీరు నీళ్లతో వండకూడదు. మొత్తం గొర్రెపిల్లను నిప్పుమీద పేల్చాలి. అప్పటికి ఇంకా ఈ గొర్రెపిల్ల తల, కాళ్లు, ఆంత్రాలతోనే ఉండాలి.
10 ఆ మాంసం అంతా ఆ రాత్రికి రాత్రే మీరు భోంచేయాలి. మాంసంలో ఏమైనా మర్నాటి ఉదయం వరకు మిగిలి పోతే దాన్ని నిప్పులో వేసి కాల్చివేయాలి.
11 “మీరు ఆ భోజనం చేసేటప్పుడు ప్రయాణం చేస్తున్న వారిలా బట్టలు వేసుకోవాలి. మీ అంగీని మీ నడుంకు బిగించాలి. మీరు మీ చెప్పులు తొడుక్కోవాలి. మీ చేతి కర్రను చేతితో పట్టుకోవాలి. ఆతురంగా మీరు భోజనం చేయాలి. ఎందుచేతనంటే, ఇది యెహోవాయొక్క పస్కాబలి (యెహోవా తన ప్రజలను కాపాడి, వారిని ఈజిప్టునుండి త్వరగా బయటకు నడిపించిన సమయం.)
12 “ఈ రాత్రి నేను ఈజిప్టు అంతటా సంచారం చేసి ఈజిప్టులోని ప్రతి పెద్ద కుమారుణ్ణీ చంపేస్తాను. మనుష్యుల్లోను, జంతువుల్లోను, మొదటి సంతానాన్ని నేను చంపేస్తాను. ఈజిప్టు దేవతలందరికీ శిక్ష విధిస్తాను. నేనే యెహోవానని వారికి తెలిసేటట్టు చేస్తాను.
13 అయితే, మీ ఇళ్లమీదనున్ను రక్తం ఒక ప్రత్యేక గుర్తుగా ఉంటుంది. నేను ఆ రక్తాన్ని చూడగానే మీ ఇంటిని దాటి వెళ్లిపోతాను. ఈజిప్టు వాళ్లకు మాత్రం కీడు జరిగేటట్టు చేస్తాను. అయితే, ఆ కీడు, రోగాలు మిమ్మల్ని ఎవరినీ బాధించవు.
14 “కనుక ఈ రాత్రిని మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటారు. మీకు అది ఒక ప్రత్యేక పండుగ రోజుగా ఉంటుంది. మీ తర్వాత మీ సంతానము శాశ్వతంగా ఈ పండుగను ఆచరించి యెహోవాను ఘనపర్చాలి.
15 ఈ పండుగనాడు ఏడు రోజుల పాటు పొంగని రొట్టెలు మీరు తినాలి. ఈ పండుగ మొదటి రోజున పులిసే పదార్థాన్ని మీ ఇండ్లలోనుంచి తీసివేయాలి. ఈ పండుగ జరిగే మొత్తం ఏడు రోజుల్లోనూ పులిసిన పదార్థాన్ని ఏ ఒక్కరూ తినకూడదు. ఎవరైనా సరే పులిసే పదార్థం తింటే, ఆ వ్యక్తిని ఇశ్రాయేలు వాళ్లనుండి మీరు వేరుచేయాలి.
16 పండుగలో మొదటి రోజున, చివరి రోజున పరిశుద్ధ సమావేశాలు ఉంటాయి. ఈ రోజుల్లో మీరు ఏ పనీ చేయకూడదు. ఇలాంటి రోజుల్లో మీరు భోంచేయటానికి అవసరమైన భోజనాన్ని సిద్ధం చేసుకోవడం ఒక్కటే మీరు చెయ్యొచ్చు.
17 పులియని పిండితో చేసే రొట్టెల పండుగను మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుచేతనంటే, సరిగ్గా ఈ రోజే మీ వంశాలన్నింటినీ ఈజిప్టు నుండి నేను బయటకు నడిపిన రోజు. అందుచేత మీ తర్వాత మీ సంతానమంతా ఈ రోజును జ్ఞాపకం చేసుకోవాలి. ఇది శాశ్వతంగా ఉండిపోయే చట్టం.
18 కనుక మొదటి నెల (నిసాను) 14వ రోజు సాయంత్రం నుండి మీరు పులియని రొట్టెలు తినడం మొదలు పెట్టాలి. అదే నెల 21 రోజు సాయంత్రం వరకు అలాంటి రొట్టెలే మీరు తినాలి.
19 ఏడు రోజుల పాటు మీ ఇళ్లలో ఎక్కడా పులిసిన పదార్థం ఉండకూడదు. ఇశ్రాయేలు పౌరుడేకాని, విదేశీయుడేగాని ఏ వ్యక్తిగాని ఈ సందర్భంలో పులిసిన పదార్థం తింటే, మిగిలిన ఇశ్రాయేలీయులందరినుండి ఆ వ్యక్తి వేరు చేయబడాలి.
20 ఈ పండుగ సమయంలో మీరు పులిసిన పదార్థం తినకూడదు. మీరు ఎక్కడ ఉన్నాసరే, పులియని రొట్టెలు మాత్రమే మీరు తినాలి.”
21 కనుక పెద్దలందర్నీ మోషే పిలిచి, “మీ కుటుంబాల కోసం గొర్రెపిల్లల్ని తెచ్చుకొని, పస్కా పండుగకు ఆ గొర్రెపిల్లల్ని తీసుకోండి.
22 హిస్సోపు కొమ్మలు తీసుకొని రక్తంతో నింపిన పాత్రల్లో వాటిని ముంచండి. ద్వారబంధాల నిలువు కమ్ముల మీద, పై కమ్మి మీద ఆ రక్తాన్ని పూయండి. తెల్లారేవరకు ఎవరూ తమ ఇండ్లు విడిచి వెళ్ల కూడదు.
23 ఈజిప్టులో జ్యేష్ఠ సంతానాన్ని చంపడానికి యెహోవా సంచరించే సమయంలో, ద్వారబంధాల నిలువు కమ్ముల మీద పైకమ్మి మీద రక్తాన్ని ఆయన చూస్తాడు. అప్పుడు యెహోవా ఆ ఇంటిని కాపాడుతాడు నాశనకారుడ్ని యెహోవా మీ ఇంట్లోకి రానివ్వడు. మిమ్మల్ని బాధింపనియ్యడు.
24 ఈ ఆజ్ఞ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ చట్టం మీకు, మీ సంతానానికి శాశ్వతంగా ఉంటుంది.
25 యెహోవా మీకు ఇచ్చే దేశానికి వెళ్లిన తర్వాత కూడ మీరు దీన్ని చేయటం జ్ఞాపకం ఉంచుకోవాలి.
26 ‘ఈ ఆచారం మనం ఎందుకు పాటిస్తున్నాము?’ అని మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు
27 ‘యెహోవాను ఘనపర్చడం కోసమే ఈ పస్కా పండుగ. ఎందుచేతనంటే, మనం ఈజిప్టులో ఉన్నప్పుడు యెహోవా ఇశ్రాయేలు గృహాలను దాటిపోయాడు యెహోవా ఈజిప్టు వాళ్లను చంపేసాడు. కానీ మన ఇళ్లల్లో వారిని ఆయన రక్షించాడు. అందుచేత ఇప్పుడు ప్రజలు సాష్టాంగపడి యెహోవాను ఆరాధిస్తున్నారు’ అని మీరు చెప్పాలి.” అని అన్నాడు.
28 మోషే అహరోనులకు యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చాడు. అందుచేత యెహోవా ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు చేసారు.
29 అర్ధరాత్రి వేళ ఫరో (ఈజిప్టు రాజ్యపాలకుడు) ఇంట పెద్ద కుమారుడు మొదలుకొని చెరసాలలో కూర్చొన్న ఖైదీ పెద్ద కుమారుని వరకు ఈజిప్టులో పెద్ద కుమారులందర్నీ యెహోవా చంపేసాడు. అలాగే జంతువుల్లో మొదటి సంతానం అన్నీ చచ్చాయి.
30 ఆ రాత్రి ఈజిప్టులో ప్రతీ ఇంటా ఎవరో ఒకరు చనిపోయారు. ఫరో, అతని అధికారులు, ఈజిప్టులోని ప్రజలంతా ఘోల్లున ఏడ్వడం మొదలు పెట్టారు.
ఇశ్రాయేలీయులు ఈజిప్టు విడిచి వెళ్లడం
31 కనుక ఆ రాత్రి మోషే, అహరోనులను ఫరో పిలిపించాడు. “మీరు వెంటనే నా ప్రజల్ని విడిచి వెళ్లండి. మీరు చెప్పినట్టే మీరూ, మీ ప్రజలూ చెయ్యండి. వెళ్లి యెహోవాను ఆరాధించండి.
32 మీరు చెప్పినట్టే మీ గొర్రెలను, పశువులను, అన్నింటినీ మీతోబాటు తీసుకొనిపోవచ్చు. వెళ్లండి. నన్నుకూడ ఆశీర్వదించండి.” అని వారితో ఫరో అన్నాడు.
33 వాళ్లను త్వరగా విడిచిపొమ్మని ఈజిప్టు ప్రజలు కూడ వారిని అడిగారు ఎందుకంటే, “మీరు వెళ్లకపోతే మేమందరం చస్తాము” అని వాళ్లు చెప్పారు.
34 తమ రొట్టెల్లో పులిసిన పదార్థం వేసుకొనేంత సమయం ఇశ్రాయేలు ప్రజలకు లేదు. పిండి ముద్దలున్న పాత్రలను బట్టలో కట్టుకొని వారు వారి భుజాన వేసుకొని మోసుకుపోయారు.
35 అప్పుడు మోషే వారిని ఏమి చేయమని చెప్పాడో అలాగే ఇశ్రాయేలు ప్రజలు చేసారు. వారు వారి పక్క ఇండ్ల వారి దగ్గరకు వెళ్లి బట్టలు, వెండి, బంగారు వస్తువులు ఇమ్మని అడిగారు.
36 ఈజిప్టువారు ఇశ్రాయేలు ప్రజల మీద దయ చూపించేటట్టు యెహోవా చేసాడు. అందుచేత ఈజిప్టు వాళ్లు వారి ఐశ్వర్యాలను ఇశ్రాయేలు ప్రజలకు యిచ్చారు.
37 ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం కట్టి రామసేసునుండి సుక్కోతుకి వెళ్లారు. వారు పురుషులే సుమారు 6,00,000 మంది. ఇందులో పిల్లల సంఖ్యలేదు.
38 గొర్రెలు, పశువులు, ఇతర సామగ్రి చాల విస్తారంగా ఉన్నాయి. వారితో బాటు చాల మంది రకరకాల ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. వీళ్లు ఇశ్రాయేలీయులు కారు, గాని వారితో కలిసి వెళ్లారు.
39 అయితే ప్రజలకు మాత్రం వారి రొట్టెల్లో పులిసిన పదార్థం వేసుకొనే సమయం లేదు. వారు తమ ప్రయాణం కోసం ప్రత్యేకమైన భోజనం ఏదీ సిద్ధం చేసుకోలేదు. కనుక పులవని పిండితోనే వారు రొట్టెలు చేసుకోవాల్సి వచ్చింది.
40 ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టులో 430 సంవత్సరాలు జీవించారు.
41 నాలుగువందల ముప్పై సంవత్సరాల తర్వాత ఆరోజే మొత్తం యెహోవా సైన్యాలన్నీ ఈజిప్టు దేశాన్ని విడిచి వెళ్లిపోయాయి.
42 కనుక యెహోవా చేసిన దానిని ప్రజలు జ్ఞాపకం చేసుకొంటారు. అది చాల ప్రత్యేకమైన రాత్రి కనుక తరతరాలవరకు జ్ఞాపకం చేసుకొంటారు. ఇశ్రాయేలు ప్రజలంతా ఆ రాత్రిని శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొంటారు.
43 మోషే అహరోనులతో యెహోవా యిలా చెప్పాడు: “పస్కా పండుగకు నియమాలు ఇవి. పస్కా భోజనం విదేశీయుడెవరూ తినకూడదు.
44 ఒకడు బానిసను కొంటే, ఆ బానిసకు అతడు సున్నతి చేస్తే అప్పుడు ఆ బానిస పస్కా పండుగ భోజనం చెయ్యవచ్చు.
45 అయితే, ఒక వ్యక్తి కేవలం మీ దేశంలో ఉంటున్నా, లేక మీకోసం పని చేసేందుకు కూలికి కుదుర్చుకొన్నా, అలాంటి వ్యక్తి పస్కా పండుగ భోజనం చెయ్యకూడదు. (పస్కా పండుగ ఇశ్రాయేలీయులకు మాత్రమే)”
46 “ప్రతి కుటుంబము ఒకే ఇంటిలో భోజనం చేయాలి. భోజనాన్ని ఎవ్వరూ ఇంటి బయట తినకూడదు. మీరు గొర్రెమాంసము తిని దాని ఎముకను విరువకూడదు.
47 ఇశ్రాయేలు ప్రజలందరు ఈ పండుగను ఆచరించాలి.
48 ఇశ్రాయేలు సమాజంలో సభ్యుడు కాని ఏ వ్యక్తి అయినా మీతోబాటు నివసిస్తూ ఉండి యెహోవా పస్కా పండుగలో అతడు పాల్గొనాలనుకొంటే, అతనికి సున్నతి చేయాలి. అప్పుడు అతను కూడ ఇశ్రాయేలు పౌరుడుగా ఆ భోజనంలో పాల్గొనవచ్చు. కాని ఒకడు సున్నతి చేసుకోకపోతే అతను పస్కా పండుగ భోజనంలో పాల్గొన కూడదు.
49 అందరికీ ఇవే నియమాలు వర్తిస్తాయి. మీ దేశంలో నివసిస్తున్న వ్యక్తి పౌరుడైనా సరే, విదేశీయుడైనా సరే యివే నియమాలు వర్తిస్తాయి.”
50 మోషే అహరోనులకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలకు ప్రజలంతా విధేయులయ్యారు.
51 కనుక అదే రోజు ఇశ్రాయేలు ప్రజలందరినీ ఈజిప్టు దేశం నుండి యెహోవా బయటకు నడిపించాడు. ప్రజలు గుంపులుగా బయల్దేరారు.