34
కొత్త రాతి పలకలు
1 అప్పుడు మోషేతో యెహోవా ఇలాగు చెప్పాడు: “ముందు పగులగొట్టబడ్డ రెండు రాతి పలకల్లాంటివే మరో రెండు రాతి పలకలు తయారు చేయి. మొదటి రెండు రాళ్లమీద రాయబడ్డ మాటలే ఈ రాళ్ల మీద నేను రాస్తాను.
2 రేపు ఉదయం సిద్ధంగా ఉండు. సీనాయి కొండమీదికి రమ్ము. అక్కడ కొండ శిఖరం మీద నా ఎదుట నిలబడు.
3 నీతో ఇంక ఏ వ్యక్తీ రావడానికి వీలులేదు. కొండమీద ఎక్కడా ఏ వ్యక్తి కనబడకూడదు. కనీసం ఆ కొండ కిందకూడ నీ పశువుల మందలు కాని, గొర్రెల మందలు గాని మేత కూడ మేయకూడదు.”
4 కనుక మొదటి వాటిలాగే మరో రెండు రాతి పలకలను మోషే చేసాడు. ఆ మర్నాడు ఉదయాన్నే సీనాయి కొండ మీదికి అతడు వెళ్లాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ప్రకారమే అంతా చేసాడు. ఆ రెండు రాతి పలకలను మోషే తీసుకొని వెళ్లాడు.
5 మోషే కొండ మీద ఉన్నప్పుడు, ఒక మేఘం మీద యెహోవా దిగి వచ్చాడు. అక్కడ మోషే దగ్గర యెహోవా నిలబడ్డాడు. అతడు యెహోవాను పేరుపెట్టి పిలిచాడు.
6 మోషే ఎదుట యెహోవా దాటి వెళ్తూ ఇలా అన్నాడు: “యెహోవా దయ, జాలిగల దేవుడు. యెహోవా త్వరగా కోపపడడు. యెహోవా మహా ప్రేమపూర్ణుడు. యెహోవా నమ్ముకోదగినవాడు.
7 వేలాది తరాలకు దయచూపించే వాడు యెహోవా. ప్రజలు చేసే తప్పులను యెహోవా క్షమిస్తాడు. అయితే నేరస్తులను శిక్షించడం యెహోవా మరచిపోడు. నేరస్తులను యెహోవా శిక్షించడమే కాదు, వారు చేసే తప్పులవల్ల వారి పిల్లలు, మనుమళ్లు, మూడు నాలుగు తరాల వరకు శ్రమ అనుభవిస్తారు.”
8 వెంటనే మోషే సాష్టాంగపడి యెహోవాను ఆరాధించాడు. మోషే ఇలా అన్నాడు:
9 “ప్రభూ, నా విషయం నీకు ఇష్టమైతే దయచేసి మాతోకూడా రమ్ము. వీళ్లు మొండి ప్రజలని నాకు తెలుసు. అయితే మేము చేసిన తప్పుల విషయంలో మమ్మల్ని క్షమించు. మమ్మల్ని నీ ప్రజలుగా స్వీకరించు.”
10 అప్పుడు యెహోవా చెప్పాడు: “నీ ప్రజలందరితో నేను ఈ ఒడంబడికను చేస్తున్నాను. భూమి మీద ఈ జనం కోసం ఇదివరకు ఎన్నడూ చేయని అద్భుతకార్యాలు నేను చేస్తాను. యెహోవానైన నేను మహాఘనుడనని నీతో ఉన్న ప్రజలు చూస్తారు. నేను నీ కోసం చేసే అద్భుత కార్యాలను వారు చూస్తారు.
11 ఈ వేళ నీకు నేను ఆజ్ఞాపిస్తున్న విషయాలకు లోబడు, నీ శత్రువులు నీ దేశము వదలివెళ్లి పోయేటట్టు నేను వారిని బలవంతం చేస్తాను. అమోరీయులను, కనానీయలను, హిత్తీయులను, పెరిజీయులను, హివ్వీయులను, యెబసీయులను నేను బయటకు వెళ్ళగొడతాను.
12 జాగ్రత్తగా ఉండు! నీవు వెళ్తోన్న దేశంలో నివసించే ప్రజలతో ఎలాంటి ఒడంబడిక చేయకు. ఆ ప్రజలతో నీవు ఏదైనా ఒడంబడిక చేస్తే, అది నీకు చిక్కు తెచ్చిపెడుతుంది.
13 అయితే వారి బలిపీఠాలు నాశనం చేయి. వారు పూజించే రాళ్లను విరుగగొట్టు. వారి విగ్రహాలను నరికి వెయ్యి.
14 మరో దేవుడ్ని ఎవర్నీ ఆరాధించవద్దు. నేను ఎల్కానా, రోషముగల యెహోవాను. అది నా పేరు. నేను ఎల్కానా, అంటే రోషముగల దేవుడ్ని.
15 “ఆ దేశములో నివసించే ప్రజలతో ఎలాంటి ఒడంబడిక చేయకుండా జాగ్రత్తగా ఉండు. నీవు గనుక అలా చేస్తే, వారు వారి వారి దేవతలను ఆరాధించేటప్పుడు వాళ్లతో కలవమని ఆ ప్రజలు నిన్ను పిలుస్తారు. వాళ్ల బలుల మాంసం నీవు తినకుండ జాగ్రత్త పడుము.
16 వారి కూతుళ్లు కొందరిని మీ కుమారులకు భార్యలుగా మీరు చేసుకుంటారేమో. ఆ కూతుళ్లు తప్పుడు దేవతలను సేవిస్తారు. మీ కుమారులు కూడా అలాగే చేసేటట్టు వారు నడిపించవచ్చు.
17 “విగ్రహాలు చేసుకోవద్దు.
18 “పులియని రొట్టెల పండుగ ఆచరించు. నేను ఇదివరకు మీతో చెప్పిన ప్రకారము పులియచేసే పదార్థం లేకుండా తయారు చేయబడిన రొట్టెలను ఏడు రోజులపాటు తినాలి. నేను ఏర్పరచుకున్న అబీబు నెలలో దీన్ని చేయాలి. ఎందుకంటే మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన నెల అది.
19 “ఒక స్త్రీకి పుట్టిన ప్రథమ శిశువు ఎల్లప్పుడూ నాకే చెందుతుంది. మీ పశువులకు, గొర్రెలకు మొదటిదిగా పుట్టే పిల్లలు కూడా నాకే చెందుతాయి.
20 మొదటిదిగ పుట్టిన ఒక గాడిదను నీవు ఉంచుకోవాలంటే ఒక గొర్రె పిల్లను యిచ్చి నీవు దాన్ని కొనుక్కోవచ్చు. అయితే నీవు ఒక గొర్రె పిల్లను యిచ్చి ఆ గాడిదను కొనకపోతే, ఆ గాడిద మెడ నీవు విరుగగొట్టాలి. ప్రథమ సంతానమైన నీ కుమారులందరినీ నా దగ్గర్నుంచి నీవు కొనాలి. కానుక లేకుండా ఏ మనిషీ నా దగ్గరకు రాకూడదు.
21 “ఆరు రోజులు నీవు పనిచేస్తావు. అయితే ఏడో రోజున నీవు విశ్రాంతి తీసుకోవాలి. నాట్లు వేసేటప్పుడు, కోత కోసేటప్పుడు గూడ నీవు విశ్రాంతి తీసుకోవాలి.
22 “నీవు వారాల పండుగ ఆచరించాలి. గోధుమ కోతలో నుండి మొదటి గింజల్ని ఈ పండుగకు వినియోగించాలి. సంవత్సరాంతములో కోతకాలపు పండుగ ఆచరించాలి.
23 “ప్రతి సంవత్సరమూ మూడుసార్లు మీ పురుషులంతా మీ యజమానీ, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోఉండేందుకు వెళ్లాలి.
24 “మీరు మీ దేశంలోకి వెళ్లినప్పుడు, ఆ దేశంలో నుండి మీ శత్రువులను నేను వెళ్లగొట్టి వేస్తాను. మీ సరిహద్దులను నేను విశాలం చేస్తాను. మీకు ఇంకా భూమి లభిస్తుంది. ప్రతి సంవత్సరం మూడు సార్లు మీరు యెహోవా దేవుని ఎదుటకి వెళ్లాలి. ఆ సమయంలో ఎవ్వరూ మీ భూమిని మీ దగ్గర నుండి తీసుకునేందుకు ప్రయత్నించరు.
25 “బలి రక్తం నీవు నాకు అర్పిస్తే పులిసిన పదార్థము ఏదీ దానితోపాటు అర్పించవద్దు.
“పస్కా భోజనంలోని మాంసం ఏ మాత్రము మరునాటి ఉదయానికి మిగులకూడదు.
26 “మీ కోతలో నుండి మొట్టమొదటి పంట యెహోవాకు ఇవ్వాలి. మీ యెహోవా దేవుని ఆలయములోనికి వాటిని తీసుకొని రావాలి.
“మేక పిల్లను దాని తల్లి పాలతో ఎన్నడూ వండకూడదు.”
27 అప్పుడు మోషేతో యెహోవా, “నేను నీకు చెప్పిన విషయాలన్నీ రాయి. నీతోను, ఇశ్రాయేలు ప్రజలతోను నేను చేసిన ఒడంబడిక విషయాలు అవి” అన్నాడు.
28 నలభై పగళ్లు నలభై రాత్రుళ్లు మోషే అక్కడే యెహోవాతో ఉన్నాడు. ఆ సమయంలో అతను భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. ఒడంబడిక మాటలు అంటే పది ఆజ్ఞలు రెండు రాతి పలకల మీద మోషే వ్రాసాడు.
ప్రకాశిస్తున్న మోషే ముఖం
29 అప్పుడు మోషే సీనాయి పర్వతం కిందికి వచ్చాడు. దేవుని ఆజ్ఞలు రాయబడ్డ ఆ రెండు రాతి పలకలనూ, అతను పట్టుకొచ్చాడు. మోషే యెహోవాతో మాట్లాడాడు. కనుక అతని ముఖం ప్రకాశిస్తూ ఉండినది. అయితే అది మోషేకు తెలియదు.
30 మోషే ముఖం మెరిసిపోతూ ప్రకాశిస్తూ ఉండటం అహరోను, ఇశ్రాయేలు ప్రజలందరూ చూశారు. అందుచేత అతని దగ్గరకు వెళ్లడానికి భయపడ్డారు.
31 అయితే మోషే వాళ్లను పిలిచాడు. కనుక అహరోను, ప్రజానాయకులు అందరూ మోషే దగ్గరకు వెళ్లారు. మోషే వాళ్లతో మాట్లాడాడు.
32 ఆ తర్వాత, ఇశ్రాయేలు ప్రజలంతా మోషే దగ్గరకు వచ్చారు. సీనాయి కొండ మీద యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞలను మోషే వారికీ ఇచ్చాడు.
33 మోషే ప్రజలతో మాట్లాడ్డం ముగించగానే తన ముఖం మీద ముసుగు కప్పుకున్నాడు.
34 యెహోవాతో మాట్లాడేందుకు ఆయన ఎదుటికి వెళ్లినప్పుడల్లా మోషే తన ముఖం మీద ముసుగు తీసివేసాడు. తరువాత మోషే బయటకు వచ్చి — యెహోవా ఆజ్ఞాపించిన విషయాలను ఇశ్రాయేలు ప్రజలకు చెప్పేవాడు.
35 మోషే ముఖం ప్రకాశంగా మెరిసిపోతున్నట్టు ప్రజలు చూసేవాళ్లు కనుక మోషే మరల తన ముఖం కప్పుకొనేవాడు. మరల యెహోవాతో మాట్లాడేందుకు వెళ్లేంతవరకు మోషే తన ముఖం పైనుండి ముసుకును తీసే వాడుకాదు.