29
యాకోబు రాహేలును కలసికొనుట
ఇంకా యాకోబు తన ప్రయాణం కొనసాగించాడు. తూర్పు దేశానికి అతడు వెళ్లాడు. యాకోబు అలా చూడగానే, పొలాల్లో ఒక బావి కనబడింది. గొర్రెల మందలు మూడు ఆ బావి దగ్గర పండుకొని ఉన్నాయి. ఆ గొర్రెలు నీళ్లు తాగే స్థలం ఆ బావి. ఆ బావిమీద ఒక పెద్ద బండ పెట్టి ఉంది. గొర్రెలన్నీ అక్కడికి రాగానే, ఆ గొర్రెల కాపరులు ఆ బావిమీద బండను దొర్లిస్తారు. అప్పుడు గొర్రెలన్నీ ఆ నీళ్లు తాగుతాయి. ఆ గొర్రెలు పూర్తిగా తాగిన తర్వాత గొర్రెల కాపరులు ఆ బండను మళ్లీ దాని స్థానంలో పెట్టేస్తారు.
“సోదరులారా, ఎక్కడి వాళ్లు మీరు?” అని ఆ గొర్రెల కాపరులను యాకోబు అడిగాడు.
“మేము హారాను వాళ్లం” అని వారు జవాబిచ్చారు.
అందుకు యాకోబు, “నాహోరు కుమారుడు లాబాను తెలుసా మీకు?” అని అడిగాడు.
“మాకు తెలుసు” అని గొర్రెల కాపరులు జవాబు ఇచ్చారు.
అప్పుడు యాకోబు “ఆయన ఎలా ఉన్నాడు?” అని అడిగాడు.
“ఆయన బాగానే ఉన్నాడు, అంతా క్షేమమే. అదిగో చూడు, ఆ వస్తున్నది ఆయన కుమార్తె. ఆమె పేరు రాహేలు, ఆయన గొర్రెలు తోలుకొస్తున్నది” అన్నారు వాళ్లు.
“చూడండి, ఇప్పుడు ఇంకా పగలు ఉంది. సూర్యాస్తమయానికి చాలా సమయం ఉంది. రాత్రి కోసం గొర్రెల్ని మందగా చేర్చటానికి ఇంకా వేళ కాలేదు. కనుక వాటికి నీళ్లు పెట్టి, మళ్లీ పొలాల్లోనికి వెళ్లనీయ్యండి” అన్నాడు యాకోబు.
కానీ గొర్రెల కాపరులు, “మందలన్నీ ఇక్కడ గుమిగూడేవరకు మేము అలా చేయటానికి వీల్లేదు. అప్పుడు మేము బావిమీద బండ దొర్లిస్తాము, గొర్రెలు నీళ్లు తాగుతాయి” అన్నారు.
కాపరులతో యాకోబు మాట్లాడుతుండగానే, రాహేలు తన తండ్రి గొర్రెలతో అక్కడికి వచ్చింది. (ఆ గొర్రెల బాధ్యత రాహేలుది.) 10 లాబాను కుమార్తె రాహేలు. యాకోబు తల్లి రిబ్కాకు సోదరుడు లాబాను. రాహేలును చూడగానే యాకోబు వెళ్లి, బండను దొర్లించి గొర్రెలకు నీళ్లు యిచ్చాడు. 11 అప్పుడు యాకోబు రాహేలును ముద్దుపెట్టుకొని ఏడ్చాడు. 12 తను ఆమె తండ్రి బంధువు అని యాకోబు రాహేలుతో చెప్పాడు. తను రిబ్కా కుమారుడనని రాహేలుతో చెప్పాడు. కనుక రాహేలు యింటికి పరుగెత్తి, తన తండ్రితో చెప్పింది.
13 తన సోదరి కుమారుడు యాకోబును గూర్చిన వార్త లాబాను విన్నాడు. అందుచేత అతణ్ణి కలుసుకొనేందుకు లాబాను పరుగెత్తాడు. లాబాను అతడ్ని కౌగిలించుకొని, ముద్దు పెట్టుకొని, తన యింటికి తీసుకొని వచ్చాడు. జరిగినదంతా యాకోబు లాబానుతో చెప్పాడు.
14 అప్పుడు లాబాను, “ఇదంతా భలే బాగుందే, అయితే నీవు నా స్వంత కుటుంబపు వాడివే సుమా” అన్నాడు. అందువల్ల యాకోబు లాబానుతో ఒక నెల అక్కడే నివసించాడు.
యాకోబు మోసపోయాడు
15 ఒకనాడు లాబాను, “జీతం లేకుండా నా దగ్గర నీవు ఇలా పనిచేస్తూ ఉండటం సరిగా లేదు. నీవు బంధువుడివి. అంతేగాని బానిసవు కావు. నేను నీకు ఏమి చెల్లించాలి?” అని యాకోబును అడిగాడు.
16 లాబానుకు యిద్దరు కుమార్తెలుండిరి. పెద్దామె లేయా, చిన్నామె రాహేలు.
17 రాహేలు అందగత్తె. లేయా కళ్ల సమస్యగలది.* 18 యాకోబు రాహేలును ప్రేమించాడు. యాకోబు “నన్ను, నీ చిన్న కుమార్తె రాహేలును పెళ్లాడనిస్తే, నేను నీకు ఏడు సంవత్సరాల పాటు పనిచేస్తాను” అని లాబానుతో చెప్పాడు.
19 “మరొకర్ని చేసుకోవడం కంటే ఆమె నిన్ను పెళ్లి చేసుకోవడం మంచిది. కనుక నా దగ్గరే ఉండు” అన్నాడు లాబాను.
20 కనుక యాకోబు అక్కడే ఉండి, లాబాను కోసం ఏడు సంవత్సరాలు పని చేసాడు. అయితే అతడు రాహేలును ప్రేమించాడు గనుక అది చాలా కొద్ది కాలంలాగే కనబడింది అతనికి.
21 ఏడు సంవత్సరాలు అయ్యాక, “రాహేలును నాకు యివ్వండి, పెళ్లి చేసుకొంటాను. నీ దగ్గర నేను చేయాల్సిన కాలం తీరిపోయింది” అని యాకోబు లాబానుతో చెప్పాడు.
22 కనుక ఆ ప్రదేశంలోని ప్రజలందరికి లాబాను విందు ఇచ్చాడు. 23 ఆ రాత్రి లాబాను తన కుమార్తె అయిన లేయాను యాకోబు దగ్గరకు తీసుకు వచ్చాడు. యాకోబు లేయాలు లైంగికంగా కలుసుకొన్నారు. 24 తన దాసి జిల్ఫాను తన కుమార్తెకు దాసీగా లాబాను ఇచ్చాడు. 25 తాను సంభోగించినది లేయా అని తెల్లవారినప్పుడు యాకోబు తెలుసుకొన్నాడు. లాబానుతో యాకోబు, “నీవు నన్ను మోసం చేసావు. నేను రాహేలును పెళ్లి చేసుకోవాలని నీ దగ్గర కష్టపడి పని చేసాను. ఎందుకు నన్ను నీవు మోసం చేసావు?” అన్నాడు.
26 లాబాను చెప్పాడు: “పెద్ద కూతురికి పెళ్లికాక ముందు చిన్న కూతురికి పెళ్లి చేయటానికి మా దేశంలో ఒప్పుకోరు. 27 అయితే పెళ్లి ఆచారంగా వారం రోజులు ముగించు, రాహేలునుకూడ పెళ్లి చేసుకొనేందుకు ఇస్తాను. కానీ నీవు మాత్రం మరో ఏడు సంవత్సరాలు నా దగ్గర పని చేయాలి.”
28 కనుక యాకోబు అలాగే వారం ముగించాడు. అప్పుడు లాబాను తన కుమార్తె రాహేలును అతనికి భార్యగా ఇచ్చాడు. 29 తన దాసీ బిల్హాను తన కుమార్తె రాహేలుకు దాసీగా ఇచ్చాడు. 30 కనుక యాకోబు రాహేలుతో కూడా సంభోగించాడు. లేయాకంటే రాహేలును యాకోబు ఎక్కువగా ప్రేమించాడు. లాబాను దగ్గర మరో ఏడు సంవత్సరాలు యాకోబు పని చేసాడు.
యాకోబు కుటుంబం పెరిగింది
31 లేయాకంటె రాహేలును యాకోబు ఎక్కువగా ప్రేమించడం యెహోవా చూశాడు. అందుచేత లేయాకు పిల్లలు పుట్టేలాగు చేసాడు యెహోవా. రాహేలుకు పిల్లలు లేరు.
32 లేయాకు ఒక కొడుకు పుట్టాడు. ఆమె అతనికి రూబేను అని పేరు పెట్టింది. “నా కష్టాలను యెహోవా చూశాడు. నా భర్త నన్ను ప్రేమించటం లేదు. ఒకవేళ నా భర్త ఇప్పుడైనా నన్ను ప్రేమిస్తాడేమో” అని లేయా అతనికి ఈ పేరు పెట్టింది.
33 లేయా మళ్లీ గర్భవతి అయింది, మరో కొడుకు పుట్టాడు. ఈ కుమారునికి షిమ్యోను అని ఆమె పేరు పెట్టింది. “నేను ప్రేమించబడటం లేదని తెలిసి యోహోవా నాకు ఈ కుమారుణ్ణి ఇచ్చాడు” అని చెప్పింది లేయా.
34 లేయా మళ్లీ గర్భవతి అయింది, మరో కొడుకు పుట్టాడు. ఆ కుమారునికి ఆమె లేవి§ అని పేరు పెట్టింది. “ఇప్పుడు నా భర్త నన్ను తప్పకుండా ప్రేమిస్తాడు. అతనికి ముగ్గురు కుమారుల్ని నేను ఇచ్చాను” అనుకొంది లేయా.
35 అప్పుడు లేయాకు మరో కొడుకు పుట్టాడు. ఈ కుమారునికి యూదా* అని ఆమె పేరు పెట్టింది. “నేను ఇప్పుడు యెహోవాను స్తుతిస్తాను” అని చెప్పి అతనికి ఆ పేరు పెట్టింది లేయా. అంతటితో ఆమెకు సంతాన ప్రాప్తి ఆగిపోయింది.
* 29:17 లేయా కళ్ల సమస్యగలది లేయా చాలా సౌందర్యవతి కాదని పరోక్షంగా చెప్పవచ్చు. 29:32 రూబేను “చూడండి, ఒక కొడుకు” అని దీని అర్థం. 29:33 షిమ్యోను “ఆయన వింటాడు” అని దీని అర్థం. § 29:34 లేవి “సన్నిహితం అవుట” అని దీని అర్థం. * 29:35 యూదా “ఆయన స్తుతించబడునుగాక” అని దీని అర్థం.