43
బెన్యామీను వెళ్లటానికి యాకోబు ఒప్పుకోవటం
దేశంలో కరువు చాలా దారుణంగా ఉంది. అక్కడ ఎలాంటి ఆహారం పండటం లేదు. ప్రజలు ఈజిప్టునుండి తెచ్చుకొన్న ధాన్యం అంతా తినేసారు. ధాన్యం అయిపోయినప్పుడు, “మళ్లీ ఈజిప్టు వెళ్లి, మనం తినేందుకు మరింత ధాన్యం కొనండి” అని యాకోబు తన కుమారులతో చెప్పాడు.
అయితే యాకోబుతో యూదా చెప్పాడు: “ఆ దేశ పాలకుడు మమ్మల్ని హెచ్చరించాడు. మీ సోదరుడ్ని మీరు నా దగ్గరకు తీసుకొని రాకపోతే నేను మీతో మాట్లాడను. బెన్యామీనును నీవు మాతో పంపిస్తేనే మేము వెళ్లి ధాన్యం కొంటాం. కానీ బెన్యామీనును పంపించేందుకు నీవు ఒప్పుకొనకపోతే మేం వెళ్లం. అతడు లేకుండా తిరిగి రావద్దని ఆయన మమ్మల్ని హెచ్చరించాడు.”
“మీకు ఇంకో సోదరుడు ఉన్నాడని అసలు మీరెందుకు చెప్పారు? ఇంత కీడు మీరెందుకు నాకు చేసారు?” ఇశ్రాయేలు (యాకోబు) అడిగాడు.
ఆ సోదరులు జవాబు చెప్పారు: “ఆ మనిషి మమ్మల్ని అనేక ప్రశ్నలు వేశాడు. మా విషయం, మా కుటుంబం విషయం అతడు తెలుసుకోవాలనుకున్నాడు, ‘మీ తండ్రి ఇంకా బతికే ఉన్నాడా? ఇంటి దగ్గర మీకు ఇంకో సోదరుడు ఉన్నాడా?’ అని అతడు మమ్మల్ని అడిగాడు. అతని ప్రశ్నలకు మాత్రమే మేము జవాబిచ్చాం. మా మిగిలిన సోదరుని కూడ తన దగ్గరకు తీసుకొని రమ్మంటాడని మాకు తెలియదు!”
అప్పుడు యూదా తన తండ్రి ఇశ్రాయేలుతో ఇలా చెప్పాడు: “బెన్యామీనును నాతో పంపించు. అతని విషయం నేను జాగ్రత్తగా చూసుకొంటాను. మేము మాత్రం ఈజిప్టు వెళ్లాలి, ఆహారం తీసుకురావాలి. మేము వెళ్లకపోతే మనమూ, మన పిల్లలు అందరం చస్తాం. అతని క్షేమం నేను చూసుకొంటాను. అతని భాద్యత నాది. అతణ్ణి నేను తిరిగి నీ దగ్గరకు తీసుకొని రాకపోతే శాశ్వతంగా నీవు నన్ను నిందించవచ్చు. 10 నీవు మమ్మల్ని వెళ్లనిచ్చి ఉంటే ఇప్పటికి రెండు సార్లు వెళ్లి వచ్చే వాళ్లం.”
11 అప్పుడు వారి తండ్రి ఇశ్రాయేలు అన్నాడు: “ఇదే గనుక నిజంగా సత్యమైతే, అలాగే బెన్యామీనును నీతే తీసుకొని వెళ్లు. అయితే ఆ పాలకునికి కానుకలు తీసుకొని వెళ్లు. మన దేశంలో మనం సంపాదించగలిగినవి కొన్ని తీసుకొని వెళ్లు. కొంచె మస్తకి, కొంచెం తేనె, సుగంధద్రవ్యాలు, బోళం, పిస్తాచ కాయలు, బాదం కాయలు, అతనికి తీసుకొని వెళ్లండి. 12 ఈ సారి రెండంతల డబ్బు మీతో తీసుకు వెళ్లండి. పోయిన సారి మీరు చెల్లించగా తిరిగి మీకు ఇవ్వబడిన సొమ్ము మళ్లీ తీసుకు వెళ్లండి. ఒకవేళ ఆ పాలకుడు పొరబడ్డాడేమో. 13 బెన్యామీనును తీసుకొని ఆ మనిషి దగ్గరకు తిరిగి వెళ్లు. 14 మీరు ఆ పాలకుని ముందర నిలిచినప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తాను. బెన్యామీను, షిమ్యోనులను అతడు క్షేమంగా తిరిగి వెళ్లనిచ్చేటట్టు నేను ప్రార్థన చేస్తాను. లేనట్లయితే నా కుమారుని పోగొట్టుకొని నేను మరల దుఃఖంలో మునిగిపోతాను.”
15 కనుక ఆ పాలకుని కోసం కానుకలన్నీ తీసుకొన్నారు ఆ సోదరులు. వారు మొదటిసారి తీసుకొని వెళ్లిన దానికి రెట్టింపు సొమ్ము వారితో కూడా తీసుకొని వెళ్లారు. బెన్యామీను ఆ సోదరులతో కలసి ఈజిప్టు వెళ్లాడు.
సోదరులకు యోసేపు ఇంటికి ఆహ్వానం
16 ఈజిప్టులో, వారితోబాటు బెన్యామీను ఉండటం యోసేపు చాశాడు. యోసేపు “ఆ మనుష్యుల్ని నా ఇంటికి తీసుకొని రండి. ఒక పశువును చంపి వంట చేయండి. ఈవేళ మధ్యాహ్నం వాళ్లు నాతోనే భోజనం చేస్తారు” అని తన గృహనిర్వాహకునితో చెప్పాడు. 17 అతను చెప్పినట్టే ఆ సేవకుడు చేసాడు. అతడు వాళ్లను యోసేపు ఇంటికి తీసుకొని వచ్చాడు.
18 వాళ్లు యోసేపు ఇంటికి తీసుకొని రాబడినప్పుడు ఆ సోదరులు భయపడ్డారు. “పోయినసారి మన సంచుల్లో డబ్బు ఉంచబడ్డందువల్లనే మనల్ని ఇక్కడకు తీసుకు వచ్చారు. మనల్ని నేరస్తులుగా నిరూపించటానికి దాన్ని వారు వినియోగిస్తారు. తర్వాత మన గాడిదల్ని దొంగిలించి, మనల్ని బానిసలుగా చేస్తారు” అని వారనుకొన్నారు.
19 కనుక యోసేపు ఇంటికి బాధ్యుడైన వాని దగ్గరకు ఆ సోదరులు వెళ్లారు. 20 వారు చెప్పారు: “అయ్యా, ప్రమాణం చేసి సత్యం చెబతున్నాం. పోయినసారి మేము వచ్చినప్పుడు ఆహారం కొనుగోలు చేసేందుకే మేం వచ్చాం. 21-22 ఇంటికి వెళ్తూ మార్గంలో మేము మా సంచులు విప్పితే మా ప్రతి ఒక్కరి సంచిలోనూ డబ్బు కనబడింది. ఆ డబ్బు అక్కడికి ఎలా వచ్చిందో మాకు తెలియదు. అయితే ఆ డబ్బు మళ్లీ మీకు ఇచ్చేయాలని ఇప్పుడు మాతో తెచ్చాం. పైగా ఇప్పుడు మేము కొనాలనుకొంటున్న ధాన్యంకోసం ఇంకా ఎక్కువ మొత్తంకూడ మళ్లీ ఇప్పుడు తెచ్చాం.”
23 అయితే ఆ సేవకుడు, “భయపడకండి, నన్ను నమ్మండి. మీ దేవుడు, మీ తండ్రి దేవుడు ఆ డబ్బును మీ సంచుల్లో కానుకగా పెట్టి ఉంటాడు. పోయిన సారి మీరు ధాన్యంకోసం డబ్బును మీరు నాకే చెల్లించినట్టు నాకు గుర్తు” అని వారితో చెప్పాడు.
ఆ సేవకుడు షిమ్యోనును చెరసాలలోనుంచి బయటకు తీసుకొని వచ్చాడు. 24 ఆ సేవకుడు వాళ్లందరిని యోసేపు ఇంటికి తీసుకొని వెళ్లాడు. అతడు వారికి నీళ్లు ఇస్తే, వాళ్లు కాళ్లు కడుక్కొన్నారు. తర్వాత అతడు వారి గాడిదలకు మేత పెట్టాడు.
25 ఆ సోదరులు తాము యోసేపుతోబాటు భోంచేయబోతున్నట్టు విన్నారు. కనుక వారు అతనికోసం తెచ్చిన కానుకల్ని మధ్యాహ్నంవరకు సిద్ధం చేసుకొన్నారు.
26 యోసేపు ఇంటికి వచ్చాడు, ఆ సోదరులు వారితో తెచ్చిన కానుకలు అతనికి ఇచ్చారు. తర్వాత వారు నేలమీద సాష్టాంగపడ్డారు.
27 వారెలా ఉన్నారని యోసేపు వాళ్లను అడిగాడు, “మీరు నాతో చెప్పిన మీ ముసలి తండ్రి క్షేమంగా ఉన్నాడా? ఆయన ఇంకా బతికే ఉన్నాడా?” అన్నాడు యోసేపు.
28 ఆ సోదరులు, “అయ్యా, మా తండ్రి బాగున్నాడు. ఆయన ఇంకా బతికి ఉన్నాడు” అని జవాబిచ్చారు. మళ్లీ వాళ్లంతా యోసేపు ముందర సాష్టాంగపడ్డారు.
29 అప్పుడు యోసేపు తన సోదరుడు బెన్యామీనును చూశాడు, (బెన్యామీను, యోసేపులు ఒక్క తల్లి పిల్లలు). “మీరు నాతో చెప్పిన మీ కనిష్ఠ సోదరుడు ఇతడేనా?” అని యోసేపు అడిగాడు. అప్పుడు యోసేపు, “కుమారుడా, దేవుడు నిన్ను ఆశీర్వదించు గాక!” అన్నాడు బెన్యామీనుతో.
30 అప్పుడు యోసేపు ఆ గదిలోనుంచి పరుగెత్తిపోయాడు. బెన్యామీను మీద తనకు ఉన్న ప్రేమను అతనికి చూపెట్టాలని యోసేపు ఎంతో ఆశించాడు. అతనికి ఏడ్చెయ్యాలనిపించింది గాని అతడు ఏడ్వటం అతని సోదరులు చూడకూడదు అనుకొన్నాడు. కనుక యోసేపు తన గదిలోనికి పెరుగెత్తి పోయి అక్కడ ఏడ్చాడు. 31 తర్వాత యోసేపు తన ముఖం కడుక్కొని బయటకు వచ్చాడు. అతడు తనను తాను ఓదార్చుకొని, “భోజనానికి వేళ అయ్యింది” అన్నాడు.
32 ఆ సేవకులు యోసేపు ఒక్కడికి ఒక బల్ల దగ్గర వేరుగాను, సోదరులను మరో బల్ల దగ్గర వేరుగాను కూర్చుండబెట్టారు. వారితో భోంచేస్తున్న ఈజిప్టు వారిని వారి మట్టుకే ఒక బల్లదగ్గర కూర్చుండ బెట్టారు. ఈజిప్టువాళ్లు హీబ్రూవారితో కలిసి భోజనం చేయరు, అది ఈజిప్టు మత విరోధం. 33 యోసేపు సోదరులు అతనికి ఎదురుగా ఇంకో బల్ల దగ్గర కూర్చున్నారు. ఆ సోదరులు జ్యేష్ఠనితో మొదలుబెట్టి కనుష్ఠుని వరకు వరసక్రమంలో కూర్చున్నారు. జరుగుతున్నదంతా ఏమిటా అన్నట్టు అన్నదమ్ములంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొంటున్నారు.* 34 సేవకులు యోసేపు బల్లమీద నుంచే వారికి భోజనం వడ్డిస్తున్నారు. అయితే ఆ సేవకులు మిగిలిన వాళ్లకంటె అయిదు రెట్లు ఎక్కువగా బెన్యామీనుకు వడ్డించారు. ఆ సోదరులు దాదాపు మత్తెక్కినంత వరకు యోసేపుతో కలిసి తిని తాగారు.
* 43:33 అన్నదమ్ములంతా … చూసుకొంటున్నారు అన్నదమ్ములు వరుసక్రమంలో యోసేపుతో కూర్చున్నారు గనుక వారికి ఆశ్చర్యమేసింది. అతనికి ఎలా తెలుసునో వారికి అర్థము కాలేదు.