హోషేయ
1
హోషేయ ద్వారా యెహోవా దేవుని సందేశం
1 బెయేరి కుమారుడైన హోషేయకు వచ్చిన యెహోవా సందేశం ఇది. ఉజ్జీయా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనువారు యూదా దేశపు రాజులుగా ఉన్న కాలంలో ఈ సందేశం వచ్చింది. యెహోవాయాషు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలు రాజుగా ఉన్న కాలం అది.
2 ఇది హోషేయకు యెహోవా ఇచ్చిన మొదటి సందేశం. “వెళ్లి ఒక వేశ్యను పెండ్లి చేసుకొని, ఆ వేశ్య ద్వారా పిల్లల్ని కనుము. ఎందుకంటే ఈ దేశంలో ప్రజలు వేశ్యల్లా ప్రవర్తించారు-వారు యెహోవాకు అపనమ్మకంగా జీవించారు” అని యెహోవా చెప్పాడు.
యెజ్రెయేలు పుట్టుక
3 కనుక దిబ్లయీము కుమార్తెయైన గోమెరును హోషేయ పెండ్లి చేసుకొన్నాడు. గోమెరు గర్భవతియై, హోషేయకు ఒక కుమారుని కన్నది.
4 యెహోవా హోషేయతో, “అతనికి యెజ్రెయేలు అని పేరు పెట్టు. ఎందుచేతనంటే యెహూ యెజ్రెయేలు లోయలో రక్తం చిందించిన కారణంగా నేను యెహూ కుటుంబాన్ని నాశనం చేస్తాను. ఆ తర్వాత ఇశ్రాయేలు రాజ్యాన్ని నేను నాశనం చేస్తాను.
5 ఆ సమయంలో యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు విల్లును నేను విరుగగొడ్తాను” అని చెప్పాడు.
లో-రూహామా పుట్టుక
6 మరల గోమెరు గర్భవతియై ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. యెహోవా హోషేయతో ఇలా చెప్పాడు: “ఆమెకు లో-రూహామా అని పేరు పెట్టు. ఎందుకంటే ఇశ్రాయేలు రాజ్యనికి నేను ఇక ఎంతమాత్రం కరుణ చూపించను. నేను వారిని క్షమించను.
7 కాని యూదా రాజ్యానికి నేను కరుణ చూపిస్తాను. యూదా రాజ్యాన్ని నేను రక్షిస్తాను. వారిని రక్షించేందుకు విల్లుగాని, ఖడ్గంగాని నేను ఉపయోగించను. వారిని రక్షించేందుకు యుద్ధ గుర్రాలను గాని, సైనికులను గాని నేను ఉపయోగించను. నేను నా స్వంత శక్తి చేతనే వారిని రక్షిస్తాను.”
లో-అమ్మీ పుట్టుక
8 గోమెరు లో-రూహామాకు చనుబాలు ఇవ్వటం చాలించగానే ఆమె మరల గర్భవతి అయ్యింది. ఆమె మరొక కుమారుని కన్నది.
9 అప్పుడు, “అతనికి లో-అమ్మీ అని పేరు పెట్టు. ఎందుచేతనంటే మీరు నా ప్రజలు కారు, నేను మీ దేవుణ్ణి కాను” అని యెహోవా చెప్పాడు.
ఇశ్రాయేలీయులు విస్తారంగా ఉంటారని యెహోవా దేవుడు వాగ్దానం చేశాడు
10 “రాబోయే కాలంలో ఇశ్రాయేలు ప్రజల సంఖ్య సముద్రపు ఇసుక రేణువుల్లా ఉంటుంది. ఇసుకను నీవు కొలవలేవు. లెక్కించ లేవు. ఏ స్థలంలోనైతే ‘మీరు నా ప్రజలు కారు’ అని వారితో చెప్పబడిందో అక్కడే ‘మీరు జీవంగల దేవుని పిల్లలు’ అని వారితో చెప్పడం జరుగుతుంది.
11 “అప్పుడు యూదా ప్రజలు మరియు ఇశ్రాయేలు ప్రజలు సమావేశపరచబడతారు. వారు ఒక పాలకుని తమకోసం ఏర్పాటు చేసుకొంటారు. మరియు వారి రాజ్యం ఆ దేశం పట్టజాలనంత పెద్దదిగా ఉంటుంది! యెజ్రెయేలు దినం నిజంగా గొప్పగా ఉంటుంది.”