11
యెఫ్తా గిలాదు వంశంవాడు. అతడు బలమైన సైనికుడు. అయితే యెఫ్తా ఒక వేశ్య కుమారుడు. అతని తండ్రి పేరు గిలాదు. గిలాదు భార్యకు చాలామంది కుమారులు ఉన్నారు. ఆ కుమారులు పెద్దవారైనప్పుడు, యెఫ్తా అంటే వారికి ఇష్టంలేకపోయింది. ఆ కుమారులు యెఫ్తాను అతని స్వగ్రామం నుండి బలవంతంగా వెళ్లగొట్టారు. “మా తండ్రి ఆస్తిలో నీకు ఎలాంటి భాగం లేదు. నీవు మరో స్త్రీ కుమారుడివి” అని వారు అతనితో చెప్పారు. కనుక యెఫ్తా తన సోదరుల మూలంగా వెళ్లిపోయాడు. అతడు టోబు దేశంలో నివసించాడు. టోబు దేశంలో కొందరు అల్లరి జనం యెఫ్తాను వెంబడించటం మొదలు పెట్టారు.
కొంతకాలం తర్వాత అమ్మోనీ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేశారు. అమ్మోనీయులు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేస్తున్నారు గనుక గిలాదులోని పెద్దలు (నాయకులు) యెఫ్తా దగ్గరకు వెళ్లారు. యెఫ్తాటోబు దేశం విడిచిపెట్టి, గిలాదుకు తిరిగి రావాలని వారు కోరారు.
ఆ పెద్దలు, “మనం అమ్మోనీయులతో యుద్ధం చేయగలిగేటట్టు, నీవు వచ్చి మాకు నాయకునిగా ఉండు” అని యెఫ్తాతో చెప్పారు.
కానీ యెఫ్తా, “మీరే నన్ను నా తండ్రి ఇంటి నుండి బలవంతంగా వెళ్లగొట్టారు. నేనంటే మీకు అసహ్యం. కనుక మీకు కష్టం వచ్చిందని మీరు ఇప్పుడు నా దగ్గరకు రావటం ఎందుకు?” అని గిలాదు దేశపు పెద్దలను (నాయకులను) అడిగాడు.
“ఆ కారణం వల్లనే ఇప్పుడు మేము నీ దగ్గరకు వచ్చాము. దయచేసి మాతో వచ్చి అమ్మోనీయుల మీద యుద్ధం చేయి. గిలాదులో నివసిస్తున్న ప్రజలందరి మీద నీవు సైన్యాధికారిగా ఉంటావు” అని గిలాదు పెద్దలు యెఫ్తాతో చెప్పారు.
అప్పుడు యెఫ్తా, “నేను గిలాదుకు తిరిగి వచ్చి, అమ్మోనీయులతో యుద్ధం చేయాలని మీరు కోరితే, మంచిదే. కానీ గెలిచేందుకు యెహోవా నాకు సహాయం చేస్తే, అప్పుడు మీకు నేను కొత్త నాయకునిగా ఉంటాను” అని గిలాదు పెద్దలతో చెప్పాడు.
10 గిలాదు పెద్దలు (నాయకులు), “మనం చెప్పుకొంటున్నది అంతా యెహోవా వింటున్నాడు. మేము చేయాలని నీవు చెప్పేది అంతా మేము చేస్తామని వాగ్దానం చేస్తున్నాము” అని యెఫ్తాతో చెప్పారు.
11 కనుక గిలాదు పెద్దలతో యెఫ్తా వెళ్లాడు. ఆ ప్రజలు యెఫ్తాను తమ నాయకునిగా, సైన్యాధికారిగా చేసుకున్నారు. మిస్పా పట్టణంలో యెహోవా ఎదుట యెఫ్తా తన మాటలన్నింటినీ మళ్లీ చెప్పాడు.
అమ్మోను రాజు వద్దకు యెఫ్తా సందేశకులను పంపుట
12 అమ్మోను ప్రజల రాజు దగ్గరకు యెఫ్తా సందేశకులను పంపించాడు. ఆ సందేశకులు రాజుకు ఈ సందేశం అందించారు: “అమ్మోను ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు మధ్యగల సమస్య ఏమిటి? మాపై యుద్ధానికి నీవెందుకు వచ్చావు?”
13 అమ్మోను ప్రజల రాజు, “ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుండి వచ్చినప్పుడు, వారు మా భూమిని ఆక్రమించుకున్నారు గనుక ఇశ్రాయేలీయులతో మేము యుద్ధం చేస్తున్నాము. అమ్మోను నది నుండి యబ్బోకు నది వరకు, యోర్దాను నది వరకు వారు మా భూమిని ఆక్రమించారు. ఇప్పుడు మా భూమిని శాంతియుతంగా తిరిగి మాకు ఇచ్చివేయమని ఇశ్రాయేలీయులతో చెప్పండి” అని యెఫ్తా సందేశకులతో చెప్పాడు.
14 యెఫ్తా సందేశకులు ఈ సందేశాన్ని తిరిగి యెఫ్తాకు అందించారు. అప్పుడు యెఫ్తా ఆ సందేశకులను తిరిగి అమ్మోనీయుల రాజు దగ్గరకు పంపించాడు. 15 వారు తిరిగి తీసుకుని వెళ్లిన సందేశం ఇది:
 
“యెఫ్తా చెప్పేది ఇది: మోయాబు ప్రజల భూమిగాని, అమ్మోను ప్రజల భూమిగాని ఇశ్రాయేలీయులు తీసుకోలేదు. 16 ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలోనికి వెళ్లారు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రానికి వెళ్లారు. తర్వాత వారు కాదేషు వెళ్లారు. 17 ఇశ్రాయేలీయులు ఎదోము రాజు దగ్గరకు సందేశకులను పంపించారు. ఒక సహాయం కోసం ఆ సందేశకులు అడిగారు. ‘ఇశ్రాయేలు ప్రజలను నీ దేశంలో నుండి పోనియ్యి’ అని వారు అడిగారు. కానీ ఎదోము రాజు మమ్మల్ని వారి దేశంలో నుండి వెళ్లనివ్వ లేదు. అదే సందేశాన్ని మేము మోయాబు రాజుకు కూడ పంపించాము. కానీ మోయాబు రాజుగూడ మమ్మల్ని తన దేశంలోనుండి వెళ్లనివ్వలేదు. కనుక ఇశ్రాయేలు ప్రజలు కాదేషులో నిలిచిపోయారు.
18 “తర్వాత ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నుండి, ఎదోము, మోయాబు దేశాల సరిహద్దుల నుండి తిరిగి వెళ్లారు. ఇశ్రాయేలు ప్రజలు మోయాబు దేశానికి తూర్పు దిశగా ప్రయాణం చేశారు. అర్నోను నదికి అవతలవైపు వారు విడిది చేసారు. మోయాబు దేశ సరిహద్దును వారు దాటలేదు. (అర్నోను నది మోయాబు దేశానికి సరిహద్దు.)
19 “తర్వాత ఇశ్రాయేలీయులు అమ్మోరీయుల రాజు సీహోను దగ్గరకు సందేశకులను పంపించారు. సీహోను హెష్బోను పట్టణపు రాజు, “ఇశ్రాయేలు ప్రజలను నీ దేశంలో నుండి వెళ్లనియ్యి. మేము మా దేశానికి వెళ్లగోరుతున్నాము.” అని ఆ సందేశకులు సీహోనుతో చెప్పారు. 20 కానీ అమ్మోరీయుల రాజు సీహోను ఇశ్రాయేలు ప్రజలను తన సరిహద్దులు దాటనివ్వలేదు. సీహోను తన ప్రజలందరినీ సమావేశపరచి, యాహసు దగ్గర విడిది చేసాడు. అప్పుడు అమ్మోరీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసారు. 21 అయితే సీహోనును, అతని సైన్యాన్ని ఓడించేందుకు ఇశ్రాయేలు దేవుడు యెహోవా, ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేసాడు. కనుక అమ్మోరీయుల దేశం ఇశ్రాయేలీయుల ఆస్తి అయింది. 22 కనుక అమ్మోరీయుల దేశం అంతా ఇశ్రాయేలీయుల వంశం అయింది. ఆ దేశం అర్నోను నదినుండి యబ్బోకు నదివరకు ఉంది. ఆ దేశం అరణ్యంనుండి యోర్దాను నదివరకు ఉంది.
23 “అమ్మోరీ ప్రజలను వారి దేశంనుండి వెళ్లగొట్టినవాడు యెహోవా, ఇశ్రాయేలు దేవుడు. మరియు ఆ దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ఈ దేశాన్ని విడిచి వెళ్లిపోయేట్టు నీవు చేయగలవని అనుకొంటున్నావా? 24 నీ కెమోషు దేవత నీకు ఇచ్చిన దేశంలో నిశ్చయంగా నీవు ఉండవచ్చును. కనుక మా యెహోవా దేవుడు మాకు ఇచ్చిన దేశంలో మేము ఉంటాము. 25 సిప్పోరు కుమారుడు బాలాకు* కంటె నీవు మంచివాడవా? అతను మోయాబు దేశానికి రాజు. అతడు ఇశ్రాయేలు ప్రజలతో ఏమైనా వాదించాడా? అతడు ఇశ్రాయేలు ప్రజలతో నిజంగా యుద్ధం చేశాడా? 26 హెష్బోను పట్టణంలో, దాని చుట్టూరా ఉన్న ఊళ్లలోను మూడువందల సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నివసించారు. ఇశ్రాయేలు ప్రజలు అరోయేరు చుట్టూరా ఉన్న ఊళ్ళలోను మూడువందల సంవత్సరాలు నివసించారు. అర్నోను నది పొడవునా ఉన్న పట్టణాలు అన్నింటిలోనూ ఇశ్రాయేలు ప్రజలు మూడువందల సంవత్సరాలు నివసించారు. ఆ కాలమంతటిలోనూ ఈ పట్టణాలను తీసుకునేందుకు నీవు ఎందుకు ప్రయత్నం చేయలేదు? 27 ఇశ్రాయేలు ప్రజలు నీకు విరోధంగా పాపం చేయలేదు. కానీ నీవు ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా చాలా చెడ్డ పని చేస్తున్నావు. ఇశ్రాయేలు ప్రజలు సరియైనది చేస్తున్నారో, అమ్మోనీయులు సరియైనది చేస్తున్నారో అనేది నిజమైన న్యాయమూర్తి యెహోవా నిర్ణయించునుగాక!”
 
28 యెఫ్తా దగ్గర్నుండి వచ్చిన ఈ సందేశాన్ని అమ్మోనీయుల రాజు నిరాకరించాడు.
యెఫ్తా వాగ్దానం
29 అప్పుడు యెహోవా అత్మ యెఫ్తా మీదికి వచ్చింది. గిలాదు, మనష్షే ప్రాంతాలలో యెఫ్తా సంచారం చేశాడు. అతడు గిలాదులోని మిస్పా పట్టణానికి వెళ్లాడు. గిలాదులోని మిస్పా పట్టణంనుండి యెఫ్తా అమ్మోనీయుల దేశంలోనికి వెళ్లాడు.
30 యెహోవాకు యెఫ్తా ఒక ప్రమాణం చేసాడు, “అమ్మోనీయులను నేను ఓడించేటట్టుగా నీవు చేస్తే, 31 ఆ విజయంతో నేను తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటిలోనుండి మొట్టమొదట బయటకు వచ్చేదానిని నేను నీకు అర్పిస్తాను. దానిని నేను దహన బలిగా యెహోవాకు అర్పిస్తాను” అని అతడు చెప్పాడు.
32 అప్పుడు యెఫ్తా అమ్మోనీ ప్రజల దేశం వెళ్ళాడు. అమ్మోనీయులతో యెఫ్తా యుద్ధం చేశాడు. వారిని ఓడించటానికి యెహోవా అతనికి సహాయం చేశాడు. 33 అరోయేరు పట్టణంనుండి మిన్నీతు పట్టణం వరకు అతడు వారిని ఓడించాడు. యెఫ్తా ఇరవై పట్టణాలను పట్టుకొన్నాడు. ఆబేల్కెరామీము పట్టణంవరకు అమ్మోనీయులతో అతడు పోరాడాడు. ఇశ్రాయేలీయులు అమ్మోనీ ప్రజలను ఓడించారు. అది అమ్మోనీ ప్రజలకు ఒక గొప్ప పరాజయం.
34 యెఫ్తా తిరిగి మిస్పా వెళ్లాడు. యెఫ్తా తన ఇంటికి వెళ్లగా, అతని కుమార్తె అతన్ని ఎదుర్కొనేందుకు ఇంటిలో నుండి బయటకు వచ్చింది. ఆమె తంబుర వాయిస్తూ, నాట్యం చేస్తూ వచ్చెను. ఆమె అతనికి ఒక్కతే కుమార్తె. యెఫ్తా ఆమెను ఎంతో ప్రేమించాడు. యెఫ్తాకు ఇంకా కుమారులు, కుమార్తెలు ఎవరూ లేరు. 35 యెఫ్తా ఇంటి నుండి మొట్టమొదట బయటకు వచ్చింది తన కుమార్తె అని అతడు చూడగానే, అతడు తన దుఃఖాన్ని వ్యక్తం చేయటానికి తన బట్టలు చింపివేసికున్నాడు. అప్పుడు అతడు, “అయ్యో, నా కుమారీ, నీవు నన్ను దుఃఖంతో నింపివేశావు. నీవు నన్ను ఎంతో ఎంతో భాధపెట్టేశావు. యెహోవాకు నేను వాగ్దానం చేశాను, దానిని నేను మార్చలేను” అని చెప్పాడు.
36 అప్పుడు అతని కుమార్తె, “నా తండ్రీ, నీవు యెహోవాకు ఒక వాగ్దానం చేశావు. కనుక నీ వాగ్దానం నిలబెట్టుకో. నీవు చెప్పినట్టే చేయి. నీ శత్రువులైన అమ్మోనీయులను ఓడించటానికి యెహోవాయేగదా నీకు సహాయం చేసాడు” అని యెఫ్తాతో చెప్పింది.
37 అప్పుడు యెఫ్తా కుమార్తె, “అయితే నా కోసం ముందుగా ఈ ఒక్కటి చేయి. రెండు నెలలు నన్ను ఏకాంతంగా ఉండనివ్వు. నన్ను కొండలకు వెళ్లనివ్వు. నేను పెళ్లి చేసుకోను, పిల్లలు ఉండరు, కనుక నన్ను నా స్నేహితురాండ్రను కలిసి ఏడ్వనివ్వు” అని తన తండ్రితో చెప్పింది.
38 “వెళ్లి అలాగే చేయి” అని చెప్పాడు యెఫ్తా. రెండు నెలల కోసం యెఫ్తా ఆమెను పంపించివేశాడు. యెఫ్తా కుమార్తె, ఆమె స్నేహితురాండ్రు కొండలలో నివసించారు. ఆమెకు పెళ్లి, పిల్లలు ఉండరు కనుక వారు ఆమె కోసం ఏడ్చారు.
39 రెండు నెలల అనంతరం, యెఫ్తా కుమార్తె తన తండ్రి దగ్గరకు తిరిగి వచ్చింది. యెఫ్తా యెహోవాకు వాగ్దానం చేసిన ప్రకారమే జరిగించాడు. యెఫ్తా కుమార్తెకు ఎవరితోనూ ఎన్నడూ లైంగిక సంబంధాలు లేవు. కనుక ఇశ్రాయేలులో ఇది ఒక ఆచారం అయ్యింది. 40 గిలాదు వాడైన యెఫ్తా కుమార్తెను ఇశ్రాయేలు స్త్రీలు ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటారు. యెఫ్తా కుమార్తె కోసం ఇశ్రాయేలు స్త్రీలు ప్రతి సంవత్సరం నాలుగు రోజుల పాటు ఏడుస్తారు.
* 11:25 సిప్పోరు కుమారుడు బాలాకు సంఖ్యా. 22-24వ అధ్యాయం చూడండి.