5
దెబోరా గీతం
ఇశ్రాయేలు ప్రజలు సీసెరాను ఓడించిన రోజున దెబోరా, అబీనోయము కుమారుడు బారాకు ఈ గీతం పాడారు:
 
“ఇశ్రాయేలు మనుష్యులు యుద్ధానికి సిద్ధమయ్యారు.
యుద్ధానికి వెళ్లేందుకు ప్రజలు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చారు.
యెహోవాను స్తుతించండి.
 
“రాజులారా, వినండి.
అధికారులారా గమనించండి!
నేను పాడుతాను.
నా మట్టుకు నేనే యెహోవాకు గానం చేస్తాను.
యెహోవాకు, ఇశ్రాయేలు ప్రజల దేవునికి
నేను సంగీతం గానం చేస్తాను.
 
“యెహోవా, గతంలో నీవు శేయీరు* దేశం నుండి వచ్చావు.
ఎదోము దేశం నుండి నీవు సాగిపోయావు.
నీవు నడువగా భూమి కంపించింది.
ఆకాశాలు వర్షించాయి.
మేఘాలు నీళ్లు కురిపించాయి.
సీనాయి పర్వత దేవుడగు యెహోవా ఎదుట
ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా ఎదుట పర్వతాలు కంపించాయి.
 
“అనాతు కుమారుడు షమ్గరు రోజుల్లో యాయేలు రోజుల్లో,
రహదారులు ఖాళీ అయ్యాయి.
ప్రయాణీకుల ఒంటెలు వెనుక దారుల్లో వెళ్లాయి.
 
“దెబోరా, నీవు వచ్చేవరకు,
ఇశ్రాయేలుకు నీవు ఒక తల్లిగా వచ్చేవరకు
సైనికులు లేరు ఇశ్రాయేలులో సైనికులు లేరు.
 
“వారు కొత్త దేవతలను అనుసరించాలని కోరుకొన్నారు.
అందుచేత వారి పట్టణ ద్వారాల వద్ద వారు పోరాడవలసి వచ్చింది.
నలభైవేల మంది ఇశ్రాయేలు సైనికుల్లో
ఎవరివద్దా ఒక డాలుగాని, బల్లెంగాని లేదు.
 
“నా హృదయం ఇశ్రాయేలు సైన్యాధికారులతోనే ఉంది.
ఈ సైన్యాధికారులు ఇశ్రాయేలీయుల కోసం పోరాడేందుకు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చారు.
యెహోవాను స్తుతించండి!
 
10 “తెల్లగాడిదల మీద ప్రయాణం చేసే ప్రజలారా,
వాటి వీపు మీద తివాచీ
లపై కూర్చొనే ప్రజలారా,
దారిలో ప్రయాణం చేసే ప్రజలారా గమనించండి!
11 యెహోవా విజయాలను గూర్చి ఇశ్రాయేలీయుల మధ్య
యెహోవా సైనికుల విజయాలను గూర్చి
యెహోవా ప్రజలు పట్టణ ద్వారాల్లో పోరాడేందుకు వెళ్లినప్పటి విషయాలను గూర్చి
పశువులు నీళ్లు త్రాగే చోట్ల తాళాల శబ్దాలతో వారు చెప్పుకొంటున్నారు.
 
12 “దెబోరా మేలుకో, మేలుకో!
మేలుకో, మేలుకో, ఒక పాట పాడు!
బారాకూ లెమ్ము!
అబీనోయము కుమారుడా, వెళ్లి, నీ శత్రువులను పట్టుకో!
 
13 “ఆ సమయంలో బతికి ఉన్నవారు నాయకుల దగ్గరకు వచ్చారు.
యెహోవా ప్రజలు సైనికులతో కలిసి నా దగ్గరకు వచ్చారు.
 
14 “అమాలేకు కొండ దేశంలో
ఎఫ్రాయిము మనుష్యులు స్థిరపడ్డారు.
బెన్యామీనూ, ఆ మనుష్యులు నిన్నూ,
నీ ప్రజలను వెంబడించారు.
మాకీరు కుటుంబ వంశంనుండి సైన్యాధికారులు దిగి వచ్చారు.
జెబూలూను వంశం నుండి ఇత్తడి దండం పట్టి నడిపించు వారు వచ్చారు.
15 ఇశ్శాఖారు నాయకులు దెబోరాతో ఉన్నారు.
ఇశ్శాఖారు వంశం వారు బారాకునకు నమ్మకంగా ఉన్నారు.
ఆ మనుష్యులు లోయలోనికి కాలి నడకన సాగిపోయారు.
 
“రూబేనీయులలో బహు గొప్పగా హృదయ పరిశోధన జరిగింది.
16 అలాగైతే, మీరంతా గొర్రెల దొడ్ల గోడల వద్ద ఎందుకు కూర్చొన్నారు?
రూబేను, వారి సాహస సైనికులు యుద్ధం గూర్చి గట్టిగా తలచారు.
కానీ వారు గొర్రెల కోసం వాయించిన సంగీతం వింటూ, ఇంటి వద్దనే కూర్చుండిపోయారు.
17 గిలాదువారు యోర్దానుకు ఆవలివైపున వారి గుడారాల్లోనే ఉండిపోయారు.
దాను ప్రజలారా,
మీరు మీ ఓడల దగ్గరే ఎందుకు ఉండిపోయారు?
ఆషేరు వంశం వారు సముద్ర తీరంలోనే ఉండిపోయారు.
క్షేమ కరమైన ఓడ రేవుల్లోనే వారు ఉండి పోయారు.
 
18 “కానీ జెబూలూను మనుష్యులు
నఫ్తాలి మనుష్యులు ఆ కొండల మీద పోరాడేందుకు వారి ప్రాణాలకు తెగించారు.
19 రాజులు వచ్చారు, వారు యుద్ధం చేసారు.
కనాను రాజులు మెగిద్దో జలాల వద్ద తానాకు పట్టణం దగ్గర (కనాను రాజులు) యుద్ధం చేసారు.
కానీ వారు ఐశ్వర్యం ఏమీ ఇంటికి తీసుకుని పోలేదు.
20 నక్షత్రాలు ఆకాశంలోనుంచి పోరాడాయి.
నక్షత్రాలు, వాటి మార్గం నుండి అవి సీసెరాతో పోరాడాయి.
21 కీషోను నది ప్రాచీన నది.
ఆ కీషోను నది సీసెరా మనుష్యులను తుడిచిపెట్టింది.
నా ప్రాణమా, బలము కలిగి ముందుకు సాగిపో.
22 గుర్రాల డెక్కలు నేలను అదరగొట్టాయి.
సీసెరా బలమైన గుర్రాలు పరుగులు తీసాయి.
 
23 “ ‘మేరోజు పట్టణాన్ని శపించండి’
అని యెహోవా దూత చెప్పాడు.
‘వారు యెహోవాకు సహాయం చేసేందుకు,
యెహోవాకు సైనికులను ఇచ్చేందుకు రాలేదు గనుక వారిని శపించండి.’
24 కనానీయుడైన హెబెరు భార్య యాయేలు.
ఆమె స్త్రీలలో దీవెన నొందును.
25 సీసెరా నీళ్లను అడిగెను.
యాయేలు అతనికి పాలను ఇచ్చెను.
తరువాత సర్దారులకు తగిన పాత్రతో
మీగడ తెచ్చియిచ్చెను.
26 మరియు యాయేలు డేరా మేకు చేత పట్టుకొనెను.
పనివారు ఉపయోగించు సుత్తెను కుడి చేత పట్టుకొనెను.
తరువాత మేకుతో అతని తలను పగులగొట్టెను.
అప్పుడు సీసెరా కణత పగిలి అక్కడే పడిపోయెను.
27 యాయేలు పాదాల మధ్య కుప్ప కూలిపోయాడు
అతను పడిపోయాడు. అతను అక్కడే పడి ఉన్నాడు!
ఆమె పాదాల మధ్య అతడు కుప్పకూలిపోయాడు.
అతడు పడిపోయాడు!
సీసెరా ఎక్కడ పడ్డాడో
అక్కడ కూలిపోయాడు. చనిపోయాడు!
 
28 “సీసెరా తల్లి కిటికీలోంచి చూసి ఏడుస్తు వున్నది.
సీసెరా తల్లి తెరలలో నుండి చూస్తు వున్నది,
‘సీసెరా రథం ఎందుకు ఆలస్యమైంది?
అతని రథం, గుర్రాల ధ్వనులు ఎందుకు ఆలస్యం అయ్యాయి.’
 
29 “ఆమె పరిచారికలలో అతి తెలివిగల ఒకతె ఆమెకు బవాబిస్తుంది.
అవును, సేవకురాలు ఆమెకు జవాబిస్తుంది.
30 ‘నిశ్చయంగా వారు గెలిచారు!
వారు ఓడించిన ప్రజలనుండి వస్తువులను వారు తీసుకుంటున్నారు!
వారిలో వారు ఆ వస్తువులను పంచుకొంటున్నారు!
ఒక్కో సైనికుడు ఒకరు లేక ఇద్దరు అమ్మాయిలను తీసుకుంటున్నారు.
ఒక వేళ సీసెరా రంగు వేయబడిన ఒక గుడ్డ ముక్క తీసుకుంటున్నాడేమో.
అదీ సంగతి! విజయ శాలి సీసెరా ధరించేందుకు ఒకటి రెండు విచిత్ర బుట్టా నేత బట్టలు తెచ్చుకుంటున్నాడు కాబోలు.’
 
31 “యెహోవా, నీ శత్రువులంతా ఇలానే మరణించెదరు గాక!
కానీ నిన్ను ప్రేమించే మనుష్యులందరూ తేటగా ప్రకాశించే సూర్యునిలా ఉందురు గాక!”
 
ఆ దేశంలో 40 సంవత్సరాల వరకు శాంతి నెలకొన్నది.
* 5:4 శేయీరు ఎదోము యొక్క మరో పేరు. 5:6 షమ్గరు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతి. న్యాయాధిపతులు 3:31 చూడండి. 5:10 తివాచీ ఒక విధమైన రత్న కంబళి.