8
ఎఫ్రాయిము వారికి గిద్యోను మీద కోపం వచ్చింది. ఎఫ్రాయిము వారికి గిద్యోను కనబడినప్పుడు, “ఎందుకు నీవు మాపట్ల ఇలా వ్యవహరించావు. నీవు మిద్యాను ప్రజలమీద యుద్ధానికి వెళ్లినప్పుడు నీవు మమ్మల్ని ఎందుకు పిలవలేదు?” అని వారు గిద్యోనును అడిగారు.
ఎఫ్రాయిము మనుష్యులకు గిద్యోను ఇలా జవాబు ఇచ్చాడు: “మీరు చేసినట్టు నేనేమీ చేయలేదు. మా అబీయెజెరు వంశస్థులకంటె, మీ ఎఫ్రాయిము వారికి ఎక్కువ పంట వచ్చింది. కోతకాలంలో మా వారు కూర్చే ద్రాక్షపళ్లకంటె, మీరు పొలంలో పరిగె విడిచిపెట్టే ద్రాక్షపళ్లు ఎక్కువ ఉంటాయి. అది నిజం కాదా? (అలాగే, ఇప్పుడు కూడా మీకు ఎక్కువ పంట వచ్చింది) మిద్యాను నాయకులు ఓరేబు, జెయేబలను పట్టుకొనేందుకు దేవుడు మీకు అనుమతి ఇచ్చాడు. మీరు చేసినదానితో నా విజయాన్ని నేను ఎలా పోల్చుకోగలను?” గిద్యోను మాటలు ఎఫ్రాయిము వారు విన్నప్పుడు, వారు ముందు కోపపడినంత కోపపడలేదు.
మిద్యాను రాజులు ఇద్దరిని గిద్యోను పట్టుకున్నాడు
అప్పుడు గిద్యోను, అతని మూడు వందల మంది మనుష్యులు యోర్దాను నది దగ్గరకు వచ్చి దానిని దాటి అవతలికి వెళ్లారు. కానీ వారు అలసిపోయి ఆకలితో* ఉన్నారు, “నా సైనుకులు భోజనం చేసేందుకు ఏమైనా పెట్టండి. నా సైనికులు చాలా అలసిపోయారు. మిద్యాను రాజులు జెబహు, సల్మున్నాలను మేము ఇంకా తరుముతున్నాము” అని గిద్యోను సుక్కోతు పట్టణం వారితో చెప్పాడు.
కానీ సుక్కోతు పట్టణ నాయకులు, “నీ సైనికులు భోజనం చేసేందుకు ఏదైనా మేము ఎందుకు పెట్టాలి? జెబహు, సల్మున్నాలను మీరు ఇంకా పట్టుకోలేదు గదా?” అని గిద్యోనుతో చెప్పారు.
అప్పుడు గిద్యోను, “మీరు మాకు భోజనం పెట్టరు. జెబహు, సల్మున్నాలను పట్టుకొనేందుకు యెహోవా నాకు సహాయం చేస్తాడు. ఆ తర్వాత నేను తిరిగి ఇక్కడికి వస్తాను. అడవి ముళ్లకంపతోను, నూర్చుకొయ్యతోను మిమ్మల్ని కొడతాను” అని చెప్పాడు.
గిద్యోను సుక్కోతు పట్టణం విడిచి, పెనూయేలు పట్టణం వెళ్లాడు. సుక్కోతు వారిని అడిగినట్టే, గిద్యోను భోజనం కోసం పెనూయేలు వారిని అడిగాడు. కాని సుక్కోతు వారు ఇచ్చిన జవాబే పెనూయేలు వారు గిద్యోనుకు ఇచ్చారు. కనుక గిద్యోను, “నేను విజయం సాధించిన తర్వాత, నేను ఇక్కడకు తిరిగి వచ్చి ఈ గోపురాన్ని కూలగొట్టేస్తాను” అని పెనూయేలు వారితో చెప్పాడు.
10 జెబహు, సల్మున్నా, వారి సైన్యం కర్కోరు పట్టణంలో ఉన్నారు. వారి సైన్యంలో పదిహేను వేలమంది సైనికులు ఉన్నారు. తూర్పు ప్రాంతపు ప్రజలందరి సైన్యంలో మిగిలిన సైనికులు వీరు. ఆ సైన్యంలో లక్షా ఇరవై వేల మంది బలమైన సైనికులు అప్పటికే చంపివేయబడ్డారు. 11 గిద్యోను, అతని మనుష్యులు గుడారవాసుల మార్గం ఉపయోగించారు. ఆ మార్గం నోబహు, యొగ్భెహ పట్టణాలకు తూర్పున ఉంది. గిద్యోను కర్కోరు పట్టణం వచ్చి శత్రువుమీద దాడి చేశాడు. ఈ దాడిని శత్రుసైన్యం ఊహించలేదు. 12 మిద్యాను ప్రజల రాజులు జెబహు, సల్మున్నాలు పారిపోయారు. కానీ గిద్యోను ఆ రాజులను తరిమి పట్టుకొన్నాడు. గిద్యోను, అతని మనుష్యులు శత్రు సైన్యాన్ని ఓడించారు.
13 అప్పుడు యోవాషు కుమారుడైన గిద్యోను యుద్ధం నుండి తిరిగి వచ్చాడు. గిద్యోను, అతని మనుష్యులు హెరెసు కనుమ అనబడిన పర్వత మార్గం గుండా ప్రయాణం చేసి తిరిగి వచ్చారు. 14 గిద్యోను సుక్కోతు పట్టణం నుండి ఒక యువకుని పట్టుకొన్నాడు. గిద్యోను ఆ యువకుని కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ యువకుడు గిద్యోనుకు కొన్ని పేర్లు రాసి ఇచ్చాడు. సుక్కోతు పట్టణపు నాయకులు, పెద్ద మనుష్యుల పేర్లు ఆ యువకుడు రాసిపెట్టాడు. డెభ్భై ఏడు మంది పేర్లు అతడు ఇచ్చాడు.
15 అప్పుడు గిద్యోను సుక్కోతు పట్టణానికి వచ్చాడు. ఆ పట్టణంవారితో “ఇదిగో, జెబహు, సల్మున్నాలు. ‘అలసిపోయిన నీ సైనికులకు మేము భోజనం ఎందుకు పెట్టాలి? మీరు జెబహు, సల్మున్నాలను పట్టుకోలేదుగా?’ అంటూ మీరు నన్ను హేళన చేసారు” అని అతడు చెప్పాడు. 16 గిద్యోను సుక్కోతు పట్టణపు పెద్ద మనుష్యులను పట్టుకొని, వారిని శిక్షించేందుకు అడవినుండి తెచ్చిన ముళ్లకంపతో, నూర్చేడి కొయ్యతో వారిని కొట్టాడు. 17 పెనూయేలు పట్టణంలో ఉన్న గోపురాన్ని కూడా గిద్యోను కూలగొట్టివేశాడు. తరువాత అతడు ఆ పట్టణంలో నివసించేవారిని చంపివేశాడు.
18 అప్పుడు గిద్యోను, “తాబోరు కొండ మీద మీరు కొందరిని చంపేశారు. ఆ మనుష్యులు ఎలా ఉంటారు?” అని జెబహు, సల్మున్నాలను అడిగాడు.
“ఆ మనుష్యులు నీలాంటి వారే, వారిలో ప్రతి ఒక్కడూ యువరాజులా కనిపించాడు” అని జెబహు, సల్మున్నాలు జవాబు ఇచ్చారు.
19 “ఆ మనుష్యులు నా సోదరులు! నా తల్లి కుమారులు! యెహోవా తోడు, మీరు గనుక వారిని చంపి ఉండకపోతే ఇప్పుడు నేను మిమ్మల్ని చంపను” అన్నాడు.
20 అప్పుడు గిద్యోను యెతెరువైపు తిరిగాడు. గిద్యోను పెద్ద కుమారుడు యెతెరు. “ఈ రాజులను చంపు” అని గిద్యోను అతనితో చెప్పాడు. కాని యేతెరు చిన్న పిల్లవాడు గనుక అతడు భయపడ్డాడు. కనుక అతడు తన ఖడ్గం బయటకు తీయలేదు.
21 అప్పుడు జెబహు సల్మున్నాలు, “రా, నీవే మమ్మల్ని చంపు. నీవు మగవాడివి, ఈ పని చేయటానికి తగిన బలం ఉన్నవాడివి” అని గిద్యోనుతో చెప్పారు. కావున గిద్యోను లేచి జెబహు, సల్మున్నాలను చంపివేశాడు. అప్పుడు గిద్యోను వారి ఒంటెల మెడల మీద చంద్రాకారంలో ఉన్న నగలను తీసుకున్నాడు.
గిద్యోను ఏఫోదును తయారు చేయుట
22 ఇశ్రాయేలు ప్రజలు, “మిద్యాను ప్రజల నుండి నీవు మమ్మల్ని రక్షించావు. కనుక ఇప్పుడు నీవే మమ్మల్ని పాలించు. నీవూ, నీ కుమారుడు, నీ మనుమళ్లు మా మీద అధికారులుగా ఉండాలని మేము కోరుతున్నాము” అని గిద్యోనుతో చెప్పారు.
23 అయితే గిద్యోను, “యెహవాయే మిమ్మల్ని పాలించేవాడు. నేను మీ మీద అధికారిగా ఉండను. నా కుమారుడు మీ మీద ఏలుబడి చేయడు” అని ఇశ్రాయేలీయులతో చెప్పాడు.
24 ఇశ్రాయేలు వారు ఓడించిన మనుష్యులలో కొందరు ఇష్మాయేలీయులుండిరి. ఇష్మాయేలు మనుష్యులు బంగారు పోగులు ధరించారు. కనుక గిద్యోను: “మీరు నా కోసం ఈ ఒక్క పనిచేయండి. యుద్ధంలో మీరు తీసుకున్న బంగారు పోగులు ఒక్కొక్కరు ఒక్కొక్కటి నాకు ఇవ్వండి” అని ఇష్మాయేలు ప్రజలతో చెప్పాడు.
25 కనుక ఇష్మాయేలు ప్రజలు, “నీకు కావలసినది మేము సంతోషంగా ఇస్తాము” అని గిద్యోనుతో చెప్పారు. కనుక వారు ఒక అంగీ నేలమీద పరిచారు. 26 ఆ బంగారు పోగులు ప్రోగు చేయబడినప్పుడు వాటి బరువు నలభై మూడు పౌనులు (1,700 తులములు) అయినది. ఇష్మాయేలు ప్రజలు గిద్యోనుకు ఇచ్చిన ఇతర కానుకలు ఈ బరువులో లేవు. చంద్రాకారములో ఉన్న నగలు, వంకాయరంగు వస్త్రాలు వారు అతనికి ఇచ్చారు. ఈ వస్తువులు మిద్యాను ప్రజల రాజులు ధరించినవి. మిద్యాను రాజుల ఒంటెల మీది గొలుసులను కూడ వారు అతనికి ఇచ్చారు.
27 ఒక ఏఫోదు చేసేందుకు గిద్యోను ఆ బంగారాన్ని ఉపయోగించాడు. అతడు తన స్వంత ఊరు ఒఫ్రాలో ఆ ఏఫోదును ఉంచాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ ఏఫోదును పూజించారు. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి నమ్మకంగా ఉండక, ఏఫోదును పూజించారు. గిద్యోను మరియు అతని కుటుంబము పాపం చేసేందుకు ఆ ఏఫోదు ఒక ఉచ్చులా తయారైంది.
గిద్యోను మరణం
28 మిద్యాను ప్రజలు ఇశ్రాయేలు ప్రజల పాలన క్రింద ఉండేందుకు బలవంతం చేయబడ్డారు. మిద్యాను ప్రజలు ఇంకెంత మాత్రం చిక్కు కలిగించలేదు. గిద్యోను జీవించినంత కాలం, నలభై సంవత్సరాలు దేశంలో శాంతి ఉంది.
29 యోవాషు కుమారుడైన యెరుబ్బయలు (గిద్యోను) ఇంటికి వెళ్లాడు. 30 గిద్యోనుకు డెభ్భై మంది సొంత కుమారులు ఉన్నారు. అతనికి చాలా మంది భార్యలు ఉన్నారు గనుక అంతమంది కుమారులు ఉన్నారు. 31 గిద్యోను దాసి ఒకతె షెకెము పట్టణంలో నివసించినది. ఆ దాసి ద్వారా అతనికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారునికి అబీమెలెకు అని అతడు పేరు పెట్టాడు.
32 యోవాషు కుమారుడైన గిద్యోను మంచి వృద్ధాప్యంలో చనిపోయాడు. గిద్యోను అతని తండ్రి యోవాషుకు స్వంతంగా ఉన్న సమాధిలో పాతిపెట్టబడ్డాడు. ఆ సమాధి అబీయెజీ వంశం వారు నివసించే ఒఫ్రా పట్టణంలో ఉంది. 33 గిద్యోను చనిపోగానే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మరలా నమ్మకంగా ఉండక, వారు బయలును వెంబడించారు. బయలు బెరీతును వారు వారి దేతవగా చేసుకున్నారు. 34 ఇశ్రాయేలు ప్రజలు చుట్టూరా నివసిస్తున్న వారి శత్రువులందరి బారి నుండి యెహోవా వారిని రక్షించినప్పటికీ, ఇశ్రాయేలు ప్రజలు వారి దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోలేదు. 35 యెరుబ్బయలు (గిద్యోను), ఇశ్రాయేలు ప్రజల కోసం ఎన్నో మంచిపనులు చేసినప్పటికీ వారు అతని కుటుంబానికి నమ్మకంగా ఉండలేదు.
* 8:4 ఆకలి ఇది పురాతన గ్రీకు అనువాదం నుంచి హీబ్రూ ప్రతుల్లో ‘తరుముచు’ అని రాయబడివుంది.