3
దేవుని పిలుపుకు యోనా విధేయత
1 పిదప యోనాతో యెహోవా మళ్ళీ మాట్లాడాడు. యెహోవా ఇలా చెప్పాడు:
2 “నీవు ఆ నీనెవె మహానగరానికి వెళ్లు. నేను నీకు చెప్పే విషయాలు వారికి బోధించు.”
3 యెహోవా ఆజ్ఞను శిరాసావహించి యెనా నీనెవె నగరానికి వెళ్లాడు. నీనెవె ఒక మహా నగరం. ఎవరైనా నగరంగుండా వెళ్లాలంటే మూడు రోజులు నడవాలి.
4 యోనా నగరం మధ్యకు వెళ్లి ప్రజలకు బోధించటం మొదలు పెట్టాడు. “నలబై రోజుల తరువాత నీనెవె నాశనమవుతుంది” అని యోనా ప్రకటించాడు.
5 నీనెవె నగరవాసులు దేవుని వర్తమానాన్ని విశ్వసించారు. ప్రజలు తమ పాపాలను గురించి ఆలోచించటానికి కొంతకాలంపాటు ఉపవాసం చేయటానికి నిర్ణయించుకొన్నారు. తమ విచారాన్ని వ్యక్తం చేయుటకు ప్రజలు ప్రత్యేకమైన దుస్తులు ధరించారు. అతి ముఖ్యలు, అతి సామాన్యులతో సహా నగరవాసులంతా ఇది ఆచరించారు.
6 ఈ విషయాలను గురించి నీనెవె రాజు విన్నాడు. రాజుకూడా తాను చేసిన చెడుపనులకు విచారించాడు. అందుచే రాజు తన సింహాసనాన్ని వదిలివేశాడు. రాజు తన రాజదుస్తులు విసర్జించి, తన విచారాన్ని వ్యక్తం చేసే ప్రత్యేక దుస్తులు ధరించాడు. పిమ్మట రాజు బూడిదలో కూర్చున్నాడు.
7 రాజు ఒక ప్రత్యేక వర్తమానాన్ని వ్రాసి, నగరమంతా ప్రకటింపదేజేశాడు.
రాజు నుండి, అతని కింద పాలకుల నుండి వచ్చిన ఆజ్ఞ ఏమనగా:
కొద్దికాలం పాటు ఏ మనిషీగాని, జంతువుగాని ఏమీ తినగూడదు. పశువుల మందలనుగాని, గొర్రెల మందలనుగాని పొలాల్లోకి వదలకూడదు. నీనెవెలో ఉన్న ఏ జీవీ ఏమీ తనకూడదు. నీరు తాగుకూడదు.
8 ప్రతి వ్యక్తీ, ప్రతి జంతువూ విచార సూచకంగా ఒక ప్రత్యేకమైన బట్టతో తప్పక కప్పబడాలి. ప్రజలు బిగ్గరగా తమ గోడును దేవునికి చెప్పుకోవాలి. ప్రతి వ్యక్తీ తన జీవన విధానం మార్చుకొని, చెడు పనులు చేయడం మా నాలి.
9 బహుశః అప్పుడు దేవుడు తన మనస్సు మార్చుకొని, తాను చేయ సంకల్పించిన పనులు చేయక పోవచ్చు. బహుశః దేవుని మనస్సు మారవచ్చు. కోపంగా ఉండకపోవచ్చు. అప్పుడు మనం శిక్షింపబడకపోవచ్చు.
10 ప్రజలు చేసిన పనులన్నీ దేవుడు చూశాడు. ప్రజలు చెడుపనులు చేయటం మానినట్లు దేవుడు గమనించాడు. కావున దేవుడు మనసు మార్చుకొని, తాను చేయ సంకల్పించినది విరమించుకున్నాడు. దేవుడు ప్రజలను శిక్షించలేదు.