29
బబులోనులో బందీలుగా* వున్న యూదులకు యిర్మీయా ఒక లేఖ పంపాడు. బబులోనులో ఉంటున్న పెద్దలకు (నాయకులు), యాజకులకు, ప్రవక్తలకు, తదితర ప్రజలకు అతడు దానిని పంపాడు. వీరంతా నెబుకద్నెజరుచే యెరూషలేము నుండి బబులోనుకు తీసుకొని రాబడినవారే. (రాజైన యెకోన్యా, రాణియగు అతని తల్లి, యూదా, యెరూషలేముల అధికారులు, నాయకులు, వడ్రంగులు, లోహపు పనివారు మొదలైన వారంతా యెరూషలేము నుండి తీసుకొని పోబడీన పిమ్మట ఈ లేఖ పంపబడింది) బబులోనులోని రాజైన నెబుకద్నెజరు వద్దకు ఎల్యాశాను, గెమర్యా అనే వారిని యూదా రాజైన సిద్కియా పంపాడు. ఎల్యాశా అనువాడు షాఫాను కుమారుడు. యిర్మీయా తన లేఖను బబులోనుకు తీసుకొని వెళ్లటానికి వారిద్దరికీ ఇచ్చాడు. ఆ లేఖలో యిలా వ్రాయబడివుంది.
 
ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యోహోవా యెరూషలేము నుండి బబులోనుకు తాను బందీలుగా పంపిన ప్రజలందరి నుద్దేశించి ఈ విషయాలు చెపుతున్నాడు. “మీరు ఇండ్లు కట్టుకొని వాటిలో నివసించండి. ఆ రాజ్యంలో స్థిరపడండీ. తోటలను పెంచి, మీరు పండించిన పండ్లను తినండి. వివాహాలు చేసుకొని సంతానవంతులై వర్ధిల్లండి. మీ కుమారులకు కూడ వధువులను వెదకండి. మీ కుమార్తెలకు వివాహాది శుభకార్యాలు చేయండి. వారు కూడ తమ సంతానాన్ని అభివృద్ధి చేసుకొనే నిమిత్తం మీరలా చేయండి. మీ సంతానాన్ని విస్తరింపజేసి పెంచి బబులోనులో మీరు బాగా వ్యాపించండి. మీ సంఖ్యా బలం తగ్గిపోకూడదు. నేను మిమ్ములను పంపిన నగరానికి మీరంతా మంచి పనులు చేయండి. మీరు నివసిస్తున్న నగర శ్రేయస్సుకు మీరు ప్రార్థనలు చేయండి. ఎందువల్లనంటే, ఆ నగరంలో శాంతి నెలకొంటే మీకూ శాంతి లభిస్తుంది.” ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా చెప్పేదేమనగా “మీ ప్రవక్తల, మంత్ర విద్యలు చేసే వారి యొక్క మోసంలో మీరు పడకండి. వారు కనిన కలలను మీరు వినవద్దు. వారు అబద్ధాలను బోధిస్తున్నారు. వారు చెప్పే వర్తమానం నానుండి వచ్చినదేనని అంటున్నారు! కాని నేను పంపలేదు!” ఇదే యెహోవా వాక్కు.
10 యెహోవా ఇంకా ఇలా చెపుతున్నాడు: “బబులోను డెబ్బయి సంవత్సరాల పాటు బలమైన రాజ్యంగా ఉంటుంది. ఆ తరువాత బబులోనులో నివసిస్తున్న మీ వద్ధకు వస్తాను. మిమ్మల్ని తిరిగి యెరూషలేముకు తీసుకొని వస్తానని నేను మీకిచ్చిన నా మంచి వాగ్దానాన్ని నేను నెర వేర్చుతాను. 11 ఇది నేనెందుకు చెపుతున్నానంటే మీ అభివృద్ధి కొరకు వేసిన నా ప్రణాళికలన్నీ నాకు తెలుసు.” ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం “మీ సంక్షేమం కొరకు నాకు ఎన్నోమంచి ఆలోచనలున్నాయి. మీకు కీడు చేయాలని నేనెన్నడూ ఆలోచించను. మీకు ఆశను, మంచి భవిష్యత్తును కలుగజేయ టానికి వ్యూహరచన చేస్తాను. 12 అప్పుడు మీరు నా పేరున నన్ను పిలుస్తారు. మీరు నాదరి చేరి, నన్ను ప్రార్థిస్తారు. నేను మీ ప్రార్థన ఆలకిస్తాను. 13 మీరు నా కొరకు అన్వేషిస్తారు. మీరు మీ హృదయ పూర్వకంగా నా కొరకు వెదకితే, మీరు నన్ను కనుగొంటారు. 14 మీరు నన్ను కనుగొనేలా నేనే చేస్తాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. “పైగా నేను మీకు బంధ విముక్తి కలుగజేసి తిరిగి తీసుకొని వస్తాను. నేనే మిమ్మల్ని ఈ స్థలం వదిలి పెట్టి పోయేలా వత్తిడి చేశాను. కాని మిమ్మల్ని ఏ దేశాలకు, ఏ ప్రాంతాలకు నేను పంపియున్నానో ఆయా ప్రాంతాలనుండి మిమ్మల్నందరినీ నేను తిరిగి కూడదీస్తాను.” ఇదే యెహోవా వాక్కు “మరియు మిమ్మల్ని ఈ ప్రదేశానికి తీసుకొని వస్తాను.”
15 “అయితే యెహోవా మాకు ఇక్కడ బబులోనులో ప్రవక్తలనిచ్చియున్నాడు” అని మీరు చెప్పవచ్చు. 16 కాని బబులోనుకు తీసుకొని పోబడకుండా ఇక్కడే ఉన్న మీ బంధువుల గురించి యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు. ఇప్పుడు దావీదు సింహాసనంపై కూర్చున్న రాజును గూరించి, యెరూషలేములో మిగిలి ఉన్న తదితర ప్రజల విషయమై నే మాట్లాడుతున్నాను. 17 సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెపుతున్నాడు: “యెరూషలేములో ఇంకా మిగిలి ఉన్న ప్రజలపైకి నేను త్వరలో కత్తిని, ఆకలిని, భయంకర రోగాలను పంపుతాను. తినటానికి పనికి రాకుండా కుళ్లిపోయిన అంజూరపు పండ్లవలె వారిని చేస్తాను. 18 యెరూషలేములో ఇంకా వున్న వారిని నేను కత్తితోను, కరువుతోను, రోగాలతోను వెంటాడతాను. ఈ ప్రజలకు సంభవించే భయంకర విపత్తులను చూచి ప్రపంచ రాజ్యాలన్నీ భయభ్రాంతులయ్యేందుకే నేనిది చేయదలచాను. ఆ ప్రజలు నాశనం చేయబడతారు. వారికి సంభ వించిన విపత్తును గురించి విన్న ప్రజలంతా సంభ్ర మాశ్ఛర్యాలతో నిండిపోతారు. ప్రజలు తమ శత్రువులకు కీడు తలంచినప్పుడు వీరికీ జరిగిన రీతిగా జరగాలని కోరుకుంటారు. నేను వారిని ఎక్కడికి బలవంతంగా పంపితే అక్కడ వార అవమానాల పాలవుతారు. 19 యెరూషలేము ప్రజలు నా సందేశాన్ని పెడచెవిని పెట్టారు గనుక నేనివన్నీ చేయ సంకల్పించాను.” ఇదే యెహోవా వాక్కు. “నా సందేశాన్ని వారికి అనేక పర్యాయాలు పంపియున్నాను. నా సేవకులైన ప్రవక్తలను నా సందేశం ఆ ప్రజలకు అందజేయటానికి వినియోగించాను. కాని ఆ ప్రజలు వినలేదు.” ఇది యెహోవా వాక్కు. 20 “మీరంతా బందీలు. నేనే మిమ్మల్ని యెరూషలేము వదిలి బబులోనుకు పోవల సిందిగా బలవంతం చేశాను. కావున, యెహోవా సందేశం వినండి.”
21 సర్వశక్తిమంతుడైన యెహోవా కోలాయా కుమారుడైన అహాబును గురించి, మయశేయా కుమారుడైన సిద్కియాను గురించి ఇలా చెపుతున్నాడు: “ఈ ఇద్దరు మనుష్యులు మీకు అబద్దాలు బోధిస్తున్నారు. వారు చెప్పే సందేశం నానుండి వచ్చినదేనని అంటున్నారు. కాని వారు అబద్ధమాడుతున్నారు. ఆ ఇద్దరు ప్రవక్తలను బబులోను రాజైన నెబుకద్నెజరు అప్పగిస్తారు. అప్పుడు నెబుకద్నెజలుకు బబులోనులో బందీలుగా వున్న మీ అందరి ముందు ఆ ప్రవక్తలను చంపుతాడు. 22 యూదా జాతి బందీలంతా తమ శత్రువులకు కీడు తలంచినప్పుడు వీరికి జరిగిన శాస్తి వంటిది జరగాలని కోరుకుంటారు. అనగా శాపగ్రస్తులలో వీరొక ఉదాహరణగా మిగిలి పోతారు. బందీలంతా ఇలా అంటారు: ‘సిద్కియాకు, అహాబుకు పట్టిన గతినే మీకూ యెహోవా పట్టించు గాక! బబులోను రాజు వారిద్దరినీ అగ్నిలో కాల్చివేశాడు!’ 23 ఆ ప్రవక్తలిద్దరూ ఇశ్రాయేలు ప్రజలమధ్య బహునీచ కార్యాలు చేశారు. తమ పొరుగు వారి భార్యలతో వ్యభిచారం చేశారు. వారు అబద్ధాలు కూడ చెప్పారు. పైగా వాటిని యెహోవానైన నానుండి వచ్చిన సందేశంగా చెప్పుకున్నారు. ఈ పనులన్నీ చేయమని వారికి నేనెప్పుడు చెప్పియుండలేదు. వారేమి చేశారో నాకు తెలుసు. వాటికి నేనే సాక్షిని.” ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం.
షెమయాకు దేవుని సందేశం
24 షెమయాకు కూడ ఒక సందేశం ఇవ్వు. షెమయా నెహెలామీయుడు. 25 ఇశ్రాయేలు దేవుడు సర్వశక్తుడు అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు. “షెమయా, నీవు యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ, యాజకులందరికీ లేఖలు పంపావు. మయశేయా కుమారుడు, యాజకుడునయిన జెఫన్యాకు నీవు లేఖలు పంపావు. లేఖలన్నీ నీవు నీ పేరుమీదనే పంపావు. అంతేగాని యెహోవా అధికారంతో పంపలేదు. 26 షెమయా, నీ లేఖలో జెఫన్యాకు ఇలా చెప్పావు. ‘జెఫన్యా, యెహోవా నిన్ను యెహోయాదా స్థానంలో యాజకునిగా చేశాడు. దేవాలయ నిర్వాహణాధికారం నీవు కలిగి ఉంటావు. పిచ్చివానిలా ప్రవర్తించే ప్రతి వానినీ లేదా ప్రవక్తలా నటించే ప్రతి వానినీ, నీవు నిర్భందించవచ్చు. వానికి నీవు బొండ కొయ్య దండన విధించవచ్చు. వాని మెడకు ఇనుప చక్రం§ వేసి దానికి గొలుసులు తగిలించవచ్చు. 27 ఇప్పుడు యిర్మీయా ప్రవక్తలా ప్రవర్తిసున్నాడు. కావున నీవతనిని ఎందువల్ల నిర్భందించలేదు? 28 బబులోనులో వున్న మనకు యిర్మీయా యిలా వర్తమానం పంపాడు. ఇశ్రాయేలు నుండి తీసుకురాబడి బబులోనులో వున్న ప్రజలారా, మీరక్కడ బహుకాలం వుంటారు. కావున ఇండ్లు నిర్మించుకొని స్థిరపడండి. తోటలు పెంచి, మీరు పండించిన పండ్లను తినండి.’ ”
29 ప్రవక్త యిర్మీయాకు ఈ లేఖను యాజకుడైన జెఫన్యా చదివి వినిపించాడు. 30 పిమ్మట యిర్మీయాకు యెహోవా నుండి వర్తమానం వచ్చింది. 31 “యిర్మీయా, ఈ సందేశం బబులోనులో ఉన్న బందీలందరికి పంపించుము ‘నెహెలామీయుడైన షెమయాను గురించి యెహోవా ఇలా అంటున్నాడు. షెమయా మీకు ప్రవచించాడు. కాని నేనతనిని పంపలేదు. షెమయా ఒక అబద్ధాన్ని మీరు నమ్మేలాచేశాడు. 32 షెమయా అలా చేసిన కారణంగా యెహోవా యిలా చెప్పుతున్నాడు. నేను త్వరలో నెహెలామీయుడైన షెమయాను శిక్షిస్తాను. పూర్తిగా అతని వంశం నాశనం గావిస్తాను. నా ప్రజలకు నేను చేసే మేలులో అతను పాలుపంచుకోలేడు.’ ” ఇదే యెహోవా వాక్కు “ ‘ప్రజలు యెహోవాకు వ్యతిరేకంగా తిరిగేలా షెమయా బోధించాడు గనుక నేను షెమయాను శిక్షిస్తాను.’ ”
* 29:1 బబులోనులో బందీలు బబులోనుకు బందీలుగా కొని పోబడిన యూదా జాతివారు అని యిక్కడ అర్థం. 29:26 పిచ్చివానిలా షెమయా ఇక్కడ యిర్మీయాను గురించి పరోక్షంగా ప్రస్తావిస్తున్నాడు. చూడండి 27-28 వచనములు. 29:26 బొండ కొయ్య నిందితుల, నేరస్థుల కాళ్లకు కదలకుండా కొయ్య చెక్కలు బిగించుట. § 29:26 ఇనుప చక్రం మెడకు ఇనుప చక్రం వేసి దేనికి గొలుసులు తగిలించుట వంటివి ప్రాచీన కాలంలో దండనో పాయాలు.