37
యిర్మీయాను నిర్బంధించటం
1 నెబుకద్నెజరు బబులోను రాజు. యూదా రాజుగా యెహోయాకీము కుమారుడైన యెహోయాకీను స్థానంలో సిద్కియాను నెబుకద్నెజరు నియమించాడు. సిద్కియా రాజైన యోషీయా కుమారుడు.
2 యెహోవా యిర్మీయాకు బోధననిమిత్తం ఇచ్చిన వర్తమానాలను సిద్కియా లక్ష్య పెట్టలేదు. సిద్కియా సేవకులు, యూదా ప్రజలు కూడ యెహోవా వర్తమానాల పట్ల శ్రద్ధ వహించలేదు.
3 యెహుకలు అనువానిని, యాజకుడైన జెఫన్యాను రాజైన సిద్కియా ప్రవక్తయగు యిర్మీయా వద్ధకు ఒక సందేశమిచ్చి పంపాడు. యెహుకలు తండ్రి పేరు షెలెమ్యా. యాజకుడైన జెఫన్యా తండ్రి పేరు మయశేయా. వారు యిర్మీయాకు తెచ్చిన వర్తమానం యిలా ఉంది: “యిర్మీయా, మా కొరకు మన యెహోవా దేవుని ప్రార్థించు.”
4 (ఆ సమయంలో ఇంకా యిర్మీయా చెరసాలలో నిర్బంధించబడలేదు. కావున అతనెక్కడికి వెళ్లాలన్నా స్వేచ్ఛ కలిగియున్నాడు.
5 అదే సమయంలో ఈజిప్టు నుండి ఫరో సైన్యం కూడా యూదా వైపుకు కదలి వచ్చింది. కల్దీయుల సైన్యం యెరూషలేమును ఓడించటానికి దానిని చుట్టుముట్టింది. అయితే, ఈజిప్టు నుండి పచ్చిన సైన్యం తమ మీదికి వస్తున్నట్లు వారు విన్నారు. కావున బబులోను సైన్యం. యెరూషలేమును వదలి ఈజిప్టు సైన్యాన్ని ఎదిరించటానికి వెళ్లింది.)
6 యెహోవా నుండి ఒక వర్తమానం ప్రవక్తయైన యిర్మీయాకు వచ్చింది:
7 “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ వర్తమానం చెప్పుచున్నాడు: ‘యెహుకలు మరియు జెఫన్యా! యూదా రాజైన సిద్కియా నన్ను ప్రశ్నలడిగే నిమిత్తం మిమ్మల్ని నావద్దకు పంపినట్లు నాకు తెలుసు. రాజైన సిద్కియాకు ఇలా చెప్పండి: ఫరో సైన్యం బబులోను సైన్యాన్ని ఎదుర్కొనే విషయంలో నీకు సహాయం చేయాలని ఈజిప్టు నుండి ఇక్కడికి కదలి వస్తున్నది. కాని ఫరో సైన్యం ఈజిప్టుకు తిరిగి వెళ్లిపోతుంది.
8 ఆ తరువాత బబులోను సైన్యం ఇక్కడికి తిరిగి వస్తుంది. వారు యెరూషలేము మీద దాడి చేస్తారు. బబులోను సైన్యం ఆ పిమ్మట యెరూషలేమును వశపర్చుకొని దానిని తగలబెడుతుంది.’
9 యెహోవా ఇలా అంటున్నాడు: ‘యెరూషలేము ప్రజలారా మిమ్మల్ని మీరు మోసగించుకోవద్దు. “బబులోను సైన్యం మమ్మల్ని వదలి తప్పక వెళ్లి పోతుంది” అని మీకు మీరు అనుకోవద్దు. వారు మిమ్మల్ని వదలరు.
10 యెరూషలేము ప్రజలారా, మిమ్మల్ని ఎదుర్కొనే కల్దీయుల సైన్యాన్నంతా మీరు ఓడించగలిగినా వారి డేరాలలో కొద్దిమంది గాయపడిన సైనికులు మిగులుతారు. ఆ కొద్దిమంది గాయపడిన మనుష్యులే వారి డేరాల నుండి వచ్చి యెరూషలేమును తగలబెడతారు.’ ”
11 కల్దీయుల సైన్యం ఈజిప్టు రాజైన ఫరో సైన్యాన్ని ఎదుర్కొనటానికి యెరూషలేమును వదిలిన సమయంలో
12 యిర్మీయా యెరూషలేము నుండి బెన్యామీను దేశానికి వెళ్లగోరాడు. అక్కడ తన కుటుంబ ఆస్తుల పంపకం విషయంలో యిర్మీయా వెళ్లాడు.
13 కాని యెరూషలేములో బెన్యామీను ద్వారం వద్దకు వెళ్లే సరికి రక్షక భటాధికారి యిర్మీయాను నిర్బంధించాడు. ఈ అధికారి పేరు ఇరీయా. ఇరీయా తండ్రి పేరు షెలెమ్యా. షెలెమ్యో తండ్రి పేరు హనన్యా. రక్షక భటాధికారి అయిన ఇరీయా యిర్మీయాను నిర్బంధంలోకి తీసుకొని “యిర్మీయా, నీవు మమ్మల్ని వదిలి బబులోను పక్షం వహించటానికి వెళ్తున్నావు”అని అన్నాడు.
14 “అది నిజం కాదు! నేను బబులోను పక్షం వహించటానికి వెళ్లటం లేదు” అని యిర్మీయా ఇరీయాతో అన్నాడు. కాని యిర్మీయా చెప్పేది ఇరీయా వినటానికి నిరాకరించాడు. యిర్మీయాను ఇరీయా నిర్బంధించి యెరూషలేములో రాజ్యాధి కారుల వద్దకు తీసికొని వెళ్లాడు.
15 ఆ అధికారులు యిర్మీయా పట్ల చాలా కోపగించారు. యిర్మీయాను దండించాలని వారు ఆజ్ఞ ఇచ్చారు. వారు యిర్మీయాను కారాగారంలో నిర్బంధించారు. యెనాతాను అనేవాని ఇంటిలో ఈ చెరసాల ఉంది. యెనాతాను యూదా రాజుకు లేఖకుడు. యోనాతాను ఇంటిని చెరసాలగా మార్చారు.
16 యోనాతాను ఇంటి కిందవున్న చెరసాల గదిలో వారు యిర్మీయాను నిర్బంధించారు. అది ఇంటి కింద భూమిలో కట్టిన ఒక చెరసాల గది. యిర్మీయా అందులో చాలాకాలం ఉన్నాడు.
17 పిమ్మట రాజైన సిద్కియా మనుష్యులను పంపగా వారు యిర్మీయాను రాజభవనానికి తీసికొని వచ్చారు. యిర్మీయాతో సిద్కియా ఏకాంతంగా మాట్లాడ్డాడు. “యెహోవా నుండి ఏమైనా సందేశం వచ్చిందా?” అని యిర్మీయాను అడిగాడు.
“అవును. యెహోవా సందేశం ఒకటి ఉంది సిద్కియా, నీవు బబులోను రాజుకు ఇవ్వబడతావు” అని యిర్మీయా సమాధాన మిచ్చాడు.
18 తరువాత యిర్మీయా రాజైన సిద్కియాతో ఇలా అన్నాడు. “నేను ఏమి తప్పు చేశాను? నీ పట్లగాని, నీ అధికారుల పట్లగాని యెరూషలేము ప్రజల పట్లగాని నేను చేసిన నేరం ఏమిటి? నన్నెందుకు కారాగృహంలో పడవేశావు?
19 సిద్కియా రాజా, నీ ప్రవక్తలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆ ప్రవక్తలు నీకు తప్పుడు వర్తమానం యిచ్చారు. ‘బబులోను రాజు నిన్నుగాని, ఈ యూదా రాజ్యాన్ని గాని ఎదుర్కోడు’ అని వారన్నారు.
20 కాని మహారాజా, ఇప్పుడు నేను చెప్పేది దయచేసి వినండి. దయచేసి నా విన్నపం ఆలకించండి. నేనడిగేది ఏమంటే లేఖకుడైన యోనాతాను ఇంటికి నన్ను మరల పంపవద్దు. మీరు నన్ను మరల పంపితే నేనక్కడ చనిపోతాను.”
21 కావున యిర్మీయాను రాజభవనపు ఆవరణలోనే నిర్బందించి ఉంచాలని రాజైన సిద్కియా ఆజ్ఞాపించాడు. వీధిలోని రొట్టెల దుకాణము నుండి రొట్టె తెచ్చి యిర్మీయాకు ఇవ్వాలని కూడ రాజు ఆజ్ఞాపించాడు. నగరంలో అమ్మే రొట్టెలు అయిపోయే వరకు యిర్మీయాకు రొట్టెలు ఇవ్వబడ్డాయి. ఆ విధంగా రాజ ప్రాంగణంలో యిర్మీయా బందీగా ఉన్నాడు.