40
యిర్మీయా విడుదల
1 యిర్మీయా రామా నగరంలో విడుదలైన పిమ్మట యోహోవా వాక్కు అతనికి వినిపించింది. బబులోను రాజు ప్రత్యేక అంగరక్షక దళాధిపతియైన నెబూజరదాను యిర్మీయాను రామా నగరంలో ఉన్నట్లు కనుగొన్నాడు. యిర్మీయా గొలుసులతో బంధింపబడ్డాడు. యెరూషలేము నుండి యూదా నుండి తేబడిన బందీలందరితో పాటు యిర్మీయా కూడా ఉన్నాడు. ఆ ప్రజలంతా బంధీలుగా బబులోనుకు తీసికొని పోబడుతున్నారు.
2 దళాధిపతి నెబూజరదాను యిర్మీయాను చూచినప్పుడు అతనితో మాట్లాడి ఇలా అన్నాడు: “యిర్మీయా, నీ దేవుడైన యెహోవా ఈ విపత్తు ఈ ప్రదేశానికి వస్తుందని చెప్పియున్నాడు.
3 యెహోవా ఏమి చేస్తానని చెప్పియున్నాడో అంతా జరిగేలా చేశాడు. మీ యూదా ప్రజలంతా యెహోవాపట్ల పాపం చేశారు. కావున మీకు ఈ ఆపద సంభవించింది. మీ ప్రజలు దేవునికి విధేయులుగా లేరు.
4 కాని యిర్మీయా, నిన్ను నేనిప్పుడు విడుదల చేస్తాను. నీ మణికట్టుల నుండి సంకెళ్లను తీసివేస్తున్నాను. నీవు రాదలచుకొంటే నాతో బబలోనుకు రా. వస్తే నీ యోగక్షేమాల విషయంలో నేను తగిన శ్రద్ధ తీసికొంటాను. నీకు నాతో రావటానికి ఇష్టం లేకపోతే రావద్దు. చూడు; దేశమంతా నీకు బాహాటంగా తెరచబడి ఉంది. నీ ఇష్టము వచ్చిన చోటికి వెళ్లు.
5 లేక షాఫాను పుత్రుడైన ఆహీకాము కుమారుడు గెదల్యావద్దకు తిరిగి వెళ్లు. యూదా పట్టణాల పరిపాలనా నిర్వహణకై బబులోను రాజు గెదల్యాను పాలకునిగా ఎంపిక చేశాడు. నీవు వెళ్లి గెదల్యాతో కలిసి ప్రజల మధ్య నివసించు. లేదా నీ ఇష్టమొచ్చిన మరెక్కడికైనా సరే వెళ్లు.”
పిమ్మట నెబూజరదాను యిర్మీయాకు కొంత ఆహారాన్ని, ఒక కానుకను ఇచ్చి అతనిని పంపివేశాడు.
6 కావున యిర్మీయా మిస్పా వద్ద వున్న అహీకాము కుమారుడైన గెదల్యా వద్దకు వెళ్లాడు. యిర్మీయా గెదల్యాతో కలిసి యూదా రాజ్యంలో మిగిలి ఉన్న ప్రజల మధ్య నివసించాడు.
గెదల్యా యొక్క స్వల్పకాలిక పాలన
7 యెరూషలేము నాశనం చేయబడినప్పుడు యూదా రాజ్య సైన్యంలోని కొంతమంది, సైనికులు అధికారులు, తదితర మనుష్యులు బయట ప్రాంతంలో వుండిపోయారు. రాజ్యంలో మిగిలిన ప్రజలను పాలించటానికి అహీకాము కుమారుడైన గెదల్యాను బబులోను రాజు నియమించినట్లు ఆ సైనికులు విన్నారు. యూదా రాజ్యంలో మిగిలిన ప్రజలలో మిక్కిలి పేదవారు, బబులోనుకు బందీలుగా తీసికొనిపోవటానికి అనువుగాని స్త్రీ పురుషులు, పిల్లలు వున్నారు.
8 కావున ఆ సైనికులు మిస్పావద్ద గెదల్యాను కలవటానికి వచ్చారు. ఆ వచ్చిన సైనికులలో నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, కారేహ కుమారులైన యోహోనాను మరియు యోనాతాను, తన్హుమెతు కుమారుడైన శెరాయా, నెటోపాతీయుడైన ఏపయి యొక్క కుమారుడు, మాయకాతీయుని కుమారుడైన యెజన్యా, వారితో ఉన్న మనుష్యులు ఉన్నారు.
9 షాఫాను మనుమడు, అహీకాము కుమారుడు అయిన గెదల్యా ఆ సైనికులకు, వారితో ఉన్న మనుష్యులకు భద్రత కల్పించటానికి ఒక ప్రమాణం చేశాడు. గెదల్యా ఇలా అన్నాడు: “సైనికులారా, కల్దీయులకు సేవ చేయటానికి మీరు భయపడకండి. రాజ్యంలో స్థిరపడి బబులోను రాజుకు సేవ చేయండి. మీరిది చేస్తే, మీకు అంతా సవ్యంగా జరిగిపోతుంది.
10 నేను కూడా మిస్పాలోనే నివసిస్తాను. కల్దీయులు ఇక్కడికి వచ్చినప్పుడు మీ తరపున నేను వారితో మాట్లాడతాను. మీరు ఆ పనిని నాకు వదలండి. వేసవి ద్రాక్షపంట నుండి రసం తీయాలి. నూనె కూడ తీయాలి. మీరు తయారు చేసినవన్నీ జాడీలలో నిలువ చేయండి. మీరు ఆక్రమించుకున్న పట్టణాలలో నివసించండి.”
11 మోయాబు, అమ్మోను, ఎదోము, ఇంకను ఇతర దేశాలలో వున్న యూదా ప్రజలంతా బబులోను రాజు యూదా రాజ్యంలో కొంతమందిని వదిలి వెళ్లినట్లువిన్నారు. షాఫాను మనుమడు, అహీకాము కుమారుడు అయిన గెదల్యాను బబులోను రాజు వారిపై పాలకునిగా నియమించినట్లు కూడ విన్నారు.
12 ఆ యూదా ప్రజలు ఈ వార్త విన్న తరువాత యూదా రాజ్యానికి తిరిగి వచ్చారు. చిందరవందరగా వివిధ దేశాల్లో ఉన్న యూదా వారంతా మిస్పాకు తిరిగి వచ్చి గెదల్యాను ఆశ్రయించారు. తిరిగి వచ్చి, వారు చాల ద్రాక్షరసాన్ని తీసి, వేసవి పండ్లను సేకరించారు.
13 బయట పల్లెల్లో ఉన్న కారేహ కుమారుడైన యోహానాను, ఇతర యూదా సైన్యాధికారులు గెదల్యా యొద్దకు వచ్చారు. గెదల్యా మిస్పా పట్టణంలో ఉన్నాడు.
14 యోహానాను, మరియు అతనితో ఉన్న అధికారులు గెదల్యాతో, “అమ్మోనీయుల రాజైన బయలీను నిన్ను చంపజూస్తున్నాడు. అది నీకు తెలుసా? నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును నిన్ను చంపటానికి పంపాడు” అని అన్నారు. కాని అహీకాము కుమారుడైన గెదల్యా వారు మాట నమ్మలేదు.
15 పిమ్మట కారేహ కుమారుడైన యోహానాను మిస్పాలో గెదల్యాతో ఏకాంతంగా మాట్లాడాడు. గెదల్యాతో యోహానాను ఇలా అన్నాడు: “నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును నన్ను వెళ్లి చంపనిమ్ము. దానిని గురించి ఎవ్వరికీ తెలియకుండా నేను చేస్తాను. ఇష్మాయేలు నిన్ను చంపకుండా మేము చూస్తాము. అతడు నిన్ను చంపితే నిన్నాశ్రయించి వచ్చిన యూదా ప్రజలంతా మళ్లీ వివిధ దేశాలకు చెల్లాచెదరై పోతారు. అంటే మిగిలిన కొద్దిమంది యూదావారు కూడా నశించి పోతారన్నమాట.”
16 కాని, అహీకాము కుమారుడైన గెదల్యా తన హితంగోరి చెప్పిన కారేహ కుమారుడైన యోహానానుతో, “ఇష్మాయేలును చంపవద్దు. నీవు ఇష్మాయేలును గురించి చెప్పుచున్న విషయాలు నిజం కావు” అని అన్నాడు.