1 రాజులు
1
అదోనీయా తనకు తాను రాజుగా ప్రకటించుకొనుట
దావీదు రాజు బాగా ముసలివాడయ్యాడు. అందువల్ల అతను చలికి తట్టుకోలేకపోయాడు. తన సేవకులు ఎన్ని దుప్పట్లు కప్పినాగాని, అతను చలికి వణకి పోతూనే వున్నాడు. కావున ఆయన సేవకులు ఆయనతో, “నీ ఆలనాపాలనా చూడటానికి వయస్సులో ఉన్న ఒక అమ్మాయిని మేము చూస్త్తాము. ఆమె నీ పక్కలో పండుకొని నీకు తగిన వెచ్చదనం సమకూర్చుతుంది.” అని అన్నారు. అలా చెప్పి రాజు సేవకులు ఇశ్రాయేలు రాజ్యమంతా ఒక చిన్నదాని కొరకు వెదక నారంభించారు. రాజుకు వెచ్చదనాన్ని ఇవ్వగలిగే రూపం, యవ్వనం ఉన్న స్త్రీ కొరకు వారు వెదకసాగారు. చివరకు అబీషగు అనబడే షూనేమీయురాలిని చూచి, ఆమెను రాజు వద్దకు తీసుకొని వచ్చారు. ఆమె చాలా అందగత్తె, ఆమె రాజుపట్ల శ్రద్ధ తీసుకొని, అతనికి సేవలు చేయనారంభించింది. కాని రాజైన దావీదు ఆమెను కూడలేదు.
5-6 దావీదు కుమారుడు అదోనీయా “నేనే రాజునౌతానని” అనుకొన్నాడు. (అదోనీయా తల్లి పేరు హగ్గీతు) అదోనీయా చాలా అందమైనవాడు. అతడు రాజు కావాలని మిక్కిలి ఉబలాటపడ్డాడు. అందువల్ల తనకు తానే ఒక రథాన్ని, గుర్రాలను సమకూర్చుకున్నాడు. తన ముందు పరుగెత్తుటకు ఏభై మంది మనుష్యులను కూడా నియమించాడు. అతడు అబ్షాలోము తర్వాత పుట్టాడు. దావీదు రాజు ఎప్పుడూ అదోనీయాను మందలించలేదు, విమర్శించలేదు. “ఏమి చేస్తున్నావు?” అని కాని, “అది ఎందుకు చేశావు?” అని కాని అతడు ఎప్పుడూ అడగలేదు.
సెరూయా కుమారుడైన యోవాబుతోను, యాజకుడైన అబ్యాతారుతోను అదోనీయా మాట్లాడాడు. అతడు రాజు అయ్యేలాగ వారు సహాయం చేయడానికి అంగీకరించారు. కాని అదోనీయా రాజు కావడానికి ఒప్పుకోని వారిలో యాజకుడైన సాదోకు, యెహోయాదా కుమారుడైన బెనాయా, ప్రవక్తయైన నాతాను, షిమీ, మరియు దావీదు రాజుయొక్క ప్రత్యేక అంగరక్షకుడైన రేయీ వుండిరి. అందువల్ల వీరు అదోనీయాతో కలియలేదు.
అదోనీయా కొన్ని జంతు బలులను అర్పించాడు. అతడు కొన్ని గొర్రెలను, ఆవులను, మరియు కొన్ని బలిసిన కోడెదూడలను సమాధాన బలిగా ఇచ్చాడు. అదోనీయా ఈ బలులన్నీ ఏన్‌రోగేలు దగ్గరవున్న జోహెలేతు అను శిలవద్ద సమర్పించాడు. ఈ ప్రత్యేకమైన పూజా కార్యక్రమానికి అదోనీయా చాలామందిని ఆహ్వానించాడు. రాజైన దావీదుయొక్క ఇతర కుమారులను, యూదా పాలకులు, నాయకులందరినీ అదోనీయా ఆహ్వానించాడు. 10 కాని అదోనీయా ప్రవక్తయగు నాతానును గాని, బెనాయానును గాని, తన తండ్రియొక్క ప్రత్యేక అంగరక్షకుని గాని, లేక తన సోదరుడు సొలొమోనును గాని ఆహ్వానించలేదు.
11 ఇదంతా విన్న నాతాను, సొలొమోను తల్లియైన బత్షెబ వద్దకు వెళ్లి ఇలా అన్నాడు, “హగ్గీతు కుమారుడైన అదోనీయా ఏమి చేస్తున్నాడో నీవు విన్నావా? తనకై తాను రాజుగా ప్రకటించుకొన్నాడు. మన యజమానియైన దావీదు కూడ ఈ విషయం ఎరుగడు. 12 నీ జీవితం, నీ కుమారుడైన సొలొమోను జీవితం ప్రమాదంలో పడవచ్చు. మీ ప్రాణాలను కాపాడుకోవాలంటే నీవు ఏమి చేయాలో నేను చెపుతాను. 13 దావీదు రాజు వద్దకు వెళ్లి, ‘నా ప్రభువైన రాజా, నీ తరువాత రాజ్యానికి వారసుడు నా కుమారుడైన సొలొమోను అవుతాడని నీవు ప్రమాణం చేశావు. కాని ఇప్పుడు అదోనీయా ఎందుకు రాజయ్యాడు?’ అని అడుగు. 14 నీవు అలా మాట్లాడుతూ వుండగా నేను లోపలికి వస్తాను. వచ్చి, నీవు అదోనీయా గురించి చెప్పినదంతా నిజమని రాజుతో నేను చెపుతాను.”
15 తరువాత బత్షెబ రాజును చూడటానికి ఆయన పడకగదిలోనికి వెళ్లింది. రాజు ముసలివాడయ్యాడు. షూనేమీయురాలగు అబీషగు అక్కడ ఆయనకు సేవచేస్తూ వున్నది. 16 బత్షెబ రాజుకు సాష్టాంగ నమస్కారం చేసింది. “నీకు ఏమి కావాలి?” అని రాజు ప్రశ్నించాడు.
17 బత్షెబ ఇలా చెప్పసాగింది, “మహారాజా! ప్రభువైన నీ దేవుని పేరు మీద నీవు నాకు ఒక ప్రమాణం చేశావు. ‘నా తరువాత నీ కుమారుడైన సొలొమోను రాజవుతాడు. నా సింహసనం మీద సొలొమోను రాజ్య పాలన చేస్తాడు’ అని అన్నావు. 18 కాని ఇప్పుడు అదోనీయా రాజయ్యాడు. అయినా ఆ విషయం నీకు తెలియదు. 19 సమాధానబలి ఇచ్చే నిమిత్తం అదోనీయా చాలా జంతువులను చంపాడు. అతడు ఆవులను, బలిసిన కోడెదూడలను, గొర్రెలను చంపాడు. మరియు నీ కుమారులనందరినీ ఆహ్వానించాడు. యాజకుడైన అబ్యాతారును, సైన్యాధ్యక్షుడు యోవాబును కూడ అతడు ఆహ్వానించాడు. కాని అతడు నిన్ను సేవించే నా కుమారుడైన సొలొమోనును మాత్రం ఆహ్వానించ లేదు. 20 మహారాజా! ఇశ్రాయేలు ప్రజలంతా నిన్ను గమనిస్తూ వున్నారు. నీ తరువాత నీవు ఎవరిని రాజుగా నియమిస్తావో? అని వారు ఎదురు చూస్తూ వున్నారు. 21 నీ మరణానంతం, నీ పితరులతో నీవు సమాధి చేయబడతావు. ప్రజలు మాత్రం నేను, సొలొమోను నేరస్థులమని భావిస్తారు.”
22 బత్షెబ ఇలా రాజుతో మాట్లాడుతూ వుండగా, ప్రవక్తయగు నాతాను రాజును చూడటానికి వచ్చాడు. 23 “ప్రవక్తయగు నాతాను ఇక్కడికి వచ్చాడు” అని సేవకులు రాజుతో చెప్పారు. నాతాను రాజువద్దకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశాడు. 24 నాతాను రాజుతో ఇలా అన్నాడు, “నా ప్రభువా, నీ తరువాత రాజ్య పాలనకు కొత్త రాజుగా అదోనీయాను ప్రకటించావా? నీ తరువాత ప్రజాపాలన చేయటానికి అదోనీయాను నియమించాలని నిర్ణయించావా? 25 ఈ రోజు అతను సమాధాన బలులు అర్పించాడు. అతడు చాలా ఆవులను, బలిసిన కోడెదూడలను, గొర్రెలను చంపాడు. నీ యొక్క ఇతర కుమారులంనదరిని, సైన్యాధ్యక్షుడిని, యాజకుడైన అబ్యాతారును అతడు పిలిచాడు. ఈ సమయంలో వారంతా అతనితో కలిసి తాగుతూ, తింటూ వేడుక చేసుకొంటున్నారు. పైగా, ‘రాజైన అదోనీయా వర్ధిల్లు గాక!’ అని వారంతా అంటున్నారు. 26 కాని అతను నన్నుగాని, యాజకుడైన సాదోకును గాని, యెహోయాదా కుమారుడైన బెనాయాను గాని, నీ కుమారుడైన సొలొమోనును గాని పిలువలేదు. 27 ఇదంతా చేసింది నీవేనా? మేము నిన్ను సేవిస్తూనీకు విధేయులమైయున్నాము కదా, అయినను నీ తరువాత నీ వారసుడుగా ఎవరిని ఎన్నుకున్నదీ మాకు ఎందుకు చెప్పలేదు?”
28 ఇది విన్న రాజు బత్షెబను పిలువనంపాడు. రాజు ముందుకు బత్షెబ వచ్చింది.
29 అప్పుడు రాజు ఒక ప్రమాణం చేశాడు, “నా ప్రభువైన దేవుడు నాకు సంభవించిన ప్రతి ఆపదనుండి నన్ను కాపాడాడు. నా ప్రభువైన దేవుడు నిత్యుడు. ఆ దైవశక్తితో నేను ప్రమాణం చేస్తున్నాను: 30 గతంలో నీకు నేనిచ్చిన మాటను ఈ రోజు నెర వేర్చుతాను. ఇశ్రాయేలు దేవుడైన నా యెహోవా యొక్క శక్తితో నేనీ ప్రమాణం చేసియున్నాను. నా తరువాత నీ కుమారుడైన సొలొమోను రాజవుతాడని నీకు ప్రమాణం చేశాను. నా తరువాత నా సింహాసనం మీద నా స్థానాన్ని అతడు పొందుతాడని కూడా మాట ఇచ్చాను. నేను నా మాట నిలబెట్టుకుంటాను.”
31 తరువాత బత్షెబ రాజుముందు సాగిలపడి, “రాజైన దావీదు వర్ధిల్లు గాక!” అని అన్నది.
దావీదు సొలొమోనును రాజుగా చేయటం
32 రాజైన దావీదు అప్పుడు “యాజకుడగు సాదోకును, ప్రవక్తయగు నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలువనంపాడు.” వారు ముగ్గురూ రాజు వద్దకు వచ్చారు. 33 “మీరు రాజాధికారులను మీతో తీసుకొని, నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిదపై ఎక్కించి దిగువనున్న గిహోను చలమ* దగ్గరకు తీసుకొని వెళ్లండి. 34 అక్కడ యాజకుడైన సాదోకు, ప్రవక్తయగు నాతాను అతనిని ఇశ్రాయేలు రాజుగా అభిషిక్తుని చేయాలి. బూర ఊది ‘ఇదిగో కొత్తరాజు సొలొమోను!’ అని చాటాలి. 35 తరువాత అతనితో కలిసి ఇక్కడకి తిరిగిరండి. అతడు నా సింహాసనం మీద కూర్చుండి, నా స్థానంలో రాజుగా వ్యవహరిస్తాడు. ఇశ్రాయేలు మీద, యూదా మీద రాజుగా వుండటానికి నేనతనిని ఎన్నుకున్నాను,” అని రాజైన దావీదు వారితో అన్నాడు.
36 యెహోయాదా కుమారుడైన బెనాయా రాజుతో, “అది చాలా మంచి పని! నీ దేవుడైన యెహోవా అది జరిగేలా చేయునుగాక! 37 యెహోవా ఎల్లప్పుడు మా యజమాని రాజువైన నీకు సహాయ పడుతూ వచ్చాడు. యెహోవా ఇప్పుడు సొలొమోనుకు సహాయపడును గాక! దేవుడు సొలొమోనును కూడా నీకంటె ఘనమైన రాజుగా చేయునుగాక!” అని అన్నాడు.
38 కావున సాదోకు, నాతాను, బెనాయా, రాజు యొక్క సేవకులు రాజాజ్ఞ శిరసావహించారు. సొలొమోనును రాజు యొక్క కంచర గాడిదపై ఎక్కించి వారతనితో గిహోనుకు వెళ్లారు. 39 యాజకుడైన సాదోకు పవిత్ర గుడారము నుండి తనతో నూనె పట్టుకెళ్లాడు. సాదోకు ఆ నూనెను సొలొమోను తలపైపోసి రాజుగా అభిషిక్తుని చేశాడు. వారప్పుడు బాకా వూదగా అక్కడున్న ప్రజలంతా, “సొలొమోను రాజు వర్ధిల్లుగాక!” అని అన్నారు. 40 ఆ ప్రజలంతా సొలొమోనుతో కలిసి నగరానికి వచ్చారు. వారు పిల్లనగ్రోవులను ఊదుతూ, జయజయ ధ్వనులు చేయసాగారు. వారు సంతోషంతో భూమి అదిరేలా కేకలేశారు.
41 ఆ సమయంలో అదోనీయా, మరియు అతనితో ఉన్న అతిథులు భోజనాలు పూర్తి చేస్తున్నారు, వారు బూరనాదం విన్నారు. “నగరంలో ఏమి జరుగుతూ వుంది, మనం వినే శబ్దం ఏమిటి?” అని యోవాబు అడిగాడు.
42 యోవాబు అలా మాట్లాడుతూ వుండగానే యాజకుడైన అబ్యాతారు కుమారుడు యోనాతాను అక్కడికి వచ్చాడు. అదోనీయా అతనిని చూసి “రా, లోనికి రా! నీవు చాలా మంచివాడవు నీవు ఏదైనా మంచివార్తే నాకు తెస్తూ వుండవచ్చు” అని అన్నాడు.
43 కాని యోనాతాను ఇలా సమాధాన మిచ్చాడు, “కాదు! ఇది నీకు శుభవార్త కాదు. మన రాజైన దావీదు సొలొమోనును రాజుగా ప్రకటించాడు. 44 రాజైన దావీదు యాజకుడైన సాదోకును, ప్రవక్తయగు నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను, మరియు తన సేవకులను అతనితో పంపాడు. వారు సొలొమోనును రాజు యొక్క స్వంత కంచర గాడిదపై కూర్చుండబెట్టారు. 45 తరువాత యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను ఇరువురూ సొలొమోనుకు గిహోను వద్ద పట్టాభిషేకం చేశారు. వారుప్పుడు నగరానికి తిరిగి వెళ్లారు. ప్రజలు వారిననుసరించి వెళ్లారు. కావున ఇప్పుడు నగరంలో జనంమంతా చాలా సంతోషంగా వున్నారు. ఆ శబ్ధమే మీరిప్పుడు వింటున్నారు. 46 సొలొమోను ఇప్పుడు రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. 47 రాజు యొక్క సేవకులంతా రాజైన దావీదు వద్దకు అతను మంచిపని చేసినట్లు చెప్పటానికి వచ్చారు. వారంతా, ‘దావీదు రాజా, నీవు చాలా గొప్ప రాజువి! కాని నీ దేవుడు సొలొమోనును కూడ ఒక గొప్పరాజుగా చేయాలని ప్రార్థిస్తున్నాము. నీ దేవుడు సొలొమోనును నీకంటె ఖ్యాతిగల రాజుగా చేయును గాక. నీ రాజ్యముకంటె అతని రాజ్యము ఘనముగా ఉండునట్లు చేయునుగాక!’ అని అంటున్నారు. యోనాతాను నగరంలో జరుగుతున్న విషయాలు అదోనీయాతో ఇంకా ఇలా చెప్పసాగాడు: తరువాత రాజైన దావీదు దేవుని ప్రార్థించటానికి తన పక్కమీదే సాష్టాంగ పడ్డాడు. 48 ‘ఇశ్రాయేలు దేవుడైన నా యెహోవాకు జయమగును గాక! యెహోవా నా కుమారులలో ఒకనిని నా సింహాసనం మీద కూర్చుండ జేశాడు. దేవుడు అది నేను చూడగలిగేలా చేశాడు’ అని దావీదు రాజు అన్నాడు.”
49 ఇది విన్న అదోనీయా, అతిథులందరూ భయపడి అక్కడి నుండి త్వరగా వెళ్లిపోయారు. 50 అదోనీయా కూడ సొలొమోనుకు భయపడ్డాడు. కావున అతడు బలిపీఠం వద్దకు వెళ్లి, ఆ పీఠపు కొమ్ములను పట్టుకున్నాడు. 51 ఈ లోపు ఒకడు సొలొమోను వద్దకు వెళ్లి, “అదోనీయా నీవంటే చాలా భయపడిపోతున్నాడు. అతడు బలిపీఠం వద్ద ఉన్నాడు. అతడు బలిపీఠపు కొమ్ములను పట్టుకొని, అక్కడినుండి పోవటం లేదు. సొలొమోను వద్దకు ఎవరైనా వెళ్లి తనను చంపకుండా వుండేలా ప్రమాణం చేయించమని వేడుకుంటున్నాడు” అని చెప్పాడు.
52 అది విన్న సొలొమోను, “అదోనీయా గనుక బుద్ధిమంతునిలా మెలిగితే, అతని తలమీది ఒక్క వెంట్రుక కూడ రాలదని నేను ప్రమాణం చేస్తున్నాను. కాని అతడేమైనా పొరపాటు చేస్తే, వాడు చావటం ఖాయం” అని అన్నాడు. 53 అప్పుడు సొలొమోను కొంతమందిని పంపి అదోనీయాను తీసుకొని రమ్మన్నాడు. వారు అదోనీయాను రాజైన సొలొమోను వద్దకు తీసుకొచ్చారు. అదోనీయా రాజైన సొలొమోను ముందుకు వచ్చి సాష్టాంగపడ్డాడు. “నీవు ఇంటికి వెళ్లు” అని సొలొమోను అతనితో అన్నాడు.
* 1:33 గిహోను చలమ ఇది యెరూషలేము నగరానికి ప్రధానమైన నీటి వసతి. ఈ చలుమ సరిగ్గా నగరానికి బయట లోయలో ఉంది. ఇది అదోనీయా, అతని మనుష్యులు ఉన్న ఏన్‌రొగేలుకు చాలా దగ్గరలో ఉంది. 1:42 మంచివాడు “ముఖ్యమైన వ్యక్తిని” అని పాఠాంతరం. ఈ హిబ్రీ మాటకు, “ముఖ్యమైన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి” అని అర్థం. 1:50 పీఠపు కొమ్ములు అంటే అతను క్షమాభిక్ష కోరుతున్నాడని అర్థం. ఏ వ్యక్తి అయినా తాను తప్పు చేయకపోతే, అతడు పవిత్రస్థలంలోనికి వెళ్లి బలిపీఠపు కొమ్ములను పట్టుకుంటే అప్పుడా వ్యక్తి శిక్షింపబడకూడదు.