9
ఒక యువ ప్రవక్తతో యెహూని అభిషేకించమని ఎలీషా చెప్పుట
1 ప్రవక్త అయిన ఎలీషా ప్రవక్తల బృందంలో ఒకనిని పిలిచి, అతనితో ఎలీషా, “ఈ చిన్న నూనె సీసాని నీచేతిలో తీసుకుని వెళ్లాడానికి నీవు సిద్ధంగా ఉండు. రామోత్గిలాదుకు వెళ్లు.
2 నీవక్కడికి చేరుకోగానే, నింషీ కుమారుడైన యెహోషాపాతు కుమారుడగు యెహూనీకు కనిపిస్తాడు. అతని సోదరులలోనుండి అతనిని చాటుగా పిలిచి, తర్వాత ఒక గదిలోకి తీసుకు వెళ్లు.
3 చిన్న నూనె సీసా తీసుకుపోయి, యెహూ తలమీద నూనె పోసి ఈరీతిగా చెప్పు. ఇది యెహోవా చెప్పింది. ఇశ్రాయేలీయుల కొత్తరాజుగా నిన్ను అభిషేకించాను.తర్వాత నీవు తలుపు తెరిచి పారిపో. అక్కడ నిలిచి వుండువద్దు” అన్నాడు.
4 అందువల్ల ఈ యువ ప్రవక్త రామోత్గిలాదుకు వెళ్లాడు.
5 ఆ యువకుడు అక్కడకు చేరగానే, అతను సైన్యాధిపతులు అక్కడ కూర్చుని వుండటం చూశాడు. “అధిపతీ! నీకు నేనొక సందేశం తెచ్చాను” అని ఆ యువకుడు చెప్పాడు.
“మేమందరము ఇక్కడ్డున్నాము ఎవరికి సందేశం” అని యెహూ అడిగాడు.
“అధిపతీ! నీకే సందేశం” అని యువకుడు చెప్పాడు.
6 యెహూ లేచి ఇంట్లోకి వెళ్లాడు. అప్పుడు యువ ప్రవక్త యెహూను అభిషేకించాడు. ఆ యువ ప్రవక్త యెహూతో ఈ విధంగా చెప్పాడు: “యెహోవా యొక్క ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే కొత్తరాజుగా నిన్ను అభిషేకించానని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పుచున్నాడు.
7 నీ రాజైన అహాబు వంశాన్ని నీవు నాశనం చెయ్యాలి. కాబట్టి నా సేవకులు, ప్రవక్తలు, యెహోవా యొక్క మనుష్యుల, మరణానికి కారణమైన, యెజెబెలును శిక్షిస్తున్నాను.
8 అందువల్ల అహాబు వంశీయులందరూ మరణిస్తారు. అహాబు వంశంలో మగపిల్లవాడెవ్వడూ బతకనీయకుండా చేస్తాను. ఆ మగబిడ్డ సేవకుడైనా సరే స్వతంత్రుడైనా సరే భేదము లేదు.
9 నెబాతు కుమారుడైన యరొబాము వంశంవలె, అహీయా కుమారుడైన బయెషా వంశంవలె అహాబు వంశాన్ని చేస్తాను.
10 యెజ్రెయేలు ప్రదేశంలో యెజెబెలుని కుక్కలు తింటాయి, యెజెబెలు సమాధి చేయబడదు.”
ఆ తర్వాత యువ ప్రవక్త తలుపు తెరిచి పరుగెత్తుకొని పోయాడు.
యెహూని రాజుగా సేవకులు ప్రకటించుట
11 యెహూ తన రాజ ఉద్యోగుల వద్దకు వెళ్లాడు. ఒక అధికారి యెహూతో, “అంతా మంచిగా వున్నదా? ఈ పిచ్చివాడు నీ వద్దకు ఎందుకు వచ్చాడు?” అని అడిగాడు.
ఆ సేవకులకు యెహూ ఇలా సమాధాన మిచ్చాడు. “ఆవ్యక్తిని గురించి నీకు తెలుసు. అతను చెప్పే పిచ్చి విషయాలు నీకు తెలుసు.”
12 అధికారులు, “కాదు నిజం చెప్పు. అతడు ఏమి చెప్పాడు?” అని అడిగాడు. ఆ యువ ప్రవక్త చెప్పిన విషయాలు యెహూ అధికారులకు, “అతడు చెప్పిన దేమనగా, ‘ఇశ్రాయేలుకు కొత్తరాజుగా నేను నిన్ను అభిషేకించానని యెహోవా చెప్పాడు’ అని అతను నాకు చెప్పాడు.”
13 తర్వాత ప్రతి అధికారి వెంటనే తమ దుస్తులు తీసివేసి, యెహూ ఎదుట మెట్లమీద పరిచారు. ఆ తర్వత, “యెహూరాజు” అని బూరఊది ప్రకటించారు.
యోహూ యెజ్రెయేలుకు వెళ్లుట
14 అందువల్ల యెహోషాపాతు కుమారుడైన యెహూ, యెహోరాముకు విరుద్ధంగా పధక రచన చేసెను. యెహోషాపాతు నింషీ కుమారుడు.
ఆ సమయమున యెహోరాము మరియు ఇశ్రాయేలు వాళ్లు సిరియాకు రాజయిన హజాయేలుకు వ్యతిరేకంగా రామోత్గిలాదును కాపాడటానికి ప్రయత్నించారు.
15 సిరియా రాజయిన హజాయేలుకు ప్రతికూలంగా యెహోరాము రాజు యుద్ధం చేశాడు. కాని సిరియనులు యెహోరాము రాజును గాయపరిచారు. అతను ఆ గాయాల నుంచి బయటపడటానికి యెజ్రేయేలుకు వెళ్లాడు.
అందువల్ల యెహూ అధికారులను ఉద్దేశించి, “నేను కొత్త రాజని మీరు సమ్మతించి నట్లుయితే, ఇప్పుడు ఎవరినీ నగరం నుంచి తప్పంచు కొనకుండా చేయండి. ఎందుకనగా, ఈ విషయం యెజ్రెయేలీయులతో. చెప్పకూడదు” అని పలికాడు.
16 యెజ్రెయేలులో యెహోరాము మంచము పట్టి విశ్రాంతి పొందుచున్నాడు. అందువల్ల యెహూ తనరథమెక్కి, యెజ్రెయేలుకు వెళ్లాడు. యూదా రాజయిన అహజ్యా యెహోరామును చూడడానికి యెజ్రెయేలుకు వచ్చాడు.
17 యెజ్రెయేలులోని ఒక గోపురం మీద ఒక కాపలావాడు నిలబడివున్నాడు. యెహూ యొక్క పెద్ద సైన్యం రావడం అతను చూశాడు. “చాలా మంది మనుష్యులు వచ్చుట చూస్తున్నాను.” అని అతను చెప్పాడు.
“వారిని కలుసుకునేందుకు ఎవరినైనా గుర్రం మీద పంపుము. ఆ మనుష్యులు శాంతికోసం వస్తున్నారో లేదో కనుక్కోమని ఈ దూతతో చెప్పుము” అని యెహోరాము చెప్పాడు.
18 అందువల్ల ఆ దూత యెహూని కలుసుకోవడానికి గుర్రమెక్కి వెళ్లాడు. వార్తహరుడు, “మీరు శాంతికోసం వచ్చారా? లేదా అని యెహోరాము, అడుగుతున్నాడు” అని పలికాడు.
“శాంతితో నీకేమీ పని లేదు. రమ్ము, నన్ను అనుసరింపుము” అని యెహూ చెప్పాడు.
“దూత ఆ బృందం వద్దకు వెళ్లాడు. కాని ఇంత వరకూ తిరిగి రాలేదు” అని కాపలాదారుడు యెహోరాముతో చెప్పాడు.
19 తర్వాత యెహోరాము రెండవ దూతను గుర్రంమీద పంపాడు. ఈ వ్యక్తి యెహూ బృందం వారి వద్దకు వచ్చి, “యెహోరాము రాజు శాంతి అని చెప్పుచున్నాడు” అన్నాడు.
“నీకు శాంతితో ఏమీ పనిలేదు. రమ్ము, నన్ను అనుసరింపుము” అని సమాధానమిచ్చాడు.
20 “రెండవ దూత బృందం వద్దకు వెళ్లాడు. కాని అతను కూడా ఇంకా తరిగి రాలేదు. పిచ్చివానివలె, ఒకడు అతని రథం నడుపుతున్నాడు. నింషీ కుమారుడైన యెహూవలె నడుపుతున్నాడు” అని కాపలాదారు యెహోరాముతో అన్నాడు.
21 “నా రథం తీసుకుని రా” అని యెహోరాము చెప్పాడు.
అందువల్ల సేవకుడు యెహోరాము యొక్క రథమును తీసుకువచ్చాడు. ఇశ్రాయేలు రాజయిన యెహోరాము, యూదా రాజయిన అహజ్య, ఇద్దరూ రథాలలో యెహూని కలుసుకోడానికి వెళ్లారు. వారు యెజ్రెయేలియుడైన నాబోతు పొలం వద్ద యెహూని కలుసుకున్నారు.
22 యెహోరాము యెహూని చూసి, “యెహూ, నీవు శాంతికోసం వచ్చావా?” అని అడిగాడు.
“నీ తల్లి యెజెబెలు వ్యభిచారము, చేతబడితనము ఘోరముగా చేయుచుండగా సమాధానం ఎక్కడనుండి వచ్చును.” అని చెప్పి పారిపోవుచు ఉండెను.
23 యెహోరాము గుర్రాలను వెనక్కి పరుగు తీయించాడు. యెహోరాము అహజ్యాను చూసి “అహజ్యా, ఇది ఒక మాయోపాయం” అన్నాడు.
24 అప్పుడు యెహూ తన బలంకొద్దీ బాణం లాగి యెహోరాముని వీపుమీద కొట్టాగా, ఆ బాణం యెహోరాము గుండెలోనుండి దూసుకొని వెళ్లగా, యెహోరాము తన రథం మీదనే మరణించాడు.
25 యెహూ తన అధిపతియైన బిద్కరుతో, “యెహోరాము దేహాన్ని పైకి ఎత్తి, యెజ్రెయేలులో నాబోతు పొలంలోకి విసిరివేయుము. ఒకసారి జ్ఞాపకం చేసుకో నీవు, నేను యెహోరాము తండ్రి అయిన అహాబుతో కలిసి పయనం చేసినప్పుడు, ఇది అతనికి జరుగునని యెహోవా చెప్పాడు.
26 ‘నిన్న నాబోతు అతని కుమారుల రక్తం నేను చూశాననీ, అందువల్ల ఈ పొలంలో అహాబును శిక్షించెదననీ’ యెహోవా చెప్పెను. కావున, యెహోవా చెప్పినట్లు ఈ కళేబరాన్ని తీసుకొని పొలంలోకి విసరుము అనెను.”
27 యూదా రాజయిన అహజ్యా దీనిని చూసి పారి పోయాడు. అతను ఉద్యానవన గృహంద్వారా తప్పించుకొనడానికి ప్రయత్నించాడు. యెహూ అతనిని అనుసరించాడు. “అహజ్యా తన రథంలోకి వెళ్లినా, అతనిని చంపి వేయుము” అని యెహూ చెప్పాడు.
అందువల్ల యెహూ మనుష్యులు అహజ్యాను ఇబ్లె యాము దగ్గర గూరునకు వెళ్లే బాటమీద కొట్టగా అహజ్యా మెగిద్దోకు పారిపోయి అతను అక్కడ మరణించాడు.
28 అహజ్యా సేవకులు అహజ్యా శరీరాన్ని రథంలో తీసుకొని యెరూషలేముకి వెళ్లారు. వారు అహజ్యాను దావీదు నగరంలో అతని పూర్వికుల సమాధిలో సమాధి చేశారు.
29 ఇశ్రాయేలు రాజుగా యెహోరాము పదకొండవ పరిపాలనా సంవత్సరమున అహజ్యా యూదాకు రాజయ్యాడు.
యెజెబెలు భయంకర మరణం
30 యెహూ యెజ్రెయేలుకు వెళ్లాడు. యెజెబెలు ఆ వార్త విన్నది. కనుక ఆమె తనను సింగారించుకుంది జుట్టు సరిదిద్దుకుంది, రంగుపూసుకుంది, శిరోభూషనములు ధరించుకున్న తర్వాత ఆమె కిటికీకి ప్రక్కగా నిలిచి వెలుపలికి చూచింది.
31 యెహూ గుమ్మం ద్వారా నగరం ప్రవేశించాడు. “ఆమె అతనిని చూసి జిమ్రీ వంటివాడా, అతనివలె నీవు నీ యజమానిని చంపివేశావు” సమాధానంగా వచ్చుచున్నావా అని యెజెబెలు అడిగెను.
32 యెహూ కిటికీ పైకి చూశాడు. “నా ప్రక్క ఎవరున్నారు? ఎవరు?”
అన్నాడు. ఇద్దరో ముగ్గురో నపుంసకులు యెహూని కిటికి నుండి చూశారు.
33 వారీతో యెహూ, “యెజెబెలుని కిందికి తోసి వేయండి” అన్నాడు.
తర్వాత నపుంసకులు యెజెబెలుని కిందికి తోసివేశారు. యెజెబెలు రక్తం కొంచెం గోడమీద చిమ్మింది. గుర్రాలమీద కూడా చిమ్మింది. గుర్రాలు యెజెబెలు శరీరం మీదగా నడిచాయి.
34 యెహూ ఇంట్లోకి వెళ్లి అన్నపానాదులు చేసిన తరువాత, “ఇప్పుడు ఈ శాపగ్రస్తురాలిని చూడండి, ఈమె ఒక రాజు కుమార్తె. అందువల్ల ఆమెను సమాధి చేయండి” అన్నాడు.
35 ఆ మనుష్యులు యెజెబెలుని సమాధి చేయడానికి వెళ్లారు. కాని ఆమె శరీరం వారికి కనబడలేదు. ఆమె కపాలము, ఆమె పాదాలు, ఆమె అరచేతులు మాత్రమే కనిపించాయి.
36 అందువల్ల ఆ మనుష్యులు వెనుదిరిగి వచ్చి యెహూతో చెప్పారు. అప్పుడు “యెహోవా తన సేవకుడు తిష్బీవాడయిన ఏలీయాతో చెప్పాడు. యెజ్రెయేలు ప్రదేశంలో యెజెబెలు శవాన్ని కుక్కలు తింటాయని.
37 యెజ్రెయేలు ప్రదేశపు పొలంలో యెజెబెలు శవం పెంటవలె ఉంటుందనీ, ఇది యెజెబెలని ఎవరూ గుర్తు పట్టలేరనీ ఎలీయా చెప్పాడు.”