మీకా
1
సమరయ, ఇశ్రాయేలుకు దండన
యెహోవా వాక్కు మీకాకు అందింది. ఇది యోతాము, ఆహాజు, మరియు హిజ్కియా అనే రాజుల కాలంలో జరిగింది. వీరు ముగ్గురూ యూదా రాజులు. మీకా, మోరషతు నగరం వాడు. సమరయ, యెరుషలేములను గురించిన ఈ దర్శనాలను మీకా చూశాడు.
 
ప్రజాలారా, మీరంతా వినండి!
భూమీ, దాని మీదగల ప్రతి ఒక్కడూ, అంతా వినండి!
నా ప్రభువైన యెహోవా తన పవిత్ర ఆలయం నుండి వస్తాడు.
నా ప్రభువు మీకు వ్యతిరేకంగా ఒక సాక్షిగా వస్తాడు.
చూడండి, దేవుడైన యెహోవా తన స్థానంనుండి బయటకు వస్తున్నాడు.
ఆయన భూమీయొక్క ఉన్నత స్థలాలపై నడవటానికి కిందికి వస్తున్నాడు.
దేవుడైన యెహోవా అగ్ని ముందు
మైనంలా పర్వతాలు కరిగిపోతాయి.
గొప్ప జలాపాతంలా,
లోయలు వికలమై కరిగిపోతాయి.
యాకోబు పాపం కారణంగా,
ఇశ్రాయేలు ఇంటి వారు చేసిన పాపాల కారణంగా ఇది జరుగుతుంది.
సమరయ పాప హేతువు
యాకోబు పాపానికి కారణం ఏమిటి?
దానికి కారణం సమరయ!
యూదాలో ఉన్నత స్థలమేది?*
అది యెరూషలేము!
మైదానంలో రాళ్ల గుట్టలా నేను సమరయను మార్చుతాను.
అది ద్రాక్షాతోట వేయటానికి అనువైన భూమివలె మారిపోతుంది.
సమరయ యొక్క నిర్మాణపు రాళ్లను పెరిగి లోయలో పారవేస్తాను.
నేను దాని పునాదులను నాశనం చేస్తాను.
దాని విగ్రహాలన్నీ ముక్కలుగా విరుగ గొట్టబడతాయి.
అది సంపాదించిన ధనం అగ్నికి ఆహుతి అవుతుంది.
దానియొక్క బూటకపు దేవుళ్ల విగ్రహాలన్నిటినీ నేను నాశనం చేస్తాను.
ఎందుకంటే, సమరయ నా పట్ల అవిశ్వాసంగా ఉండి అవన్నీ కూడబెట్టింది.
కావున ఈ వస్తువులన్నీ నాపట్ల
అవిశ్వసంగా ఉన్న ఇతర ప్రజలకు వెళ్లిపోతాయి.
మీకా యొక్క తీరని విచారం
ఈ చెడు విషయంలో నేను కలవరపాటుచెంది, విచారిస్తున్నాను.
నేను పాద రక్షలు కూడ లేకుండా, నగ్నంగా బయటకు వెళతాను.
నక్కలు ఊళ పెట్టినట్లు నేను అరుస్తాను.
నిప్పు కోళ్లలా మూల్గుతాను.
ఎందుకనగా సమరయ గాయం మాన్పరానిది.
ఆమె గాయం (పాపం) యూదాకు వ్యాపించింది.
అది నా ప్రజల నగర ద్వార వద్దకు చేరింది.
అది చివరకు యెరూషలేము వరకు వచ్చింది.
10 ఇది గాతులో చెప్పవద్దు.
అక్కడ ఏడ్వవద్దు.
బేత్‌యఫ్రలో విలపించి,
దుమ్ములో పొర్లాడు.
11 షాఫీరులో నివసించేవాడు,
దిగంబరివై, సిగ్గుతో నీ దారిన నీవు పోమ్ము.
జయనానులో నివసించేవాడు
బయటకు వెళ్లడు.
బేతేజెలులో ఉన్నావారు విలపిస్తారు.
దానికి కావలసిన ఆసరా మీ నుండి తీసుకొంటుంది.
12 మారోతులో నివసించేవాడు మంచివార్త కోసం
ఎదురు చూస్తూ నీరసించిపోయాడు.
ఎందుకంటే యెహోవానుండి
ఆపద యెరూషలేము నగర ద్వారంవరకు వచ్చింది.
13 లాకీషులో నివసిస్తున్న ఓ స్త్రీ,
రథాన్ని వేగముగల గుర్రానికి తగిలించు.
సీయోను పాపాలు లాకీషులో మొదలైనాయి.
ఎందుకంటే నీవు ఇశ్రాయేలు పాపాలనే అనుసరించావు.
14 కావున గాతులోని మోరెషెతుకు
మీరువీడ్కోలు బహుమతులు ఇవ్వాలి.
అక్జీబులోని ఇండ్లు
ఇశ్రాయేలు రాజులను మోసపుచ్చుతాయి.
15 మారేషా నివాసులారా,
మీ మీదికి నేనోక వ్యక్తిని తీసుకొని వస్తాను, మీకున్న వస్తువులన్నీ ఆ వ్యక్తి తీసుకుంటాడు.
ఇశ్రాయేలు మహిమ (దేవుడు)
అదుల్లాములో ప్రవేశిస్తుంది.
16 కావున మీ తలలు గొరిగించి, బోడిగా చేసుకోండి.
ఎందుకంటే మీరు ప్రేమించే పిల్లలకొరకుమీరు దుఃఖిస్తారు.
రాబందులారా మీ తలలు బోడి చేసుకోండి.
ఎందుకంటే మీ పిల్లలు మీకు దూరమవుతారు. వారు బలవంతంగా ఇండ్లు వదిలి పోయేలా చేయబడతారు.
 
* 1:5 ఉన్నత స్థలం దీనికి కేవలం “కొండ” అని అర్థం కావచ్చు లేదా దేవుని లేదా దొంగ దేవుళ్లను పూజించే ప్రదేశం కావచ్చు. ఈ ప్రదేశాలు సాధారణంగా కొండలమీద, పర్వతాలమీద ఉంటాయి.