2
నివాసం ఏర్పాటు
1 మోషే, అహరోనులతో యెహోవా ఇలా అన్నాడు:
2 “ఇశ్రాయేలు ప్రజలు వారి డేరాను సన్నిది గుడారం చుట్టూ వేసుకోవాలి. ఒక్కోవంశానికి దాని స్వంత ధ్వజం ఉంటుంది, ఎవరి వంశ ధ్వజం దగ్గర వారు నివాసం చేయాలి.
3 “యూదా డేరా పతాకం తూర్పుపక్క అంటే సూర్యోదయ దిశన ఉంటుంది. యూదా ప్రజలకు అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను నాయకుడు.
4 ఈ విభాగములో 74,600 మంది పురుషులు ఉన్నారు.
5 “యూదావారి పక్కన ఇశ్శాఖారు వంశంవారి డేరా ఉంటుంది. సూయారు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు వంశానికి నాయకుడు.
6 ఈ విభాగములో 54,400 మంది ఉన్నారు.
7 “జెబూలూను వంశం కూడ యూదా వంశం పక్కగానే ఉంటారు. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూను వారికి నాయకుడు.
8 ఈ విభాగములో 57,400 మంది ఉన్నారు.
9 “యూదా సంతతిలో 1,86,400 మంది పురుషులు ఉన్నారు. వీరంతా వారివారి వంశాల ప్రకారముగా విభజించబడ్డారు. ప్రజలు ఒక చోటనుండి మరో చోటకు తరలి వెళ్లేటప్పుడు యూదా వంశం వారు ముందుగా నడుస్తారు.
10 “పవిత్ర గుడారానికి దక్షిణాన రూబేను డేరా ధ్వజం ఉంటుంది. ఒక్కో వంశం దాని ధ్వజం దగ్గర నివాసం చేస్తారు. షెదేయూరు కుమారుడు ఏలీసూరు రూబేను వారికి నాయకుడు.
11 ఈ విభాగములో 46, 500 మంది ఉన్నారు.
12 “రూబేను వంశానికి పక్కగా షిమ్యోను వంశంవారు నివాసం చేస్తారు. సూరీషద్దాయి కుమారుడు షెలుమీయేలు, షిమ్యోను వారికి నాయకుడు.
13 ఈ విభాగములో 59,300 మంది ఉన్నారు.
14 “గాదు వంశంకూడ రూబేను వారి పక్కగా నివాసంచేస్తారు. రగూయేలు కుమారుడైన ఎలీయాసావు గాదు వారికి నాయకుడు.
15 ఈ విభాగములో 45,650 మంది ఉన్నారు.
16 “మొత్తం రూబేను నివాసంలో ఉన్న విభాగములన్నిటిలో కలిసి 1,51,450 మంది పురుషులు ఉన్నారు. ప్రజలు ఒక చోటనుండి మరోచోటికి తరలి వెళ్లేటప్పుడు రూబేను వంశం రెండో విభాగముగా బయల్దేరుతుంది.
17 “ప్రజలు ప్రయాణం చేసేటప్పుడు లేవీ వంశంవారు తర్వాత బయల్దేరతారు. సన్నిధి గుడారం వారితో బాటు ఇతర వంశాలవారి మధ్య ఉంటుంది. వారు బయల్దేరి వెళ్లే క్రమంలోనే వారి నివాసం ఏర్పాటు చేసుకొంటారు. ప్రతి వ్యక్తి తన వంశ ధ్వజం దగ్గర ఉంటాడు.
18 “ఎఫ్రాయిము వారి గుడారపు ధ్వజం పడమటి దిక్కున ఉంటుంది. ఎఫ్రాయిము విభాగములు అక్కడ నివసిస్తాయి. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిము ప్రజలకు నాయకుడు.
19 ఈ విభాగములో 40,500 మంది ప్రజలు ఉన్నారు.
20 “ఎఫ్రాయిము కుటుంబానికి పక్కగా మనష్షే వంశం నివసిస్తుంది. పెదాసూరు కుమారుడు గమలీయేలు మనష్షే మనుష్యులకు నాయకుడు.
21 ఈ విభాగములో 32,200 మంది మనుష్యులు ఉన్నారు.
22 “బెన్యామీను వంశం కూడ ఎఫ్రాయిము కుటుంబానికి పక్కగా నివాసం చేస్తారు. గిద్యోనీ కుమారుడు అబీదాను బెన్యామీను ప్రజలకు నాయకుడు.
23 ఈ విభాగములో 35,400 మంది మనుష్యులు ఉన్నారు.
24 “ఎఫ్రాయిము నివాసములో మొత్తం 1,08,100 పురుషులు ఉన్నారు. ప్రజలు ఒక చోటునుండి మరోచోటుకు తరలి వెళ్లినప్పుడు వారు మూడో కుటుంబంగా బయల్దేరతారు.
25 “దాను వారి గుడారపు ధ్వజం ఉత్తర దిశనఉంటుంది. దాను కుటుంబ విభాగాలు అక్కడ నివసిస్తాయి. అమీషద్ధాయి కుమారుడైన అహీయెజెరు దాను వారికి నాయకుడు.
26 ఈ విభాగములో 62,700 మంది ప్రజలు ఉన్నారు.
27 “ఆషేరు వంశాల వారు దాను కుటుంబ విభాగము పక్కగా నివాసం చేస్తారు. ఒక్రాను కుమారుడు పగీయేలు, ఆషేరు ప్రజల నాయకుడు.
28 ఈ వంశలో 41,500 మంది ప్రజలు ఉన్నారు.
29 “నఫ్తాలి వంశంకూడ దాను వంశానికి పక్కగా నివాసం చేస్తారు. ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలి ప్రజల నాయకుడు.
30 ఈ విభాగంలో 53,400 మంది ఉన్నారు.
31 “దాను నివాసంలో మొత్తం 1,57,600 మంది పురుషులు ఉన్నారు. ప్రజలు ఒక చోట నుండి మరో చోటుకు తరలినప్పుడు, వీరు చివరి కుటుంబముగా బయల్దేరతారు. వారు తమ స్వంత ధ్వజం క్రిందనే నివాసం చేస్తారు.”
32 అన్ని నివాసాలలోను ఉన్న మొత్తం వంశాలన్నింటిలో కలిపి 6,03,550 మంది పురుషులు ఉన్నారు.
33 మోషే ఇశ్రాయేలు ప్రజలందరిలో కలిపి లేవీయులను లెక్కించలేదు. ఇది యెహోవా ఇచ్చిన ఆజ్ఞ.
34 కనుక మోషేతో యెహోవా ెచెప్పిన వాటన్నింటికి ఇశ్రాయేలు ప్రజలు విధేయులయ్యారు. యెహోవా వారితో చెప్పినట్టే ఇశ్రాయేలు ప్రజలు వారివారి పతాకాలదగ్గర నివాసం చేసారు. యెహోవా వారితో చెప్పిన విధానంలోనే ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసారు. ప్రతి వ్యక్తి తన కుటుంబంతో, వంశంతోనే ఉన్నారు.