5
పరిశుభ్రత నియమాలు
1 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
2 “ఇశ్రేయేలు ప్రజలు వ్యాధులు, రోగములు లేకుండవారి నివాసమును కాపాడుకోవాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. కుష్ఠురోగం ఉన్న ఏ మనిషినైనా సరే వారి నివాసములో నుండి పంపించి వేయాలని ప్రజలతో చెప్పు. స్రావంగల ప్రతి మనిషికి వారి నివాసంలోనుండి పంపివేయాలని వారితో చెప్పు. శవాన్ని ముట్టిన ప్రతి మనిషినీ వారి నివాసమునుండి పంపివేయాలని వారితో చెప్పు.
3 అతడు స్త్రీగాని, పురుషుడుగాని గొప్పేమీ కాలేదు. రోగాన్ని వ్యాధిని వారు మీ నివాసములో వ్యాపింపజేయకుండునట్లు వారిని మీ నివాసమునుండి బయటకు పంపించివేయండి. మీ నివాసములో మీ మధ్య నేను నివసిస్తున్నాను.”
4 కనుక ఇశ్రేయేలు ప్రజలు దేవుని ఆజ్ఞకు విధేయులయ్యారు. అలాంటి వారిని నివాసము వెలుపలకు వారు పంపించివేసారు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం వారు ఇలా చేసారు.
తప్పు చేస్తే శిక్ష
5 మోషేతో యెహోవా ఈలాగు చెప్పాడు:
6 “ఇశ్రేయేలు ప్రజలతో ఇలా చెప్పు: ఒకడు మరొక వ్యక్తికి కీడు చేస్తాడు. (ఒకడు ఇతరులకు కీడు చేస్తే వాడు నిజానికి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు.) అతడు దోషి.
7 కనుక అతడు తాను చేసిన పాపం గూర్చి ప్రజలతో చెప్పాలి. తర్వాత అతడు చేసిన తప్పుకు పూర్తిగా విలువ చెల్లించాలి. అతడు ఎవరికి నష్టం కలిగించాడో ఆ మనిషికి చెల్లించాల్సినదానికి ఇంకా ఐదో వంతు కలిపి చెల్లించాలి.
8 కానీ ఒక వేళ ఎవరికైతే అతడు నష్టం కలిగించాడో అతడు చనిపోతాడు. ఒక వేళ నష్టపరిహరం పుచ్చుకొనేందుకు, చనిపోయిన వ్యక్తికి నావాళ్లు అనుటకు ఎవరు ఉండరు. అలాంటప్పుడు తప్పు చేసినవాడు ఆ విలువను యహోవాకు చెల్లించాలి. అతడు పూర్తి మొత్తాన్ని యాజకునికి చెల్లించాలి. యాజకుడు ప్రాయశ్చిత్తార్థపు పొట్టేలును బలిగా అర్పించాలి. తప్పు చేసిన ఆ మనిషి పాపాలు క్షమింపబడుటకు బలిగా పొట్టేలు అర్పించబడాలి. మిగిలిన విలువను యాజకుడు ఉంచు కోవచ్చును.
9 “ఇశ్రేయేలు ప్రజల్లో ఒకడు దేవునికి ఒక ప్రత్యేక కానుక ఇస్తే, దానిని స్వీకరించే యాజకుడు దానిని ఉంచుకోవచ్చును. అది అతనిదే.
10 ఈ ప్రత్యేక కానుకలు అర్పించాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. కాని ఎవరైనా అలా ఇస్తే, అవి యాజకునికే చెందుతాయి.”
అనుమానం భర్తలు
11 అప్పుడు మోషేతో యోహోవా ఈలాగున చెప్పాడు:
12 “ఇశ్రేయేలు ప్రజలతో ఈ విషయాలు చెప్పు: ఒకని భార్య అతనికి అపనమ్మకంగా ఉంటుంది.
13 ఆమె మరొకనితో శయనించి, తన భర్తకు తెలియకుండా ఈ విషయం దాచిపెడుతుంది. ఆమె చేసిన తప్పునుగూర్చి ఆమె భర్తకు ఎప్పటికి తెలియకపోవచ్చు. ఆమె ఆ పాపం చేసిందని అతనితో చెప్పే వారు ఎవరూ ఉండక పోవచ్చు. మరియు ఆ స్త్రీ తన పాపం విషయం తన భర్తకు చెప్పకపోవచ్చు.
14 కానీ, తన భార్య తనకు వ్యతిరేకంగా పాపం చేసిందని ఆ భర్త అనుమానించటం ప్రారంభం కావచ్చు. అతనిలో కోపం కలుగుతూ వుండవచ్చు. ఆమె పవిత్రంగా లేదని, తనకు నమ్మకంగా లేదని అతనిలో అనుమానం ఏర్పడుతూ ఉండవచ్చు.
15 అలా జరిగితే, అతడు తన భార్యను యాజకుని దగ్గరకు తీసుకునిపోవాలి. ఆ భర్త ఒక అర్పణకూడ తీసుకొని వెళ్లాలి. ఆ అర్పణ తూమెడు యవలపిండిలో పదోవంతు. యవలపిండిలో నూనెగాని సాంబ్రాణిగాని వేయకూడదు. ఈ యవల పిండి యెహోవాకు ధాన్యార్పణ. భర్త రోషం మూలంగా అది అర్పించబడింది. అతని భార్య అతనికి అపనమ్మకంగా ఉందని అతడు నమ్ముతున్నట్టు ఈ అర్పణ సూచిస్తుంది.
16 “యాజకుడు ఆ స్త్రీని యెహోవా ఎదుట నిలువబెడ్తాడు.
17 అప్పుడు యాజకుడు మట్టి పాత్రలో పవిత్ర జలం పోస్తాడు. పవిత్ర గుడాకంలోని నేల మీద మట్టి కొంత తీసుకుని, దానిని ఆ నీళ్లలో వేస్తాడు యాడకుడు.
18 ఆ స్త్రీని యెహోవా ఎదుట నిలచివుండమని యాజకుడు ఆమెను బలవంతం చేస్తాడు. అప్పుడతడు ఆమె తల వెంట్రుకలను వదులుగా విడిచి, ధాన్యార్పణను ఆమె చేతిలో పెడతాడు. ఇది తన భర్త రోషం విషయం అర్పించే యవల పిండి. అదే సమయంలో పవిత్ర జలం ఉన్న మట్టి పాత్రను అతడు పట్టుకొంటాడు. ఇది ఆ స్త్రీకి చిక్కుతెచ్చిపెట్టే పవిత్ర జలం.
19 “అప్పుడు అబద్ధం చెప్పకూడదని యాజకుడు ఆ స్త్రీతో చెబుతాడు. సత్యం చెబుతానని ఆమె వాగ్ధానం చేయాలి. యాజకుడు ఆమెతో ఇలా అంటాడు, ‘నీవు ఇంకో మగవాడితో శయనించి ఉండకపోతే, నీ భర్తను పెళ్లాడిన నీవు, అతనికి వ్యతిరేకంగా పాపం చేసి ఉండకపోతే, కష్టం కలిగించే ఆ జలం నీకు హాని చేయదు.
20 కానీ నీవు నీ భర్తకు వ్యతిరేకంగా పాపం చేసి ఉంటే, నీవు మరో మగవాడితో శయనించి ఉంటే నీకు ఏదో కీడు జరుగుతుంది. నీవు పవిత్రురాలివి కాదు. ఎందు చేతనంటే నీ భర్తకాని వాడైన పర పురుషుడు నీతో శయనించి నిన్ను అపవిత్రం చేసాడు.
21 కనుక నీవు ప్రత్యేక జలం తాగినప్పుడు నీకు గొప్ప కీడు సంభవిస్తుంది. నీ కడుపు ఉబ్బిపోతుంది, ఇంక నీకు పిల్లలు పుట్టరు. నీవు గర్భవతివి అయితే నీ శిశువు చనిపోతుంది. అప్పుడు నీ వాళ్లంతా నిన్ను విడిచిపెట్టేసి, నిన్నుగూర్చి చెడుదా చెప్పుకొంటారు.’
“ఆ స్త్రీ యెహోవాకు ప్రత్యేక ప్రమాణం చేయాలని యాజకుడు ఆమెతో చెప్పాలి. ఆ స్త్రీ అబద్ధం గనుక చెబితే ఈ కీడు తనకు జరుగుతుందని ఒప్పుకోవాలి.
22 ‘నీ శరీరంలో హాని కలిగించే ఈ నీళ్లు నీవు తాగాలి. నీవు పాపం చేసి ఉంటే నీకు పిల్లలు పుట్టరు, నీకు కలిగే ఏ శిశువైనా సరే పుట్టక ముందే చనిపోతుంది’ అని యాజకుడు చెప్పాలి. అప్పుడు ఆ స్త్రీ ‘నీవు చెప్పినట్టు చేయటానికి నేను ఒప్పుకుంటున్నాను’ అని చెప్పాలి.
23 “యాజకుడు ఈ హెచ్చరికలను ఒక పత్రంమీద వ్రాయాలి. అప్పుడు అతడు ఆ మాటలను నీళ్లలోనికి తుడిచివేయాలి.
24 అప్పుడు హాని కలిగించే ఆ నీళ్లను ఆ స్త్రీ తాగుతుంది. ఆ నీళ్లు ఆమెలో ప్రవేశించి, ఆమె దోషి అయితే, ఆమెకు చాల శ్రమ కలిగిస్తాయి.
25 “అప్పుడు యాజకుడు ఆమె దగ్గరనుండి ధాన్యార్పణ తీసుకుని (రోషమునకు అర్పించు అర్పణ) దానిని యెహోవా ఎదుట పైకి ఎత్తుతాడు. తర్వాత బలిపీఠం దగ్గరకు దానిని తెస్తాడు.
26 ఆ తర్వాత యాజకుడు తన చేతినిండా ధాన్యార్పణ పట్టుకొని బలిపీఠం మీద ఉంచుతాడు. అప్పుడు అతడు దానిని దహిస్తాడు. ఆ తర్వాత ఆ నీళ్లు త్రాగమని అతడు ఆ స్త్రీతో చెబుతాడు.
27 ఆ స్త్రీ తన భర్తకు వ్యతిరేకంగా పాపం గనుక చేసి ఉంటే, ఆ నీళ్లు ఆమెకు హాని కలిగిస్తాయి. ఆ నీళ్లు ఆమె శరీరంలోనికి పోయి, ఆమెకు చాలా శ్రమ కలిగిస్తాయి. ఆమెలో ఏదైనా శిశువు ఉంటే అది పుట్టక ముందే మరణిస్తుంది, ఆమె ఎన్నటికీ పిల్లలను కనదు. ప్రజలంతా ఆమెకు వ్యతిరేకం అవుతారు.
28 కానీ ఆస్త్రీ తన భర్తకు వ్యతిరేకంగా పాపం చేసి ఉండకపోతే, ఆమె పవిత్రంగా ఉంటే అప్పుడు ఆమె నిర్దోషి అని యాజకుడు చెబుతాడు. అప్పుడు ఆమె మామూలుగా ఉండి పిల్లలను కనగల్గుతుంది.
29 “అందుచేత రోషమునుగూర్చిన ఆజ్ఞ ఇది. తన భర్తతో వివాహం జరిగిన ఒక స్త్రీ తన భర్తకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు నీవు చేయాల్సింది ఇది.
30 లేక ఒకడు తన భార్య తనకు వ్యతిరేకంగా పాపం చేసిందని అనుమానించినప్పుడు అతడు చేయాల్సింది ఇది. ఆ స్త్రీని యెహోవా యెదుట నిలువమని యాజకుడు చెప్పాలి. అప్పుడు యాజకుడు ఇవన్నీ చేయాలి. ఇది ఆజ్ఞ.
31 ఇలా చేసినందువల్ల భర్త తప్పు చేసినట్టు కాదు. కానీ ఆ స్త్రీ మాత్రం పాపం చేసి ఉంటే శ్రమ అనుభవిస్తుంది.”