11
వస్తువులను సరిగ్గా తూచలేని త్రాసులను కొందరు మనుష్యులు ఉపయోగిస్తారు. మనుష్యులను మోసం చేయటానికి వారు ఆ త్రాసులను ఉపయోగిస్తారు. ఆ తప్పుడు త్రాసులు యెహోవాకి అసహ్యం. కానీ సరిగ్గా ఉండే త్రాసులు యెహోవాకు ఇష్టం.
గర్వించి, గొప్పలు చెప్పుకొనే మనుష్యులు ఎన్నిక లేని వారవుతారు. కానీ దీనులు జ్ఞానముగల వారవుతారు.
మంచి, నిజాయితీగల మనుష్యులు నిజాయితీ పంథాను అనుసరిస్తారు. కానీ దుర్మార్గులు ఇతరులను మోసం చేసినప్పుడు వారిని వారే నాశనం చేసుకొంటారు.
దేవుడు మనుష్యులకు తీర్చు తీర్చేనాడు, డబ్బుకి విలువ ఏమీ ఉండదు. కానీ మంచితనం మనుష్యులను మరణం నుండి రక్షిస్తుంది.
ఒక మంచి మనిషి గనుక నిజాయితీగా ఉంటే, అతని జీవితం సులభంగా ఉంటుంది. కానీ దుర్మార్గుడు అతడు చేసే చెడు పనుల మూలంగా నాశనం చేయ బడతాడు.
నిజాయితీగల మనిషిని మంచితనం రక్షిస్తుంది. కానీ దుర్మార్గులు వారు చేయాలనుకొన్న చెడు విషయాల ఉచ్చులో పట్టుబడతారు.
దుర్మార్గుడు చనిపోయిన తర్వాత అతనికి నిరీక్షణ ఏమీలేదు. అతడు ఆశించినది అంతా పోతుంది అదంతా మొత్తం ఏ విలువలేనిది అవుతుంది.
మంచి మనిషి కష్టాన్ని తప్పించుకొంటాడు. ఆ కష్టం మరొక దుర్మార్గునికి సంభవిస్తుంది.
ఒక దుర్మార్గుడు చప్పే విషయాల మూలంగా అతడు ఇతరులను బాధించగలడు. కానీ మంచి మనుష్యులు వారి జ్ఞానము చేత కాపాడబడుతారు.
10 మంచి మనుష్యులకు విజయం కలిగినప్పుడు పట్టణం అంతా సంతోషిస్తుంది. దుర్మార్గులు నాశనం చేయబడినప్పుడు ప్రజలు సంతోషంతో కేకలు వేస్తారు.
11 నిజాయితీగల మనుష్యులు వారు నివసిస్తున్న పట్టణానికి తమ దీవెనలు ఇచ్చినప్పుడు, అది గొప్పది అవుతుంది. కానీ ఒక దుర్మార్గుడు చెప్పే విషయాలు ఒక పట్టణాన్ని నాశనం చేయగలవు.
12 బుద్ధిహీనుడు ఇతరులను విమర్శిస్తాడు. అయితే జ్ఞానముగలవానికి ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసు.
13 ఇతరులను గూర్చి రహస్యాలు చెప్పే వారెవరూ నమ్మదగినవారు కారు. కానీ నమ్మదగిన మనిషి చెప్పు మాటలను వ్యాపింపచేయడు.
14 ఒక దేశానికి సమర్ధత లేని నాయకులు ఉంటే, ఆ దేశం పతనం అవుతుంది. అయితే అనేకమంది మంచి సలహాదారులు ఆ దేశాన్ని క్షేమంగా ఉంచుతారు.
15 ఇంకో మనిషి బాకీ నీవు చెల్లిస్తానని వాగ్దానం చేస్తే, అప్పుడు నీవు విచారిస్తావు. అలాంటి వ్యవహారాలను నీవు తిరస్కరిస్తే నీవు క్షేమంగా ఉంటావు.
16 దయగల, మర్యాదస్థురాలు గౌరవం సంపాదిస్తుంది. చొచ్చుకుపోయే పురుషులు ధనం మాత్రమే సంపాదిస్తారు.
17 దయగల మనిషి లాభం పొందుతాడు.కానీ నీచుడు తనకు తానే కష్టం తెచ్చుకొంటాడు.
18 దుర్మార్గుడు మనుష్యులను మోసం చేసి, వారి డబ్బు తీసుకొంటాడు. అయితే న్యాయంగా ఉండి, సరైనది చేసేవాడు నిజమైన బహుమానం పొందుతాడు.
19 నిజంగా, మంచితనం జీవాన్ని తెచ్చిపెడ్తుంది. కానీ దుర్మార్గులు దుర్మార్గాన్ని వెంటాడి, మరణం తెచ్చుకొంటారు.
20 దుర్మార్గం చేయటానికి ఇష్టపడే వాళ్లు యెహోవాకు అసహ్యం. అయితే మంచిని చేసేందుకు ప్రయత్నించే వాళ్ల విషయం యెహోవాకు సంతోషం.
21 దుర్మార్గులు నిశ్చయంగా శిక్షించబడతారు అనేది సత్యం. మంచివాళ్లు స్వతంత్రులుగా చేయబడతారు.
22 ఒక స్త్రీ అందంగా ఉండి, అవివేకంగా ఉంటే అది అందమైన బంగారు ఉంగరం పంది ముక్కుకు ఉన్నట్టే ఉంటుంది.
23 మంచి మనుష్యులకు వారు కోరిందిలభించి నప్పుడు దాని అంతం ఎల్లప్పుడూ మంచిదిగానే ఉంటుంది. కానీ దుర్మార్గులకు వారు కోరింది లభించినప్పుడు, చివరికి అది చిక్కుగానే ఉంటుంది.
24 ఒక మనిషి ధారాళంగా ఇస్తే, అప్పుడు అతనికి అంతకంటే ఎక్కువ లభిస్తుంది. కాని ఒకడు ఇచ్చేందుకు నిరాకరిస్తే, అప్పుడు అతడు దరిద్రుడు అవుతాడు.
25 ధారాళంగా ఇచ్చే మనిషి లాభం పోందుతాడు. నీవు యితరులకు సహాయం చేస్తే, అప్పుడు నీకు ఇంకా ఎక్కువ లాభం వస్తుంది.*
26 తన ధాన్యం అమ్మేందుకు నిరాకరించే దురాశగల మనిషి మీద ప్రజలు కోపగిస్తారు. అయితే ఇతరులకు ఆహారం పెట్టేందుకు తన ధాన్యం అమ్మేవాని విషయంలో ప్రజలు సంతోషిస్తారు.
27 మంచిని చేయుటకు ప్రయత్నించే మనిషిని ప్రజలు గౌరవిస్తారు. కాని దుర్మార్గం చేసే మనిషికి కష్టం మాత్రమే వస్తుంది.
28 తన ఐశ్వర్యాలను నమ్ముకొనే మనిషి పడిపోతాడు.కాని, మంచి మనిషి పచ్చటి చిగురాకులా పెరుగుతాడు.
29 ఒక మనిషి గనుక తన కుటుంబానికి కష్టం కలిగిస్తే అతనికి లాభం ఏమీ కలుగదు. చివరికి బుద్ధిహీనుడు జ్ఞానముగల మనిషికి సేవ చేయుటకు బలవంతం చేయబడతాడు.
30 మంచి మనిషి చేసే విషయాలు జీవవృక్షంలా ఉంటాయి. ఒక జ్ఞానముగల మనిషి ప్రజలకు కొత్త జీవితం ఇస్తాడు.
31 మంచి మనుష్యులకు భూమి మీద ప్రతిఫలం ఇవ్వబడితే, నిశ్చయంగా దుర్మార్గులు, పాపులు వారికి తగిన దానిని పోందుతారు.
* 11:25 ధారాళంగా … వస్తుంది హెబ్రీ భాషలో “నీళ్లు పొయువానికి నీళ్లు పొయబడును.”