113
1 యెహోవాను స్తుతించండి!  
యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి!  
యెహోవా నామాన్ని స్తుతించండి.   
2 ఇప్పుడు, ఎల్లప్పుడూ, యెహోవా నామము స్తుతించబడాలని నేను కోరుతున్నాను.   
3 తూర్పున ఉదయించే సూర్యుడి దగ్గర్నుండి,  
సూర్యుడు అస్తమించే స్థలం వరుకు యెహోవా నామం స్తుతించబడాలని నేను కోరుతున్నాను.   
4 యెహోవా జనాలన్నింటికంటె ఉన్నతమైనవాడు.  
ఆయన మహిమ ఆకాశాలంత ఉన్నతం.   
5 ఏ మనిషి మన యెహోవా దేవునిలా ఉండడు.  
దేవుడు పరలోకంలో ఉన్నతంగా కూర్చుంటాడు.   
6 ఆకాశాలను, భూమిని దేవుడు చూడాలంటే  
ఆయన తప్పక కిందికి చూడాలి.   
7 దేవుడు పేదవారిని దుమ్ములో నుండి పైకి లేపుతాడు.  
భిక్షగాళ్లను చెత్తకుండీలో నుండి బయటకు తీస్తాడు.   
8 ఆ మనుష్యులను దేవుడు ప్రముఖులుగా చేస్తాడు.  
ఆ మనుష్యులను దేవుడు ప్రముఖ నాయకులుగా చేస్తాడు.   
9 ఒక స్త్రీకి పిల్లలు లేకపోవచ్చును.  
కానీ దేవుడు ఆమెకు పిల్లలను ఇచ్చి ఆమెను సంతోషపరుస్తాడు.  
   
 
యెహోవాను స్తుతించండి!