31
సంగీత నాయకునికి. దావీదు కీర్తన.
యెహోవా, నీవే నా కాపుదల.
నన్ను నిరాశపరచవద్దు.
నా మీద దయ ఉంచి, నన్ను రక్షించుము.
దేవా నా మాట ఆలకించుము.
వేగంగా వచ్చి నన్ను రక్షించి
నా బండగా ఉండుము. నా క్షేమస్థానంగా ఉండుము.
నా కోటగా ఉండుము. నన్ను కాపాడుము.
దేవా, నీవే నా బండవు, కోటవు
కనుక నీ నామ ఘనత కోసం నన్ను నడిపించుము, నాకు దారి చూపించుము.
నా శత్రువులు నా ఎదుట ఉచ్చు ఉంచారు.
వారి ఉచ్చు (వల) నుండి నన్ను రక్షించుము. నీవే నా క్షేమస్థానం.
యెహోవా, నీవే మేము నమ్ముకోదగిన దేవుడవు.
నా జీవితం నేను నీ చేతుల్లో పెడ్తున్నాను.
నన్ను రక్షించుము.
వ్యర్థమైన విగ్రహాలను పూజించే వాళ్లంటే నాకు అసహ్యం.
యెహోవాను మాత్రమే నేను నమ్ముకొన్నాను.
దేవా, నీ దయ నన్ను ఎంతో సంతోషపెడ్తుంది.
నా కష్టాలు నీవు చూశావు.
నాకు ఉన్న కష్టాలను గూర్చి నీకు తెలుసు.
నీవు నన్ను నా శత్రువులకు అప్పగించవు.
వారి ఉచ్చుల నుండి నీవు నన్ను విడిపిస్తావు.
యెహోవా, నాకు చాలా కష్టాలున్నాయి. కనుక నా మీద దయ ఉచుము.
నేను ఎంతో తల్లడిల్లి పోయాను కనుక నా కళ్లు బాధగా ఉన్నాయి.
నా గొంతు, కడుపు నొప్పెడుతున్నాయి.
10 నా జీవితం దుఃఖంతో ముగిసిపోతూవుంది.
నిట్టూర్పులతో నా సంవత్సరాలు గతించిపోతున్నాయి.
నా కష్టాలు నా బలాన్ని తొలగించి వేస్తున్నయి.
నా బలం తొలగిపోతుంది.*
11 నా శత్రువులు నన్ను ద్వేషిస్తారు.
నా పొరుగు వాళ్లంతా నన్ను కూడా ద్వేషిస్తారు.
నా బంధువులంతా వీధిలో నన్ను చూచి భయపడతారు.
వారు నానుండి దూరంగా ఉంటారు.
12 నేను ఏదో పోయిన పనిముట్టులా ఉన్నాను.
నేను చనిపోయానేమో అన్నట్టు ప్రజలు నన్ను పూర్తిగా మరచిపోయారు.
13 ప్రజలు నన్ను గూర్చి చెప్పే దారుణ విషయాలు నేను వింటున్నాను.
ప్రజలు నాకు విరోధంగా తిరిగారు. వాళ్లు నన్ను చంపాలని తలుస్తున్నారు.
 
14 యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను.
నీవే నా దేవుడవు.
15 నా ప్రాణం నీ చేతుల్లో ఉంది.
నా శత్రువుల నుండి నన్ను రక్షించుము. నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
16 దేవా, నీ సేవకునికి దయతో స్వాగతం పలుకుము.
నన్ను రక్షించుము.
17 యెహోవా, నేను నిన్ను ప్రార్థించాను.
కనుక నేను నిరాశచెందను.
చెడ్డవాళ్లు నిరాశ చెందుతారు,
మౌనంగా వారు సమాధికి వెళ్తారు.
18 ఆ చెడ్డవాళ్లు గర్వించి,
మంచి వాళ్లను గూర్చి అబద్ధాలు చెబతారు.
ఆ చెడ్డవాళ్లు చాలా గర్విష్ఠులు.
కాని అబద్ధాలు చెప్పే వారి పెదవులు నిశ్శబ్దం అవుతాయి.
 
19 దేవా, ఆశ్చర్యకరమైన అనేక సంగతులను నీవు నీ అనుచరులకు మరుగు చేశావు.
నిన్ను నమ్ముకొనే వారికోసం నీవు ప్రతి ఒక్కరి ఎదుట మంచి కార్యాలు చేస్తావు.
20 మంచివాళ్లకు హాని చేయటానికి చెడ్డవాళ్లు ఒకటిగా గుమికూడుతారు.
ఆ చెడ్డవాళ్లు కలహాలు రేపటానికి చూస్తారు.
కానీ ఆ మంచివాళ్లను నీవు దాచిపెట్టి కాపాడతావు. మంచివాళ్లను నీవు నీ ఆశ్రయంలో కాపాడుతావు.
21 యెహోవాను స్తుతించండి. పట్టణం శత్రువుల చేత ముట్టడి వేయబడినప్పుడు ఆయన తన అద్భుత ప్రేమను నాకు చూపించాడు.
ఈ క్షేమస్థానంలో ఆయన తన ప్రేమను నాకు చూపించాడు.
22 నేను భయపడి, “దేవుడు చూడగలిగిన స్థలంలో నేను లేను” అన్నాను.
కానీ దేవా, నేను నిన్ను ప్రార్థించాను. మరియు సహాయం కోసం నేను గట్టిగా చేసిన ప్రార్థనలు నీవు విన్నావు.
 
23 దేవుని వెంబడించు వారలారా, మీరు యెహోవాను ప్రేమించాలి.
యెహోవాకు నమ్మకంగా ఉండే ప్రజలను ఆయన కాపాడుతాడు.
కానీ తమ శక్తిని బట్టి గొప్పలు చెప్పే గర్విష్ఠులను యెహోవా శిక్షిస్తాడు.
24 యెహోవా సహాయం కొరకు నిరీక్షించే వారలారా గట్టిగా, ధైర్యంగా ఉండండి.
 
* 31:10 నా … తొలగిపోతుంది అక్షరాలా ఎముకలు క్షీణిస్తున్నాయి.