99
1 యెహోవాయే రాజు.  
కనుక రాజ్యాలు భయంతో వణకాలి.  
కెరూబు దూతలకు పైగా దేవుడు రాజుగా కూర్చున్నాడు.  
అందుచేత ప్రపంచం భయంతో కదలిపోతుంది.   
2 సీయోనులో యెహోవా గొప్పవాడు.  
ప్రజలందరి మీద ఆయన గొప్ప నాయకుడు.   
3 ప్రజలంతా నీ నామాన్ని స్తుతించెదరుగాక.  
దేవుని నామం భీకరం. దేవుడు పరిశుద్ధుడు.   
4 శక్తిగల రాజు న్యాయాన్ని ప్రేమిస్తాడు.  
దేవా నీతిని నీవు చేశావు.  
యాకోబుకు (ఇశ్రాయేలు) నీతి న్యాయాలను నీవే జరిగించావు.   
5 మన దేవుడైన యెహోవాను స్తుతించండి.  
ఆయన పవిత్ర పాదపీఠాన్ని ఆరాధించండి.   
6 మోషే, అహరోనులు దేవుని యాజకులలో కొందరు,  
మరియు దేవుని ఆరాధకులలో సమూయేలు ఒకడు.  
వారు యెహోవాను ప్రార్థించారు.  
దేవుడు వారికి జవాబు యిచ్చాడు.   
7 ఎత్తయిన మేఘం నుండి దేవుడు మాట్లాడాడు.  
వారు ఆయన ఆదేశాలకు విధేయులయ్యారు.  
దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు.   
8 మా దేవా, యెహోవా, నీవు వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చావు.  
నీవు క్షమించే దేవుడవని, చెడు కార్యాలు చేసినందుకు  
ప్రజలను నీవు శిక్షిస్తావని వారికి చూపించావు.   
9 మన దేవుడైన యెహోవాను స్తుతించండి.  
ఆయన పవిత్ర పర్వతంవైపు సాగిలపడి ఆయనను ఆరాధించండి.  
మన దేవుడైన యెహోవా నిజంగా పరిశుద్ధుడు.