4
సమూయేలును గురించిన వార్త ఇశ్రాయేలు దేశమంతా వ్యాపించింది. ఏలీ పండుముసలి వాడయ్యాడు. ఏలీ కుమారులు యెహోవా ఎదుట దుష్ట కార్యాలు చేస్తూనే ఉన్నారు.
ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలను ఓడించుట
అదే సమయంలో ఫిలిష్తీయులంతా ఏకమై ఇశ్రాయేలు మీదికి యుద్ధానికి దిగారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈ దాడిని ఎదుర్కోవటానికి కదలి వెళ్లి ఎబెనెజరు అనే చోట కాచుకొని యుండిరి. ఆఫెకు అనే చోట ఫిలిష్తీయులు బసచేశారు. ఫిలిష్తీయులు దాడికి బారులుతీరి నిలువగా యుద్ధం మొదలయింది.
యుద్ధంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలను ఓడించి ఇశ్రాయేలు సైన్యంలో సుమారు నాలుగు వేలమంది సైనికులను చంపివేశారు. ఇశ్రాయేలు సైన్యం తమ స్థలాలకు వచ్చారు. వారి నాయకులు, “యెహోవా ఎందువల్ల తమకు ఫిలిష్తీయుల చేతుల్లో ఓటమి కలిగించాడని ఆలోచించారు. వారు తమ యెహోవా ఒడంబడిక పెట్టెను షిలోహునుండి తీసుకుని రావాలని నిర్ణయించారు. ఈ విధంగా యెహోవా మనతో యుద్ధ భూమికి వస్తాడు. ఆయన మన శత్రువు లబారినుండి మనల్ని రక్షిస్తాడు” అని అనుకొన్నారు.
ఆ విధంగా అనుకొని షిలోహుకు మనుష్యులను పంపారు. వారు సర్వశక్తిమంతుడైన యెహోవా ఒడంబడిక పెట్టెను తీసుకుని వచ్చారు. పెట్టెపైన కెరూబులు ఉన్నారు. మరియు యెహోవా కూర్చొనే సింహాసనంలా వారు ఉన్నారు. ఏలీ కుమారులు హొఫ్నీ మరియు ఫీనెహాసు ఆ పెట్టెతో వున్నారు.
యెహోవా ఒడంబడిక పెట్టె యుద్ధస్థలంలోనికి రాగానే ఇశ్రాయేలు సేనలు పొంగివచ్చే సంతోషంతో భూమి అదిరేలా కేరింతలు పెట్టారు. ఫిలిష్తీయులు ఈ కేకలు విని, “హెబ్రీయుల స్థలములో ఎందుకీ కలకలం?” అని అనుకోసాగారు.
అప్పుడు వారు యెహోవా పవిత్రపెట్టె హెబ్రీయుల శిబిరములోకి వచ్చినదని కనుగొన్నారు. ఫిలిష్తీయులు భీతి చెందారు. “హెబ్రీ శిబిరములోకి దేవుడు వచ్చాడు. మనకు సంకట కాలం వచ్చింది. ఇలా ఇదివరకెన్నడూ జరుగలేదు! మనం వ్యాకుల పాటు చెందియున్నాము. ఆ మహా దేవుని నుండి మనలను రక్షించేవారెవరు? ఈజిప్టువాళ్లను గతంలో అనేక రోగాలకు, దారుణ శిక్షలకు గురిచేసి వారిని అష్టకష్టాలపాలు చేసినవాడు ఈ దేవుడే. అయినను ఫిలిష్తీయుసోదరులారా, ధైర్యంగా ఉండండి. లెండి. వీరకిశోరాలై పోరాడండి! గతంలో హెబ్రీయులు మన బానిసలు. కాబట్టి వీరాధివీరులై పోరాడండి. లేదా మీరు హెబ్రీయులకు బానిసలై పోయే ప్రమాదం వుంది” అంటూ ఫిలిష్తీయుల నాయకులు సైనికులను ఉత్తేజపరిచారు.
10 ఫిలిష్తీయులు వీరోచితంగా పోరాడి ఇశ్రాయేలు సైన్యాన్ని ఓడించారు. ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కడూ తన గుడారానికి పారిపోయాడు. ఇది వారికి ఘోర పరాజయం. ముప్పది వేలమంది ఇశ్రాయేలు సైనికులు చనిపోయారు. 11 దేవుని పవిత్ర పెట్టెను ఫిలిష్తీయులు పట్టుకుపోయారు. ఏలీ యొక్క ఇద్దరు కుమారులు హొఫ్నీ మరియు ఫీనెహాసు చనిపోయారు.
12 అదేరోజు బెన్యామీను వాడొకడు యుద్ధ భూమినుండి పారిపోయాడు. సంభవించిన ఈ గొప్ప విషాదానికి సూచనగా తన బట్టలు చించుకొని, నెత్తిన దుమ్ము చల్లుకొని షిలోహుకు వెళ్లాడు. 13 ఈ బెన్యామీనీయుడు షిలోహు వెళ్లేసరికి ఏలీ నగర ద్వారం దగ్గర ఒక ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. దేవుని పవిత్ర పెట్టె విషయంలో అతను కొంత గాభరాగా వున్నాడు. అందువల్ల అతనక్కడ కూర్చుని ఎదురు చూస్తూ ఉన్నాడు. బెన్నామీనీయుడు పట్టణంలోనికి వెళ్లి ఈ దుర్వార్తను వెల్లడిచేసాడు. షిలోహు పట్టణమంతా ఒక్కతీరున గగ్గోలుపడి ఏడ్చింది. 14-15 ఏలీ 98 ఏండ్లు వయస్సుగల గుడ్డివానిగా ఉన్నాడు. కనుక అతడు ఏమీ చూడలేక పోయాడు. కాని, ఏడ్పుల ధ్వని ఏలీ విన్నాడు. “ఏమిటీ గొప్ప ఏడ్పుల ధ్వని?” అని ఏలీ అడిగాడు.
బెన్యామీనీయుడు ఏలీ దగ్గరకు పరుగెత్తుకు వెళ్లి, జరిగినది అతనితో చెప్పాడు. 16 బెన్యామీనీయుడు తాను ఆ రోజు యుద్ధంనుండి పారిపోయి వచ్చినట్లు చెప్పాడు.
“ఏమి జరిగిందో చెప్పు” అన్నాడు ఏలీ.
17 ఈ వార్త తెచ్చిన బెన్యామీనీయుడు ఏలీతో ఇలా చెప్పాడు: “ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలీయులు చిత్తుగా ఓడిపోయారు. వారిలో అనేకమంది సైనికులు చనిపోయారు. నీ ఇరువురు కుమారులూ చనిపోయారు. దేవుని పవిత్ర పెట్టెను ఫిలిష్తీయులు తీసుకునిపోయారు.”
18 ఏలీ వృద్ధుడు, స్థూలకాయుడు. బెన్యామీనీయుడు దేవుని పవిత్ర పెట్టెనుగూర్చి చెప్పగానే ఏలీ, ద్వారం దగ్గర ఉన్న తన ఆసనంనుండి వెనుకకుపడి, మెడవిరిగి, చనిపోయాడు. ఇశ్రాయేలీయులను 20 సంవత్సరాల* పాటు ఏలీ నడిపించాడు.
మహిమ తొలగిపోయింది
19 ఏలీ కోడలు (ఫీనెహాసు భార్య) గర్భవతి. నెలలు బాగా నిండాయి. దేవుని పవిత్ర పెట్టె శత్రువుల చేత పడటం, తన మామ ఏలీ మరణం, తన భర్త ఫీనెహాసు మరణవార్తలు వినగానే ఆమెకు తీవ్రంగా పురుటినొప్పులు వచ్చాయి. ఆమె వంగిపోయి ప్రసవించేసింది. 20 ఆమె చావు ఘడియల్లో ఉండగా, “చింతపడకు, నీకు కొడుకు పుట్టాడు” అంటూ అక్కడ ఉన్న స్త్రీలు ఆమెను ఓదార్చారు.
కానీ ఆమె ఏమీ పట్టించుకోకుండానే, “ఇశ్రాయేలు నుండి మహిమ తొలగిపోయింది!” అంటూ తన కుమారునికి ఈకాబోదు అని పేరు పెట్టింది. 21 తన కుమారునికి ఈకాబోదు అని పేరు పెట్టటానికి కారణం ఏమంటే, దేవుని పవిత్ర పెట్టె పరుల హస్తగతమయ్యింది; దానికి తోడు తన మామ, భర్త ఇద్దరూ చనిపోయారు. 22 ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెట్టెను తీసుకొని పోయారు గనుకనే “ఇశ్రాయేలు నుండి మహిమ తొలగిపోయింది” అని ఆమె వాపోయింది.
* 4:18 20 సంవత్సరాలు అని గ్రీకు భాషలో రాయబడింది. మరియు యోసేఫను చరిత్రలో రాయబడింది. హెబ్రీ ప్రామాణిక గ్రంథంలో 40 సంవత్సరాలు అని రాయబడింది. 4:20 ఈకాబోదు మహిమలేదు అని అర్థం.