8
నాలుగవ హింసాకాండ. సౌలు ఆధ్వర్యంలో
1 ఆ రోజు నుండి యెరూషలేములోని సంఘానికి తీవ్రమైన హింస మొదలైంది.
2 కాబట్టి, అపొస్తలులు తప్ప అందరూ యూదయ, సమరయ ప్రాంతాల్లోకి చెదరి పోయారు. భక్తిపరులైన మనుషులు స్తెఫనును సమాధి చేసి అతని గూర్చి చాలా దుఖించారు.
3 అయితే సౌలు ప్రతి ఇంట్లోకి చొరబడి, స్త్రీ పురుషులను ఈడ్చుకుపోయి, చెరసాలలో వేస్తూ సంఘాన్ని పాడు చేస్తున్నాడు.
మొట్టమొదటి సువార్త ప్రచారకులు
4 అయినా, చెదరిపోయిన వారు సువార్త ప్రకటిస్తూ వెళుతున్నారు.
ఫిలిప్పు పరిచర్య
5 ఫిలిప్పు సమరయ ఊరికి వెళ్ళి వారికి క్రీస్తును ప్రకటించాడు.
6 జనసమూహాలు ఫిలిప్పు చేసిన సూచక క్రియలు చూసి అతడు చెప్పిన మాటల మీద ధ్యాస పెట్టారు.
7 చాలా మందికి పట్టిన దురాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదలిపోయాయి. చాలామంది పక్షవాతం వచ్చినవారూ, కుంటివారూ బాగుపడ్డారు.
8 అందుకు ఆ పట్టణంలో చాలా ఆనందం కలిగింది.
మంత్రగాడు సీమోను వ్యవహారం
9 సీమోను అనే ఒకడు అంతకు ముందు అక్కడ మంత్రవిద్య చేస్తూ, తానొక గొప్పవాడినని చెప్పుకొంటూ, సమరయ ప్రజలను మంత్రముగ్ధులను చేసేవాడు.
10 అల్పులు మొదలుకుని అధికుల వరకూ అందరూ, ‘దేవుని మహాశక్తి అంటే ఇతడే’ అని చెప్పుకొంటూ అతని మాటలు శ్రద్ధగా వినేవారు.
11 అతడు చాలాకాలం పాటు మంత్రవిద్యలు చేస్తూ వారిని ఆశ్చర్యపరచడం చేత వారతని మాట వినేవారు.
12 అయితే ఫిలిప్పు దేవుని రాజ్యం గురించీ యేసు క్రీస్తు నామం గురించీ సువార్త ప్రకటిస్తూ ఉంటే, స్త్రీ పురుషులు నమ్మి బాప్తిసం పొందారు.
13 అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పుతో ఉంటూ, అతని ద్వారా సూచకక్రియలూ గొప్ప అద్భుతాలూ జరగడం చూసి ఆశ్చర్యపడ్డాడు.
14 సమరయ వారు దేవుని వాక్కు అంగీకరించారని విని, యెరూషలేములోని అపొస్తలులు పేతురు యోహానులను వారి దగ్గరికి పంపారు.
15 వారు వచ్చి సమరయ విశ్వాసులు పరిశుద్ధాత్మ పొందేలా వారికోసం ప్రార్థన చేశారు.
16 అంతకు ముందు వారిలో ఎవరి మీదా పరిశుద్ధాత్మ దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామంలో బాప్తిసం మాత్రం పొందారు.
17 అప్పుడు పేతురు, యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు.
18 అపొస్తలులు చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మ వారి పైకి దిగడం చూసి, సీమోను,
19 వారికి డబ్బులివ్వ జూపి “నేనెవరి మీద చేతులుంచుతానో వాడు పరిశుద్ధాత్మ పొందేలా ఈ అధికారం నాకివ్వండి” అని అడిగాడు.
20 అందుకు పేతురు, “నీవు ధనమిచ్చి దేవుని వరాన్ని పొందాలనుకున్నావు కాబట్టి నీ వెండి నీతో పాటు నశిస్తుంది గాక.
21 నీ హృదయం దేవునితో సరిగా లేదు కాబట్టి ఈ పనిలో నీకు భాగం లేదు.
22 నీ దుర్మార్గానికి పశ్చాత్తాపపడి ప్రభువును వేడుకో. ఒకవేళ నీ చెడు కోరిక విషయంలో ప్రభువు నిన్ను క్షమించవచ్చు.
23 నువ్వు ఘోర దుష్టత్వపు బంధకాల్లో ఉన్నావు. నీ నిలువెల్లా చేదు విషమే నాకు కనిపిస్తున్నది.” అని చెప్పాడు.
24 అప్పుడు సీమోను “మీరు చెప్పిన వాటిలో ఏదీ నా మీదికి రాకుండా మీరు నా కోసం ప్రభువుకు ప్రార్ధించండి” అని జవాబిచ్చాడు.
25 ఆ తరువాత వారు సాక్షమిచ్చి ప్రభువు వాక్కు బోధించి యెరూషలేము తిరిగి వెళ్తూ, సమరయ ప్రజల గ్రామాల్లో సువార్త ప్రకటిస్తూ వెళ్ళారు.
ఇథియోపియా కోశాధికారితో ఫిలిప్పు
26 ప్రభువు దూత ఫిలిప్పుతో “నీవు లేచి, దక్షిణ దిశగా వెళ్ళి, యెరూషలేము నుండి గాజా పోయే అరణ్య మార్గంలో వెళ్ళు” అని చెప్పగానే అతడు లేచి వెళ్ళాడు.
27 అప్పుడు ఇథియోపియా రాణి కందాకే దగ్గర ముఖ్య అధికారిగా ఉంటూ ఆమె ఖజానా అంతటినీ నిర్వహిస్తున్న ఇథియోపియా నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేము వచ్చాడు.
28 అతడు తిరిగి వెళ్తూ, తన రథం మీద కూర్చుని యెషయా ప్రవక్త గ్రంథం చదువుతున్నాడు.
29 ఆత్మ ఫిలిప్పుతో “నీవు ఆ రథం దగ్గరికి వెళ్ళి దాన్ని కలుసుకో” అని చెప్పాడు.
30 ఫిలిప్పు పరుగెత్తుకుంటూ వెళ్ళి అతడు ప్రవక్తయైన యెషయా గ్రంథం చదువుతుంటే విని, “మీరు చదివేది మీకు అర్థమవుతుందా?” అని అడిగాడు.
31 అతడు, “నాకెవరైనా వివరించకపోతే ఎలా అర్థమవుతుంది” అని చెప్పి, రథమెక్కి తన దగ్గర కూర్చోమని ఫిలిప్పును బతిమాలాడు.
32 ఇతియోపీయుడు చదివే లేఖనభాగం ఏదంటే,
ఆయనను గొర్రెలా వధకు తెచ్చారు.
బొచ్చు కత్తిరించే వాడి దగ్గర
గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టే,
ఆయన నోరు తెరవలేదు.
33 ఆయన దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయం దొరకలేదు.
ఆయన సంతతి గురించి ఎవరు వివరిస్తారు?
ఎందుకంటే ఆయన ప్రాణాన్ని లోకం నుండి తీసేసారు.
34 అప్పుడు ఆ నపుంసకుడు, “ప్రవక్త చెప్పేది ఎవరి గురించి? తన గురించా లేక వేరొక వ్యక్తిని గురించా? దయచేసి చెప్పు” అని ఫిలిప్పును అడిగాడు.
35 ఫిలిప్పు ఆ లేఖనంతో మొదలుపెట్టి యేసును గూర్చిన సువార్తను అతనికి బోధించాడు.
36 వారు దారిలో వెళ్తూ ఉండగానే కొద్దిగా నీళ్ళున్న ఒక చోటికి వచ్చారు. నపుంసకుడు “ఇక్కడ నీళ్ళున్నాయి! నాకు బాప్తిసమివ్వడానికి ఆటంకమేమిటి?” అని అడిగి రథాన్ని ఆపమని ఆజ్ఞాపించాడు.
37 ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరూ నీటిలోకి దిగారు.
38 అప్పుడు ఫిలిప్పు అతనికి బాప్తిసమిచ్చాడు.
39 వారు నీళ్లలో నుండి బయటికి వచ్చినపుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును తీసుకుపోయాడు. నపుంసకుడు ఆనందిస్తూ తన దారిన వెళ్ళిపోయాడు. అతడు ఫిలిప్పును ఇంకెప్పుడూ చూడలేదు.
40 అయితే ఫిలిప్పు అజోతు అనే ఊళ్ళో కనిపించాడు. అతడు ఆ ప్రాంతం గుండా వెళ్తూ కైసరయ వరకూ అన్ని ఊళ్లలో సువార్త ప్రకటించాడు.