19
శరణు పట్టణాలు
1 “మీ యెహోవా దేవుడు ఎవరి దేశాన్ని మీకిస్తున్నాడో ఆ ప్రజలను యెహోవా దేవుడు నాశనం చేసిన తరువాత మీరు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుని, వారి పట్టణాల్లో వారి ఇళ్ళల్లో నివసించాలి.
2 మీరు స్వాధీనం చేసుకొనేలా యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మూడు పట్టణాలను వేరు పరచాలి.
3 మీరు స్వాధీనం చేసుకొనేలా యెహోవా దేవుడు మీకిస్తున్న దేశపు సరిహద్దుల్లో హంతకుడు పారిపోయి తల దాచుకోవడానికి మూడు పట్టణాలకు వెళ్ళే దారులను కొలిచి ఏర్పరచాలి.
4 హంతకుడు పారిపోయి బతకడానికి నియమించిన పద్ధతి ఏమిటంటే, ఒకడు అంతకు ముందు తన పక్కనున్న వాడి మీద పగ ఏమీ లేకుండా
5 పొరపాటున వాణ్ణి చంపితే, అంటే ఒకడు చెట్లు నరకడానికి వేరొక వ్యక్తితో అడవికి వెళ్ళి చెట్లు నరకడానికి తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు, గొడ్డలి పిడి ఊడి ఆ వ్యక్తికి తగిలి, వాడు చనిపోతే ఆ హంతకుడు ప్రాణం నిలుపుకునేందుకు వీటిలో ఎదో ఒక పట్టణానికి పారిపోవాలి.
6 చనిపోయిన వాడి బంధువు కోపంతో హంతకుణ్ణి తరిమి, దారి చాలా దూరం గనక వాణ్ణి పట్టుకుని చంపకుండేలా వాడు ఇలా చెయ్యాలి. అతనికి ఆ వ్యక్తిపై గతంలో ఎలాంటి పగ లేదు కనుక అతడు మరణశిక్షకు పాత్రుడు కాక పోయినా ఇలా జరగవచ్చు.
7 అందుచేత మూడు పట్టణాలను మీ కోసం ఏర్పరచుకోవాలని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను.
8 యెహోవా దేవుడు మీ పూర్వీకులతో ప్రమాణం చేసినట్టు ఆయన మీ సరిహద్దులను విశాలపరచి, మీ పూర్వీకులకు ఇస్తానని చెప్పిన దేశాన్నంతా మీకిచ్చినప్పుడు మీరు యెహోవా దేవుణ్ణి గౌరవించాలి.
9 ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించినట్టు ఎప్పుడూ ఆయన మార్గాల్లో నడవడానికి ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఈ మూడు పట్టణాలు కాక మరో మూడు పట్టణాలను ఏర్పాటు చేసుకోవాలి.
10 ఎవరినైనా హత్య చేశామన్న నేరారోపణ మీ మీదికి రాకుండా ఉండేందుకు యెహోవా దేవుడు మీకు వారసత్వంగా ఇస్తున్న మీ దేశంలో నిర్దోషిని హత్య చేయకూడదు.
11 ఒకడు తన పొరుగువాడి మీద పగ పట్టి, అతని కోసం కాపు కాసి అతని మీద పడి వాడు చనిపోయేలా కొట్టి
12 ఆ పట్టణాల్లో ఒక దానిలోకి పారిపోతే, ఆ ఊరిపెద్దలు మనుషులను పంపి అక్కడనుంచి వాణ్ణి రప్పించాలి. హత్య విషయం ప్రతీకారం చేసేవాడి చేతికి అతన్ని అప్పగించి చంపించాలి.
13 అతడిపై కనికరం చూపించకూడదు. మీకు మేలు కలిగేలా ఇశ్రాయేలు ప్రజల మధ్యనుంచి నిర్దోషి ప్రాణం విషయంలో దోషాన్ని పరిహరించాలి.
14 మీరు స్వాధీనం చేసుకొనేలా యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మీకు వచ్చే మీ వారసత్వంలో పూర్వీకులు నియమించిన మీ పొరుగువాడి సరిహద్దు రాయిని తొలగించ కూడదు.
సాక్ష్యాలు
15 ఒకడు జరిగించే పాపం, అపరాధం విషయంలో దాన్ని నిర్ధారించడానికి కేవలం ఒక్క వ్యక్తి సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోకూడదు. ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తుల సాక్ష్యం మీద ప్రతి దానినీ నిర్థారణ చేయాలి.
16 ఒక వ్యక్తిపై అబద్ద నేరం మోపి, అన్యాయ సాక్ష్యం చెబుతున్నట్టు అనిపిస్తే
17 ఆ వివాదం ఏర్పడిన ఇద్దరూ యెహోవా ఎదుట, అంటే అప్పుడు విధుల్లో ఉన్న యాజకుల ఎదుట, న్యాయాధిపతుల ఎదుట నిలబడాలి.
18 ఆ న్యాయాధిపతులు బాగా పరీక్షించిన తరువాత వాడి సాక్ష్యం అబద్ధసాక్ష్యమై తన సోదరుని మీద వాడు అబద్ధసాక్ష్యం చెప్పిన సంగతి వెల్లడైతే వాడు తన సోదరునికి చేయాలని కోరినది వాడి పట్ల జరిగించాలి.
19 ఆ విధంగా మీ మధ్యనుంచి చెడుతనాన్ని తొలగిస్తారు.
20 ఇది తెలుసుకున్న మిగిలినవారు భయం వల్ల మీ దేశంలో అలాంటి దుర్మార్గపు పనులు జరిగించరు.
21 దుష్ట కార్యాలు జరిగించే ఎవరిపైనా కనికరం చూపకూడదు. అలాంటివారి విషయంలో ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు నియమం పాటించాలి.”