41
మందిరం, దాని గోడలు
1 తరువాత అతడు నన్ను మందిరానికి తీసుకుని వచ్చి దాని పరిశుద్ధ స్థలం ప్రవేశానికి రెండు పక్కల ఉన్న స్తంభాలను కొలిచాడు. అవి ఒక్కొక్కటీ 3 మీటర్ల 20 సెంటి మీటర్లు.
2 ప్రవేశ ద్వారం వెడల్పు 5 మీటర్ల 40 సెంటి మీటర్లు. తలుపు రెండు వైపులా 2 మీటర్ల 70 సెంటి మీటర్లు, దాని పొడవు 22 మీటర్లు, వెడల్పు 11 మీటర్లు.
3 అతడు లోపలికి పోయి వాకిలి స్తంభాలను కొలిచినప్పుడు అది ఒక్కొక్కటి ఒక మీటరు వెడల్పు ఉన్నాయి. వాకిలి 3 మీటర్ల 20 సెంటి మీటర్లు, రెండు వైపులా ఉన్న గోడల వెడల్పు 3 మీటర్ల 80 సెంటి మీటర్లు ఉన్నాయి.
4 అతడు “ఇది అతి పరిశుద్ధస్థలం” అని చెప్పి దాన్ని కొలిచాడు. దాని పొడవు 11 మీటర్లు, వెడల్పు 11 మీటర్లు.
5 తరువాత అతడు మందిరం గోడను కొలిచినప్పుడు అది, 3 మీటర్ల 20 సెంటి మీటర్లు, మందిరం పక్కన ఉన్న మేడ గదులు ఒక్కొక్కటి సుమారు 2 మీటర్లు వెడల్పు ఉన్నాయి.
6 ఈ మేడగదులు మూడు అంతస్థులు ఉన్నాయి. ఆ విధంగా అవి ఒక్కొక్క అంతస్తుకు 30 గదులు. ఈ గదులు మందిరం గోడ మీద ఆనుకోలేదు. మందిరం చుట్టూ కట్టిన గోడతో కలిసి ఉన్నాయి.
7 ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొద్దీ వాటి వెడల్పు పెరుగుతూ వచ్చింది. అంటే పైకెక్కిన కొద్దీ మందిరం చుట్టూ ఉన్న మేడగదుల అంతస్థుల వెడల్పు పెరుగుతూ వచ్చింది కాబట్టి మందిరపు పైభాగం వెడల్పు కింది భాగం కంటే ఎక్కువగా ఉంది.
8 ఇంకా నేను చూసినప్పుడు మందిరం చుట్టూ మేడ గదులకు ఎత్తుగా ఉన్న పునాది కనిపించింది. ఆ పునాది ఎత్తు 3 మీటర్ల 20 సెంటి మీటర్లు.
9 మేడగదుల బయట ఉన్న గోడ వెడల్పు 2 మీటర్ల 70 సెంటి మీటర్లు. మందిరపు మేడగదుల పక్కన ఖాళీ స్థలం ఉంది.
10 గదుల మధ్య మందిరం చుట్టూ నాలుగు వైపులా 11 మీటర్లు వెడల్పున స్థలం విడిచిపెట్టారు.
11 మేడగదుల గుమ్మాలు ఖాళీగా ఉన్న స్థలం వైపు ఉన్నాయి. ఒక గుమ్మం ఉత్తరపు వైపు, మరొకటి దక్షిణం వైపు ఉన్నాయి. ఖాళీగా ఉన్న స్థలం చుట్టూ 2 మీటర్ల 70 సెంటి మీటర్లు వెడల్పు ఉంది.
12 ఆవరణం ఎదురుగా పడమటి వైపు ఒక కట్టడం ఉంది. దాని వెడల్పు 38 మీటర్లు, దాని గోడ వెడల్పు 2 మీటర్ల 70 సెంటి మీటర్లు, గోడ పొడవు 49 మీటర్లు.
13 మందిరం పొడవును కొలిచినప్పుడు అది 44 మీటర్లు ఉంది. ఆ కట్టడం, దాని గోడల కొలత 54 మీటర్లు.
14 తూర్పు వైపు మందిరం పొడవు 54 మీటర్లు.
15 మందిరం వెనక భాగంలోని ఖాళీ స్థలానికి ఎదురుగా ఒక కట్టడం ఉంది. దాని రెండు వైపులా ఉన్న వసారాల పొడవు 54 మీటర్లు.
16 అప్పుడా వ్యక్తి గర్భాలయం, ఆవరణపు మంటపాలు, గడపలు, కమ్ములు ఉన్న కిటికీలను, మూడు అంతస్థుల చుట్టూ ఉన్న వసారాలను కొలిచాడు. గడపలకెదురుగా నేల నుండి కిటికీలు చెక్కతో కప్పి ఉన్నాయి.
17 గుమ్మాలకు పైన మందిరానికి బయట, లోపల ఉన్న గోడంతా, చుట్టూ గోడ పైనా, కెరూబులు, ఖర్జూరపు చెట్టు చెక్కి ఉన్నాయి.
18 రెండు కెరూబుల మధ్య ఖర్జూరపు చెట్లు ఉన్నాయి. ప్రతి కెరూబుకు రెండేసి ముఖాలున్నాయి.
19 ఇటు ఖర్జూరపు చెట్టు వైపున మనిషి ముఖం, అటు ఖర్జూరపు చెట్టు వైపున సింహం ముఖం ఉన్నాయి. మందిరం అంతా ఆ ప్రకారమే ఉన్నాయి.
20 నేల మొదలుకుని గుమ్మం పైవరకూ మందిరపు గోడకు కెరూబులు, ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి.
21 మందిరపు ద్వారబంధాలు నలు చదరంగా ఉన్నాయి. పరిశుద్ధస్థలపు ద్వారబంధాలు కూడా అలాగే ఉన్నాయి.
22 బలిపీఠం చెక్కతో చేశారు. దాని ఎత్తు 1 మీటరు 60 సెంటి మీటర్లు, పొడవు ఒక మీటరు. దాని పీఠం, మూలలు, పక్కలు చెక్కతో చేసినవి. అతడు నాతో “ఇది యెహోవా సముఖంలో ఉండే బల్ల” అని చెప్పాడు.
23 మందిరానికి, పరిశుద్ధ స్థలానికి రెండు గుమ్మాలున్నాయి.
24 ఒక్కొక గుమ్మం రెండేసి మడత రెక్కలతో ఉంది.
25 అంతే కాక గోడల మీద ఉన్నట్టుగా మందిరపు గుమ్మాల మీద కూడా కెరూబులు, ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి. బయటి వసారాకి విచిత్రంగా చేసిన చెక్క చూరు ఉంది.
26 మరియు వసారాకి, రెండు వైపులా గోడలకు, మేడగదులకు రెండు వైపులా కమ్ములు వేసిన కిటికీలు, ఖర్జూరపు చెట్ల ఆకారాలు చెక్కి ఉన్నాయి.