7
ఎజ్రా యెరూషలేము పట్టణానికి రావడం
1 ఈ విషయాలన్నీ జరిగిన తరువాత పర్షియా దేశపు రాజు అర్తహషస్త పాలనలో ఎజ్రా బబులోను నుండి యెరూషలేము పట్టణానికి వచ్చాడు. ఇతడు శెరాయా కొడుకు. శెరాయా అజర్యా కొడుకు, అజర్యా హిల్కీయా కొడుకు.
2 హిల్కీయా షల్లూము కొడుకు, షల్లూము సాదోకు కొడుకు, సాదోకు అహీటూబు కొడుకు,
3 అహీటూబు అమర్యా కొడుకు, అమర్యా అజర్యా కొడుకు, అజర్యా మెరాయోతు కొడుకు,
4 మెరాయోతు జెరహ్యా కొడుకు, జెరహ్యా ఉజ్జీ కొడుకు, ఉజ్జీ బుక్కీ కొడుకు,
5 బుక్కీ అబీషూవ కొడుకు, అబీషూవ ఫీనెహాసు కొడుకు, ఫీనెహాసు ఎలియాజరు కొడుకు, ఎలియాజరు ప్రధాన యాజకుడు అహరోను కొడుకు.
6 ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే ధర్మశాస్త్రంలో ప్రావీణ్యం ఉన్న లేఖికుడు. దేవుడైన యెహోవా కాపుదల అతనిపై ఉండడం వల్ల అతడు ఏమి కోరినా రాజు అతని మనవులు అంగీకరించాడు.
7 రాజైన అర్తహషస్త పాలన ఏడో సంవత్సరంలో కొందరు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, గాయకులు, ద్వార పాలకులు, దేవాలయ సేవకులు బయలుదేరి యెరూషలేము పట్టణానికి వచ్చారు.
8 రాజు పాలనలో ఏడో సంవత్సరం ఐదో నెలలో ఎజ్రా యెరూషలేము వచ్చాడు.
9 అతడు మొదటి నెల మొదటి రోజున బబులోను దేశం నుండి బయలుదేరి, తన దేవుని కాపుదలతో ఐదో నెల మొదటి రోజుకు యెరూషలేము చేరుకున్నాడు.
10 ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాని ప్రకారం నడుచుకోవాలని, ఇశ్రాయేలీయులకు దాని చట్టాలను, ఆజ్ఞలను నేర్పాలని స్థిరంగా నిశ్చయం చేసుకున్నాడు.
ఎజ్రాకు అర్తహషస్త రాజు పంపిన ఉత్తరం
11 యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞల, చట్టాల విషయంలో లేఖికుడు, యాజకుడు అయిన ఎజ్రాకు అర్తహషస్త రాజు పంపిన ఉత్తరం నకలు.
12 “రాజైన అర్తహషస్త రాస్తున్నది, ఆకాశంలో ఉండే దేవుని ధర్మశాస్త్రంలో ప్రవీణుడు, యాజకుడు అయిన ఎజ్రాకు క్షేమం కలుగు గాక.
13 నీ చేతిలో ఉన్న నీ దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి యూదా, యెరూషలేము పరిస్థితులను తనిఖీ చేయడానికి రాజు, ఏడుగురు మంత్రులు నిన్ను పంపించారు. కాబట్టి మేము ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాం.
14 మా రాజ్యంలో ఉన్న ఇశ్రాయేలీయుల్లోని యాజకులు, లేవీయుల్లో ఎవరైతే యెరూషలేము పట్టణానికి వెళ్ళడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారో వాళ్ళంతా నీతో కలసి వెళ్లవచ్చు.
15 యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు దేవునికి రాజు, అతని మంత్రులు ఇష్టపూర్వకంగా సమర్పించిన వెండి బంగారాలను నీ వెంట తీసుకు వెళ్ళాలి.
16 ఇంకా బబులోను రాజ్యమంతటా నీకు దొరికే వెండి బంగారంతో పాటు ప్రజలు, యాజకులు యెరూషలేములో ఉన్న తమ దేవుని మందిరానికి స్వచ్ఛందంగా సమర్పించే వస్తువులను కూడా నువ్వు తీసుకు వెళ్ళాలి.
17 ఆలస్యం చేయకుండా నువ్వు ఆ సొమ్ముతో ఎద్దులను, పొట్లేళ్లను, గొర్రె పిల్లలను, వాటికి చెందిన నైవేద్యాలను, పానార్పణలను కొనుగోలు చేసి యెరూషలేములో ఉన్న మీ దేవుని మందిరంలో బలిపీఠం మీద వాటిని అర్పించు.
18 మిగిలిన వెండి బంగారాలతో మీ దేవుని చిత్తానుసారం నీకూ, మీవారికీ సముచితంగా అనిపించిన దాన్ని చేయవచ్చు.
19 మీ దేవుని మందిరం సేవ కోసం నీకు ఇచ్చిన వస్తువులన్నిటినీ యెరూషలేములోని దేవుని సన్నిధిలో అప్పగించాలి.
20 మీ దేవుని మందిర విషయంలో మీకు అవసరమైనవి ఇంకా ఏవైనా కావలసివస్తే వాటిని రాజు ధనాగారం నుండి నువ్వు పొందవచ్చు.”
21 అంతే గాక అతడు “రాజునైన అర్తహషస్త అనే నేను స్వయంగా నది అవతల ఖజానా అధికారులైన మీకు ఇచ్చే ఆజ్ఞ ఏమిటంటే, ఆకాశంలో ఉండే దేవుని ధర్మశాస్త్రం లేఖికుడు, యాజకుడు అయిన ఎజ్రా మిమ్మల్ని ఏదైనా అడిగినప్పుడు ఆలస్యం చేయకుండా మీరు వాటిని అతనికి అందజేయండి.
22 మూడున్నర టన్నుల వెండి, వెయ్యి తూముల గోదుమలు రెండు వేల రెండు వందల లీటర్ల ద్రాక్షారసం, మూడు వందల తూముల నూనె, ఇంకా అవసరమైన దాని కంటే మించి ఉప్పు ఇవ్వండి.
23 ఆకాశంలో ఉండే దేవుడు ఏమి నిర్ణయించాడో దానినంతా ఆ దేవుని మందిరానికి జాగ్రత్తగా చేయించండి. రాజ్యం మీదికి, రాజు మీదికి, రాజ కుమారుల మీదికి ఎందుకు దేవుని కోపం రగులుకొనేలా చేసుకోవాలి?
24 యాజకులు, లేవీయులు, గాయకులు, ద్వారపాలకులు, దేవాలయ పరిచారకులు, దేవుని మందిరంలో పనిచేసేవారి విషయంలో మా నిర్ణయం ఏమిటంటే, వారిపై శిస్తు గానీ, సుంకం గానీ, పన్ను గానీ విధించే అధికారం మీకు లేదని గ్రహించండి.
25 ఎజ్రా, నీవు నది అవతలి వైపు ప్రజలకు న్యాయం చేయడానికి నీ దేవుడు నీకు అనుగ్రహించిన జ్ఞానంతో నువ్వు నీ దేవుని ధర్మశాస్త్ర విధులు తెలిసిన వారిలో కొందరిని అధికారులుగా, న్యాయాధిపతులుగా నియమించాలి. ధర్మశాస్త్ర విధులు తెలియని వారికి వాటిని నేర్పించాలి.
26 మీ దేవుని ధర్మశాస్త్రాన్ని, రాజు నియమించిన చట్టాలను గైకొనని వారిపై త్వరగా విచారణ జరిపి, వారికి మరణశిక్షగానీ, దేశ బహిష్కరణగానీ, వారి ఆస్తులను జప్తు చేయడం గానీ, చెరసాల గానీ విధించాలి.”
27 యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి ఘనత కలిగేలా చేయడానికి రాజుకు అలాంటి ఆలోచన పుట్టించినందుకు మన పూర్వీకుల దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగు గాక. రాజు, అతని మంత్రులు, ఆస్థాన అధిపతులు నాపై దయ చూపేలా దేవుడు అనుగ్రహించాడు.
28 నా దేవుడైన యెహోవా కాపుదల నాకు తోడుగా ఉన్నందువల్ల నేను బలపడి, నాతో కలసి పనిచేయడానికి ఇశ్రాయేలీయుల ప్రధానులను సమావేశపరిచాను.