2
ఎస్తేరు రాణిగా ఎంపిక
1 ఈ విషయాలు జరిగి అహష్వేరోషు రాజు కోపం చల్లారిన తరవాత అతడు వష్తిని గురించీ ఆమె చేసిన పని గురించీ ఆలోచించాడు. ఆమెకు వ్యతిరేకంగా తాను చేసిన తీర్పును గురించి కూడా ఆలోచించాడు.
2 రాజు కొలువులో ఉండే యువకులు ఇలా అన్నారు. “రాజు కోసం అందమైన కన్యలను వెదకాలి.
3 లావణ్యవతులైన కన్యలను సమకూర్చడం కోసం రాజు తన పరిపాలన కింద ఉన్న సంస్థానాలన్నిటిలో అధికారులను నియమించాలి. అలా తీసుకు వచ్చిన కన్యలను షూషను రాజభవనంలోని రాణివాసం పర్యవేక్షకుడు హేగే ఆధీనంలో ఉంచాలి. అతడు వారికి సౌందర్య సాధనాలను ఇవ్వాలి.
4 ఆ కన్యల్లో ఎవరు రాజుకు నచ్చుతారో ఆమె వష్తికి బదులుగా రాణి అవుతుంది.” ఈ మాట రాజుకు నచ్చింది. అతడు అ విధంగా చేశాడు.
5 షూషను కోటలో బెన్యామీను గోత్రం వాడైన కీషుకు పుట్టిన షిమీ కొడుకు, యాయీరు వంశికుడు అయిన మొర్దెకై అనే ఒక యూదుడుండేవాడు.
6 బబులోను రాజు నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను బందీగా కొనిపోయినప్పుడు ఇతడు యెకోన్యాతో బాటు యెరూషలేము నుండి చెరకు వచ్చిన వాడు.
7 అతడు తన బాబాయి కూతురు ఎస్తేరు అనే మారు పేరు గల హదస్సా అనే అమ్మాయిని చేరదీసి పెంచుకున్నాడు. ఆమెకు తల్లిదండ్రులు లేరు. ఆమె సౌందర్యవతి. చూడ చక్కని ముఖవర్చస్సు గలది. ఆమె తలిదండ్రులు చనిపోయాక మొర్దెకై ఆమెను తన సొంత కూతురుగా చూసుకోసాగాడు.
8 రాజ శాసనం, ఆజ్ఞ ప్రకటించడం అయిన తరువాత చాలామంది కన్యలను తెచ్చి షూషను కోటలో ఉంచారు. వారినందరినీ హేగే పర్యవేక్షణలో ఉంచారు. ఎస్తేరును కూడా అంతఃపురానికి తెచ్చి స్త్రీల సంరక్షణ చూసుకునే హేగే వశంలో ఉంచారు.
9 ఆ యువతి అంటే అతనికి చాలా ఇష్టం కలిగింది. అందువలన అతడు ఆమె పైన దయ చూపించాడు. అతడు ఆమెకు సౌందర్య సాధనాలను, భోజనపదార్ధాలను ఏర్పరచాడు. రాజుగారి దివాణంలో నుంచి ఏడుగురు ఆడపిల్లలను ఆమెకు చెలికత్తెలుగా ఏర్పాటు చేశాడు. ఆమెను, ఆమె చెలికత్తెలను రాణివాసంలో అతి శ్రేష్ఠమైన స్థలం లో ఉంచాడు.
10 తన బంధువులెవరో తన జాతి ఏమిటో ఆమె ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే అలా తెలపవద్దని మొర్దెకై ఆమెకు ఆజ్ఞాపించాడు.
11 ఎస్తేరు యోగక్షేమాలు కనుక్కోవడానికీ ఆమెకేమి జరుగుతున్నదో తెలుసుకుంటూ ఉండడానికీ మొర్దెకై అంతఃపురం ఆవరణం బయట అనుదినం తిరుగులాడుతూ ఉండేవాడు.
12 ఆరు నెలల పాటు గోపరస తైలంతో, ఆరు నెలల పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో, మొత్తం పన్నెండు నెలలు సౌందర్య పోషణ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి అనేది ఆ స్త్రీలకు నియమించిన విధి. అప్పుడు రాజు దగ్గరికి పోయే వంతు ఒక్కొక్క అమ్మాయికీ వస్తుంది.
13 రాణివాసం నుండి రాజు మందిరానికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు ఒక్కొక్క అమ్మాయికి ఆమె ఏది కోరుకుంటే అది ఇస్తారు.
14 సాయంత్రం వేళ ఆమె లోపలికి వెళ్లి మరునాడు ఉదయం రెండవ రాణివాసానికి తిరిగి వచ్చేది. అదంతా రాజు ఉంపుడుగత్తెల బాగోగులు చూసే షయష్గజు అనే రాజోద్యోగి పర్యవేక్షణలో ఉండేది. రాజుకు ఆమె బాగా నచ్చి అతడు ఆమెను పిలిపించుకుంటే తప్ప ఆమె రాజు దగ్గరికి ఇక వెళ్లకూడదు.
15 మొర్దెకై తన స్వంత కూతురుగా చూసుకుంటున్న అతని బాబాయి అబీహాయిలు కూతురు అయిన ఎస్తేరుకు రాజు దగ్గరికి వెళ్ళడానికి వంతు వచ్చింది. స్త్రీల పర్యవేక్షకుడైన రాజోద్యోగి హేగే నిర్ణయించిన అలంకారం తప్ప ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె అంటే ఇష్టం కలిగింది.
16 ఆ విధంగా అహష్వేరోషు రాజు పరిపాలనలో ఏడో సంవత్సరం టెబేతు అనే పదో నెలలో ఎస్తేరు రాజ మందిరంలో అతని దగ్గరికి పోయింది.
17 స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ఎక్కువగా ప్రేమించాడు. కన్యలందరి కంటే అతనికి ఎస్తేరు అంటే ఇష్టం, ఆకాంక్ష కలిగాయి. అతడు రాజ్యకిరీటాన్ని ఆమె తల మీద ఉంచి ఆమెను వష్తికి బదులుగా రాణిగా నియమించాడు.
18 అప్పుడు రాజు తన అధికారులందరికి, సేవకులందరికి ఎస్తేరు విషయమై గొప్పవిందు చేయించాడు. సంస్థానాలన్నిటిలో సెలవు ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించాడు.
అహష్వేరోషు రాజు పై కుట్ర
19 రెండవసారి కన్యలను సమకూర్చినప్పుడు మొర్దెకై రాజు భవనం ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు.
20 ఎస్తేరు మొర్దెకై పోషణలో ఉన్న కాలంలో చేసినట్టే ఇప్పుడు కూడా అతని మాటకు లోబడుతూ ఉంది. అందువలన మొర్దెకై తనకు ఆజ్ఞాపించినట్టే ఎస్తేరు తన జాతి ఏమిటో తన వంశమేమిటో ఎవరికీ చెప్పలేదు.
21 ఆ రోజుల్లో మొర్దెకై రాజ భవన ద్వారం దగ్గర కూర్చుని ఉన్న సమయంలో రాజుగారి కొలువులో ఉన్న ఇద్దరు నపుంసకులు బిగ్తాను, తెరెషు అనే ద్వారపాలకులు అహష్వేరోషు రాజుపై కోపంతో అతనిని చంపాలని కుట్ర పన్నారు.
22 ఈ సంగతి మొర్దెకైకి తెలిసి అతడు దాన్ని ఎస్తేరురాణితో చెప్పాడు. ఎస్తేరు మొర్దెకై పేరున దాన్ని రాజుకు తెలియజేసింది.
23 ఈ సంగతిని గూర్చి విచారణ జరిపినప్పుడు అది నిజమని తేలింది. అందువల్ల వారిద్దరినీ ఒక చెట్టుకు ఉరి తీశారు. రాజు సమక్షంలో ఈ వివరం రాజ్య వృత్తాంత గ్రంథంలో రాశారు.