31
బెసలేలు, అహోలియాబు
నిర్గ 35:30
1 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు,
2 “యూదా గోత్రానికి చెందిన బెసలేలును నేను నియమించుకున్నాను. అతడు ఊరీ కొడుకు, హూరు మనుమడు.
3 అతనికి నేను అన్ని రకాల పనులు చెయ్యడానికి తెలివితేటలు, సమస్త జ్ఞానం, నేర్పరితనం ప్రసాదించాను. అతణ్ణి నా ఆత్మతో నింపాను.
4 అతడు బంగారంతో, వెండితో, ఇత్తడితో వివిధ రకాల ఆకృతులు నైపుణ్యంగా తయారు చేయగల నేర్పరి. రత్నాలు సానబెట్టి పొదగడంలో, చెక్కను కోసి నునుపు చేయడంలో నిపుణుడు.
5 నేను ప్రసాదించిన సమస్త జ్ఞానం, వివేకాలతో అతడు పనులు జరిగిస్తాడు.
6 దాను గోత్రానికి చెందిన అహీసామాకు కొడుకు అహోలీయాబు అతనికి సహాయంగా ఉంటాడు. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ తయారు చేయగల నిపుణులందరి హృదయాల్లో నా జ్ఞానం ఉంచుతాను.
7 నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం వాళ్ళు సన్నిధి గుడారం, సాక్ష్యపు మందసం, దాని మీద ఉన్న కరుణాపీఠాన్ని, గుడారపు సామగ్రిని తయారు చెయ్యాలి.
8 సన్నిధి బల్ల, దాని సామగ్రి, నిర్మలమైన దీపవృక్షం, దాని సామగ్రి తయారు చెయ్యాలి.
9 ధూపవేదిక, దహన బలిపీఠం, దాని సామగ్రి, గంగాళం, దాని పీట,
10 యాజక ధర్మం నెరవేర్చే అహరోనుకు, అతని కొడుకులకు ప్రతిష్టించిన దుస్తులు సిద్ధం చెయ్యాలి.
11 పరిశుద్ధ స్థలం కోసం అభిషేక తైలాన్ని, సుగంధ ధూప ద్రవ్యాలను సిద్ధం చెయ్యాలి. ఇవన్నీ నేను నీకు ఆజ్ఞాపించినట్టు జరగాలి.”
విశ్రాంతి దినం గురించిన ఆజ్ఞలు
12 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు. మీరు నేను నియమించిన విశ్రాంతి దినాన్ని కచ్చితంగా ఆచరించాలి.
13 మిమ్మల్ని పవిత్రంగా చేసే యెహోవాను నేనే అని మీరు తెలుసుకునేలా విశ్రాంతి దినం నాకు, మీకు, మీ తరతరాలకు ఒక చిహ్నంగా ఉంటుంది.
14 అందువల్ల మీరు విశ్రాంతి దినాన్ని కచ్చితంగా ఆచరించాలి. అది మీకు పవిత్రమైనది. ఆ దినాన్ని అపవిత్రం చేసే వాణ్ణి ప్రజల్లో లేకుండా చెయ్యాలి.
15 ఆరు రోజులు పని చేసిన తరువాత యెహోవాకు ప్రతిష్ఠితమైన ఏడవ రోజును విశ్రాంతి దినంగా పాటించాలి. విశ్రాంతి దినాన పని చేసే ప్రతివాడికీ తప్పకుండా మరణశిక్ష విధించాలి.
16 ఇశ్రాయేలు ప్రజలు తమ తరతరాలు విశ్రాంతి దిన ఆచారం పాటించి ఆ దినాన్ని ఆచరించాలి. ఇది శాశ్వత కాలం నిలిచి ఉండే నియమం.
17 నాకు, ఇశ్రాయేలు ప్రజలకు మధ్య అది శాశ్వతంగా ఒక గుర్తుగా ఉంటుంది. ఎందుకంటే, యెహోవా ఆరు రోజులు భూమి ఆకాశాలను సృష్టి చేసి ఏడవ దినాన విశ్రాంతి తీసుకున్నాడు.”
18 ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడడం ముగించిన తరువాత ఆయన తన వేలితో రాసిన శాసనాలు ఉన్న రెండు పలకలను మోషేకు అందించాడు.