40
యిర్మీయా విడుదల
1 రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను యెరూషలేములో నుంచి, యూదాలో నుంచి బబులోనుకు బందీలుగా తీసుకెళ్ళిన ప్రజలందరి దగ్గర నుంచి, సంకెళ్లతో బంధించి ఉన్న యిర్మీయాను రమా నుంచి పంపించేసినప్పుడు యెహోవా నుంచి అతనికి వచ్చిన వాక్కు.
2 రాజదేహ సంరక్షకుల అధిపతి యిర్మీయాను పక్కకు తీసుకెళ్ళి, అతనితో “ఈ స్థలానికి ఈ విపత్తు తెస్తానని నీ దేవుడైన యెహోవా ప్రకటించాడు గదా,
3 తాను చెప్పిన ప్రకారం యెహోవా ఆ విపత్తు రప్పించాడు. మీరు యెహోవాకు విరోధంగా పాపం చేసి ఆయన మాటలు వినలేదు కాబట్టి ఆయన చెప్పినట్టే చేశాడు. అందుకే మీకు ఇలా జరిగింది.
4 కాని ఇప్పుడు చూడు! ఈ రోజు నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించాను. నాతోబాటు బబులోను రావడం మంచిదని నీకు అనిపిస్తే నాతో రా. నేను నీ గురించి జాగ్రత్త తీసుకుంటాను. అయితే మంచిది కాదనిపిస్తే రావద్దు. దేశమంతా నీ ఎదుట ఉంది. ఎక్కడికి వెళ్ళడం నీ దృష్టికి అనుకూలమో అక్కడికి వెళ్ళు.”
5 యిర్మీయా ఏ జవాబూ చెప్పకుండా ఉన్నప్పుడు, నెబూజరదాను అతనితో ఇలా అన్నాడు. “షాఫాను కొడుకైన అహీకాము కొడుకు గెదల్యాను యూదా పట్టణాల మీద అధికారిగా బబులోను రాజు నియమించాడు. అతని దగ్గరికి వెళ్లు. అతనితో ఉంటూ, ప్రజల మధ్య నివాసం ఉండు. లేదా, ఎక్కడికి వెళ్ళడం నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్లు.” అప్పుడు రాజదేహ సంరక్షకుల అధిపతి అతనికి ఆహారం, ఒక బహుమానం ఇచ్చి పంపించాడు.
6 యిర్మీయా మిస్పాలో ఉన్న అహీకాము కొడుకు గెదల్యా దగ్గరికి వెళ్లి అతనితోబాటు దేశంలో మిగిలిన ప్రజల మధ్య కాపురం ఉన్నాడు.
అధిపతి గెదల్యా మరణం
40:7-9; 41:1-3; 2రాజులు 25:22-26
7 ఇప్పుడు, అక్కడ పల్లెటూళ్ళల్లో ఉన్న కొంతమంది యూదయ సేనల అధిపతులూ, వారి మనుషులూ, బబులోను రాజు అహీకాము కొడుకు గెదల్యాను దేశం మీద అధికారిగా నియమించాడనీ, బబులోనుకు బందీలుగా వెళ్ళకుండా అక్కడే మిగిలిన వాళ్ళలో ఉన్న స్త్రీలను, పురుషులను, పిల్లలను, దేశంలోని నిరుపేదలను అతనికి అప్పగించాడనీ విన్నారు.
8 కాబట్టి నెతన్యా కొడుకు ఇష్మాయేలు, కారేహ కొడుకులైన యోహానాను, యోనాతాను, తన్హుమెతు కొడుకు శెరాయా, నెటోపాతీయుడైన ఏపయి కొడుకులు, మాయకాతీయుడి కొడుకు యెజన్యా, వాళ్ళ మనుషులు, మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరికి వచ్చారు.
9 అప్పుడు షాఫాను కొడుకు అహీకాము కొడుకు గెదల్యా ప్రమాణంచేసి వాళ్ళతోనూ, వాళ్ళ మనుషులతోనూ ఇలా అన్నాడు. “మీరు కల్దీయులను సేవించడానికి భయపడవద్దు. దేశంలో కాపురం ఉండి, బబులోను రాజును సేవిస్తే మీకు మేలు కలుగుతుంది.
10 చూడండి, మన దగ్గరికి వచ్చే కల్దీయులను కలుసుకోడానికి నేను మిస్పాలో కాపురం ఉంటున్నాను. కాబట్టి ద్రాక్షారసం తయారుచేసుకోండి. వేసవికాల ఫలాలు, నూనె సమకూర్చుకుని, పాత్రల్లో నిల్వ చేసుకోండి. మీరు స్వాధీనం చేసుకున్న పట్టణాల్లో నివాసం ఉండండి.”
11 మోయాబులో, అమ్మోనీయుల ప్రజల మధ్య, ఎదోములో, ఇంకా మిగతా ప్రదేశాలన్నిటిలో ఉన్న యూదులందరూ, బబులోను రాజు యూదయలో కొంతమంది ప్రజలను విడిచిపెట్టాడనీ, షాఫాను కొడుకు అహీకాము కొడుకైన గెదల్యాను వాళ్ళ మీద అధికారిగా నియమించాడని విన్నారు.
12 కాబట్టి యూదయ వాళ్ళందరూ తాము చెదిరిపోయి ఉన్న స్థలాలన్నిటినీ విడిచి, గెదల్యా దగ్గరికి మిస్పా తిరిగి వచ్చారు. వాళ్ళు ద్రాక్షారసం, వేసవికాలపు ఫలాలు అత్యంత సమృద్ధిగా సమకూర్చుకున్నారు.
13 కారేహ కొడుకు యోహానాను, పల్లెటూళ్ళల్లో నున్న సేనల అధిపతులందరూ మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరికి వచ్చి,
14 “నిన్ను చంపడానికి అమ్మోనీయుల రాజైన బయలీను నెతన్యా కొడుకు ఇష్మాయేలును పంపాడని నీకు తెలియదా?” అన్నారు. కాని, అహీకాము కొడుకు గెదల్యా వాళ్ళ మాట నమ్మలేదు.
15 కారేహ కొడుకు యోహానాను మిస్పాలో గెదల్యాతో ఏకాంతంగా “నెతన్యా కొడుకు ఇష్మాయేలును నేను చంపుతాను. నన్ను ఎవరూ అనుమానించరు. అతడు నిన్నెందుకు చంపాలి? నీ దగ్గరికి కూడివచ్చిన యూదులందరూ ఎందుకు చెదిరిపోవాలి? మిగిలిన ప్రజలందరూ ఎందుకు నాశనం కావాలి?” అన్నాడు.
16 కాని అహీకాము కొడుకు గెదల్యా, కారేహ కొడుకు యోహానానుతో “నువ్వు ఈ పని చెయ్యొద్దు. ఎందుకంటే నువ్వు ఇష్మాయేలు గురించి అబద్ధాలు చెబుతున్నావు” అన్నాడు.