45
బారూకుకు దేవుని సందేశం
1 ఇది యిర్మీయా ప్రవక్త నేరీయా కొడుకు బారూకుతో పలికిన మాట. యోషీయా కొడుకూ యూదా రాజూ అయిన యెహోయాకీము పరిపాలనలో నాలుగో సంవత్సరంలో ఇది జరిగింది. ఈ మాటలు యిర్మీయా చెప్తుండగా బారూకు రాశాడు.
2 “బారూకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీకు ఇలా చెప్తున్నాడు.
3 ‘అయ్యో, నాకు ఎంత శ్రమ! యెహోవా నా బాధకి తోడు వేదనను జోడించాడు. మూలుగులతో అలసిపోయాను. నాకు విశ్రాంతి దొరకడం లేదు’ అని నువ్వు అనుకుంటున్నావు.
4 నువ్వు అతనికి ఈ విధంగా చెప్పాలి. ‘యెహోవా ఈ మాట చెప్తున్నాడు. చూడు, నేను కట్టిన దాన్ని నేనే కూలదోస్తున్నాను. నేను నాటిన దాన్ని నేనే పెకలించి వేస్తున్నాను. భూమి అంతటా ఇదే జరుగుతుంది.
5 కానీ నీ కోసం నువ్వు గొప్ప వాటిని కోరుకుంటున్నావా? గొప్ప వాటి కోసం చూడకు. ఎందుకంటే సర్వ మానవాళికీ వినాశనం కలుగబోతుంది.’ ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. ‘కానీ నువ్వు వెళ్ళిన స్థలాలన్నిటిలో దోపిడీ సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణాన్ని నీకిస్తున్నాను.’ ”