2
యేసు జననం
మత్తయి 1:18-25; 2:1
1 ఆ రోజుల్లో రోమా పాలనలో ఉన్న ప్రపంచమంతటా జనసంఖ్య నిర్వహించాలని సీజరు అగస్టస్ ఆజ్ఞాపించాడు.
2 ఇది కురేనియస్ సిరియా దేశానికి గవర్నర్ గా ఉండగా జరిగిన మొదటి జనసంఖ్య.
3 అందులో పేరు నమోదు చేయించుకోవడానికి అంతా తమ స్వగ్రామాలకు వెళ్ళారు.
4 యోసేపు కూడా దావీదు వంశంలో పుట్టినవాడు కాబట్టి ఆ జనసంఖ్యలో నమోదు కావడానికి గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేము అనే పేరున్న దావీదు ఊరికి వెళ్ళాడు.
5 తనకు భార్యగా ప్రదానం జరిగి గర్భవతిగా ఉన్న మరియతో సహా వెళ్ళాడు.
6 వారక్కడ ఉన్న సమయంలో ఆమెకు నెలలు నిండాయి.
7 ఆమె తన తొలిచూలు బిడ్డను కని, మెత్తని గుడ్డలతో చుట్టి, ఆయనను ఒక పశువుల తొట్టిలో పడుకోబెట్టింది. ఎందుకంటే సత్రంలో వారికి స్థలం దొరకలేదు.
గొల్ల వారి సందర్శనం
8 ఆ పరిసరాల్లో కొందరు గొర్రెల కాపరులు పొలంలో రాత్రివేళ తమ మందను కాచుకొంటూ ఉన్నారు
9 ప్రభువు దూత వారి దగ్గరికి వచ్చాడు. ప్రభువు తేజస్సు వారి చుట్టూ ప్రకాశించింది. వారు హడలిపోయారు.
10 అయితే ఆ దూత, “భయపడకండి. ఇదిగో మీతో సహా మనుషులందరికీ మహానందకరమైన శుభవార్త నేను మీకు తెచ్చాను.
11 దావీదు ఊరిలో మీకోసం రక్షకుడు పుట్టాడు, ఈయన ప్రభువైన క్రీస్తు.
12 మీకు కొండ గుర్తు ఒకటే. ఒక పసికందు మెత్తని గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పడుకుని ఉండడం మీరు చూస్తారు” అని వారితో చెప్పాడు.
13 ఉన్నట్టుండి అసంఖ్యాకంగా పరలోక దూతల సమూహం ఆ దూతతోబాటు ఉండి,
14 “సర్వోన్నత స్థలాల్లో దేవునికి మహిమ.
ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద శాంతి సమాధానాలు కలుగు గాక!”
అంటూ దేవుణ్ణి స్తుతించారు.
15 ఆ దూతలు తమ దగ్గర నుండి పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత ఆ గొర్రెల కాపరులు, “జరిగిన ఈ విషయం ప్రభువు మనకు తెలియజేశాడు. మనం బేత్లెహేముకు వెళ్ళి చూద్దాం పదండి,” అని ఒకడితో ఒకడు చెప్పుకుని
16 త్వరగా వెళ్ళి, మరియను, యోసేపును, తొట్టిలో పడుకుని ఉన్న పసికందును చూశారు.
17 ఆ పసికందును గురించి దేవదూత తమతో చెప్పిన మాటలు ప్రచారం చేశారు.
18 గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు విన్నవారంతా ఎంతో ఆశ్చర్యపోయారు.
19 మరియ మాత్రం ఆ విషయాలన్నీ హృదయంలో మననం చేసుకుంటూ పదిలపరచుకుంది.
20 ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పినట్టుగా తాము విన్నవాటిని, కన్నవాటినన్నిటిని గురించి దేవుణ్ణి మహిమ పరుస్తూ కీర్తిస్తూ వెళ్ళిపోయారు.
యేసు సున్నతి ఆచారం
లూకా 1:59
21 ఆ బిడ్డకి సున్నతి ఆచారం జరిగించవలసిన ఎనిమిదవ రోజున, ఆయన గర్భంలో పడక మునుపు దేవదూత పెట్టిన యేసు అనే పేరు వారు ఆయనకు పెట్టారు.
22-24 మోషే ధర్మశాస్త్రం ప్రకారం శుద్ధీకరణ దినాలు పూర్తి అయినాయి. “ప్రతి తొలిచూలు మగబిడ్డను ప్రభువుకు ప్రతిష్ఠ చేయాలి” అని ప్రభువు ధర్మశాస్త్రంలో రాసి ఉంది. కాబట్టి ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించడానికి, ప్రభువు ధర్మశాస్త్రంలో రాసి ఉన్నట్టు గువ్వల జతను గానీ రెండు పావురం పిల్లలను గానీ బలిగా సమర్పించడానికి వారు ఆయనను యెరూషలేముకు తీసుకు వెళ్ళారు.
సుమెయోను ఆరాధన, ప్రవచనం
25 యెరూషలేములో సుమెయోను అనే ఒక వృద్ధుడు ఉన్నాడు. అతడు న్యాయవంతుడు, భక్తిపరుడు. ఇశ్రాయేలుకు కలగబోయే ఆదరణ కోసం ఎదురు చూసేవాడు. పరిశుద్ధాత్మ అతనిపై ఉన్నాడు.
26 అతడు ప్రభువు అభిషిక్తుణ్ణి చూడకుండా చనిపోడని అతనికి పరిశుద్ధాత్మ వెల్లడించాడు.
27 ఆ రోజు అతడు ఆత్మవశుడై దేవాలయంలోకి వచ్చాడు. ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం ఆయన విషయంలో జరిగించడానికి తల్లిదండ్రులు చంటి బిడ్డ యేసును దేవాలయంలోకి తెచ్చారు.
28 సుమెయోను తన చేతుల్లో ఆయనను ఎత్తుకుని దేవుణ్ణి స్తుతిస్తూ ఇలా అన్నాడు,
29 “ప్రభూ, ఇప్పుడు నీ మాట చొప్పున శాంతితో నీ సేవకుణ్ణి కడతేరి పోనిస్తున్నావు గదా!
30-32 అన్యజనులకు నిన్ను వెల్లడించే వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగా
నీవు ప్రజలందరి ఎదుట సిద్ధం చేసిన నీ రక్షణ నేను కళ్ళారా చూశాను.”
33 యోసేపు, ఆయన తల్లీ ఆయనను గురించి సుమెయోను చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయారు.
34 అతడు వారిని దీవించి, మరియతో ఇలా అన్నాడు, “అనేకమంది హృదయాలోచనలు బయట పడేలా, ఇశ్రాయేలులో చాలా మంది పడడానికీ లేవడానికీ వివాదాస్పదమైన చిహ్నంగా దేవుడు ఈయనను నియమించాడు.
35 అంతేగాక నీ హృదయంలోకి ఒక కత్తి దూసుకు పోతుంది.”
అన్నా ఆరాధన
36 దేవుని మూలంగా పలికే అన్నా అనే ఆమె కూడా అక్కడ ఉంది. ఆమెది ఆషేరు గోత్రం, ఆమె పనూయేలు కుమార్తె. ఆమె పెళ్ళయి ఏడు సంవత్సరాలు భర్తతో కాపురం చేసి వృద్ధాప్యంలో,
37 ఎనభై నాలుగేళ్ళ వయసు వరకూ వితంతువుగా ఉండిపోయింది. ఆమె దేవాలయంలోనే ఉంటూ ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేస్తూ ఉండేది.
38 ఆమె కూడా ఆ సమయంలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి, యెరూషలేము విముక్తి కోసం ఎదురు చూస్తున్న వారందరితో ఆ బిడ్డను గురించి మాట్లాడుతూ ఉంది.
నజరేతుకు తిరిగి రాక
39 ఆ విధంగా యోసేపు, మరియ ప్రభువు ధర్మశాస్త్రం చొప్పున ఆచారాలన్నీ పూర్తి చేసుకుని గలిలయలోని తమ స్వగ్రామం నజరేతుకు వెళ్ళిపోయారు.
40 పసివాడు ఎదుగుతూ, బలపడుతూ జ్ఞానంలో ఎదుగుతూ ఉన్నాడు. దేవుని దయ ఆయన మీద ఉంది.
యేసు యెరూషలేము యాత్ర
41 పస్కా పండగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెళ్ళడం కద్దు.
42 ఆయన పన్నెండేళ్ళ ప్రాయంలో వాడుక చొప్పున వారు ఆ పండగకు యెరూషలేము వెళ్ళారు.
43 ఆ రోజులు తీరిన తరువాత వారు తిరిగి వెళుతుండగా బాల యేసు యెరూషలేములో ఉండిపోయాడు. ఆయన తల్లిదండ్రులకు ఆ సంగతి తెలియలేదు.
44 ఆయన గుంపులో ఉన్నాడనుకుని, ఒక రోజు ప్రయాణం చేసి, తమ బంధువుల్లో, అయినవారిలో ఆయనను వెదకసాగారు.
45 ఆయన కనబడక పోవడంతో ఆయనను వెదుక్కుంటూ యెరూషలేముకు తిరిగి వచ్చారు.
46 అప్పటికి మూడు రోజులైంది. ఆయన ఆలయంలో ఉపదేశకుల మధ్య కూర్చుని, వారి మాటలు వింటూ వారిని ప్రశ్నలడుగుతూ ఉండగా చూశారు.
47 ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకు, ప్రత్యుత్తరాలకు అబ్బురపడ్డారు.
48 ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఆయన తల్లి, “కుమారా, ఎందుకిలా చేశావు? మీ నాన్న, నేను ఆందోళనగా నిన్ను వెదకుతున్నాం” అంది.
49 అందుకు ఆయన, “మీరెందుకు నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా?” అన్నాడు.
50 కానీ ఆయన తమతో చెప్పిందేమిటో వారికి అర్థం కాలేదు.
51 అప్పుడు ఆయన వారితో కలిసి బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉన్నాడు. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసికుంది.
52 యేసు జ్ఞానంలోనూ, వయసులోనూ, దేవుని దయలోనూ, మనుషుల దయలోనూ దినదిన ప్రవర్థమానమవుతూ ఉన్నాడు.