19
వేరు వేరు చట్టాలు
యెహోవా మోషేకు ఇంకా ఇలా ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీయుల సమాజమంతటితో ఇలా చెప్పు. “మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా అనే నేను పరిశుద్ధుడిని. మీలో ప్రతివాడూ తన తల్లిని తన తండ్రిని గౌరవించాలి. నేను నియమించిన విశ్రాంతి దినాలను ఆచరించాలి. నేను మీ దేవుడైన యెహోవాను.
మీరు పనికిమాలిన దేవుళ్ళ వైపు తిరగకూడదు. మీరు పోత విగ్రహాలను చేసుకోకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను.
మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించేటప్పుడు అది అంగీకారయోగ్యమయ్యేలా అర్పించాలి. మీరు బలిమాంసాన్ని బలి అర్పించిన రోజైనా, మరునాడైనా దాన్ని తినాలి. మూడో రోజు దాకా మిగిలి ఉన్న దాన్ని పూర్తిగా కాల్చివేయాలి. మూడో రోజున దానిలో కొంచెం తిన్నా సరే, అది అసహ్యం. అది ఆమోదం కాదు. మూడో రోజున దాన్ని తినేవాడు తన దోషశిక్షను భరిస్తాడు. వాడు యెహోవాకు పరిశుద్ధమైన దాన్ని అపవిత్ర పరిచాడు కదా. వాడిని ప్రజల్లో లేకుండా చెయ్యాలి.
మీరు మీ పొలం పంట కోసేటప్పుడు నీ పొలం మూలల్లొ పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగె ఏరుకోకూడదు. నీ పండ్ల చెట్ల పరిగెను సమకూర్చుకోకూడదు. 10 నీ ద్రాక్ష తోటలో పండ్లన్నిటినీ సేకరించుకో కూడదు. ద్రాక్ష తోటలో రాలిన పండ్లను ఏరుకోకూడదు. పేదలకు, పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి.
11 నేను మీ దేవుడైన యెహోవాను.
మీరు దొంగతనం చేయకూడదు.
అబద్ధం ఆడకూడదు.
ఒకడినొకడు దగా చెయ్యకూడదు.
12 నా నామం పేరిట అబద్ధంగా ఒట్టు పెట్టుకోకూడదు.
నీ దేవుని పేరును అపవిత్ర పరచకూడదు. నేను యెహోవాను.
13 నీ పొరుగు వాణ్ణి పీడించకూడదు.
అతణ్ణి దోచుకోకూడదు.
కూలివాడి కూలీ డబ్బు మరునాటి వరకూ నీ దగ్గర ఉంచుకోకూడదు.
14 చెవిటివాణ్ణి తిట్ట కూడదు.
గుడ్డివాడి దారిలో అడ్డంకులు వేయకూడదు.
నీ దేవునికి భయపడాలి. నేను యెహోవాను.
15 అన్యాయ తీర్పు తీర్చకూడదు.
బీదవాడని పక్షపాతం చూపకూడదు.
గొప్పవాడని అభిమానం చూపకూడదు.
నీ పొరుగువాడి పట్ల న్యాయంగా ప్రవర్తించాలి.
16 నీ ప్రజల మధ్య కొండేలు చెబుతూ ఇంటింటికి తిరగకూడదు.
*ఎవరికైనా ప్రాణ హాని కలిగించేది ఏదీ చెయ్యవద్దు. నేను యెహోవాను.
17 నీ హృదయంలో నీ సోదరుణ్ణి అసహ్యించుకోకూడదు.
నీ పొరుగువాడి పాపం నీ మీదికి రాకుండేలా నీవు తప్పకుండా అతణ్ణి గద్దించాలి.
18 పగ సాధించ వద్దు. ఎవరిమీదా కక్ష పెట్టుకోవద్దు.
నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ సాటి మనిషిని ప్రేమించాలి. నేను యెహోవాను.
19 మీరు నా శాసనాలను పాటించాలి.
నీ జంతువులకు ఇతర జాతి జంతువులతో సంపర్కం చేయకూడదు.
నీ పొలంలో వేరు వేరు జాతుల విత్తనాలు చల్లకూడదు.
రెండు రకాల దారాలతో నేసిన బట్టలు ధరించకూడదు.
20 ఒక బానిస పిల్లలు ఒకడితో నిశ్చితార్థం జరిగాక ఆమెను వెల ఇచ్చి విడిపించకుండా, లేదా ఆమెకు విముక్తి కలగక ముందు ఎవరైనా ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకుంటే అలాటి వాణ్ణి శిక్షించాలి. ఆమెకు విడుదల కలగలేదు గనక వారికి మరణశిక్ష విధించ కూడదు. 21 అతడు అపరాధ పరిహార బలిని, అంటే అపరాధ పరిహార బలిగా ఒక పొట్టేలును ప్రత్యక్ష గుడార ద్వారానికి యెహోవా సన్నిధికి తీసుకు రావాలి. 22 అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపాన్నిబట్టి పాప పరిహార బలిగా ఆ పొట్టేలు మూలంగా యెహోవా సన్నిధిలో అతని కోసం ప్రాయశ్చిత్తం చేయాలి. ఈ విధంగా అతడు చేసిన పాపం విషయమై అతనికి క్షమాపణ కలుగుతుంది.
23 మీరు ఆ దేశానికి వచ్చి తినడానికి రకరకాల చెట్లు నాటినప్పుడు వాటి పండ్లను నిషేధంగా ఎంచాలి. మూడు సంవత్సరాల పాటు అవి మీకు అపవిత్రంగా ఉండాలి. వాటిని తినకూడదు. 24 నాలుగో సంవత్సరంలో వాటి పండ్లన్నీ యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతి అర్పణలుగా ఉంటాయి. ఐదో సంవత్సరంలో వాటి పండ్లను తినొచ్చు. 25 నేను మీ దేవుడైన యెహోవాను.
26 రక్తం కలిసి ఉన్న మాంసం తినకూడదు.
శకునాలు చూడకూడదు.
మంత్ర ప్రయోగం ద్వారా ఇతరులను వశపరచుకోడానికి చూడకూడదు.
27 విగ్రహ పూజలు చేసే ఇతర జనాల్లాగా మీ తల పక్క భాగాలు గానీ నీ గడ్డం అంచులు గానీ గుండ్రంగా గొరిగించుకోకూడదు.
28 చచ్చిన వారి కోసం మీ దేహాన్ని గాయపరచుకోకూడదు. ఒంటిపై పచ్చబొట్లు పొడిపించుకోకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను.
29 నీ కూతురిని వేశ్యగా చేసి ఆమెను హీనపరచకూడదు. అలా చేస్తే మీ దేశం వ్యభిచారంలో పడిపోతుంది. మీ ప్రాంతం కాముకత్వంతో నిండిపోతుంది.
30 నేను నియమించిన విశ్రాంతి దినాలను మీరు ఆచరించాలి. నా పరిశుద్ధ మందిరాన్ని గౌరవించాలి. నేను యెహోవాను.
31 చచ్చిన ఆత్మలతో మాట్లాడుతామని చెప్పే వారి దగ్గరికి సోదె చెప్పేవారి దగ్గరికి పోకూడదు. అలా చేస్తే వారివలన మీరు అపవిత్రులౌతారు. నేను మీ దేవుడైన యెహోవాను.
32 తల నెరసిన ముసలివాడి ఎదుట లేచి నిలబడి అతని ముఖాన్ని గౌరవించాలి. నీ దేవునికి భయపడాలి. నేను యెహోవాను.
33 మీ దేశంలో పరదేశి ఎవరైనా మీ మధ్య నివసించేటప్పుడు అతణ్ణి బాధ పెట్టకూడదు, 34 మీ మధ్య నివసించే పరదేశిని మీలో పుట్టినవాడి లాగానే ఎంచాలి. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే అతణ్ణి ప్రేమించాలి. ఐగుప్తులో మీరు పరదేశులుగా ఉన్నారు గదా. నేను మీ దేవుడైన యెహోవాను.
35 కొలతలోగాని తూనికలోగాని పరిమాణంలో గాని మీరు అన్యాయం చేయకూడదు. 36 న్యాయమైన త్రాసులు న్యాయమైన బరువులు, న్యాయమైన కొల పాత్రలు న్యాయమైన పడి మీకుండాలి. నేను ఐగుప్తులోనుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను.
37 మీరు నా శాసనాలన్నిటిని నా విధులన్నిటిని పాటించాలి. నేను యెహోవాను.”
* 19:16 ప్రాణం నిలపడానికి చూడాలి.