2
రాజుకి నెహెమ్యా విజ్ఞాప్తి
1 తరవాత అర్తహషస్త రాజు పరిపాలన కాలంలో 20 వ సంవత్సరం నీసాను నెలలో రాజు ద్రాక్షారసం అడిగితే నేను అతనికి ద్రాక్షారసం అందించాను. అంతకుముందు నేనెప్పుడూ అతని సమక్షంలో విచారంగా కనిపించ లేదు.
2 రాజు నాతో “నీకు అనారోగ్యమేమీ లేదు గదా, నీ ముఖం విచారంగా ఉందేమిటి? నీకేదో మనోవేదన ఉన్నట్టుంది” అన్నాడు. నేను చాలా భయపడ్డాను.
3 అప్పుడు నేను “రాజు చిరకాలం జీవించాలి. నా పూర్వీకుల సమాధులున్న పట్టణం శిథిలమైపోయింది. దాని కోట తలుపులు తగలబడి పోయాయి. మరి నా ముఖం విచారంగా కాక ఇంకెలా ఉంటుంది?” అని రాజుతో అన్నాను.
4 అప్పుడు రాజు “నీకు ఏం కావాలి? నీ విన్నపం ఏమిటి?” అని అడిగాడు. నేను ఆకాశంలో ఉన్న దేవునికి ప్రార్థన చేసి
5 రాజుతో “మీకు సమంజసం అనిపిస్తే, మీ దృష్టిలో మీ సేవకుడినైన నేను యోగ్యుడినైతే నన్ను యూదా దేశానికి నా పూర్వికుల సమాధులున్న పట్టణానికి నన్ను పంపండి. దాన్ని నేను తిరిగి కట్టాలి” అని మనవి చేశాను.
6 అందుకు రాజు ఇలా అడిగాడు (ఆ సమయంలో రాణి తన పక్కనే కూర్చుని ఉంది). “అక్కడ ఎంతకాలం ఉంటావు? ఎప్పుడు తిరిగి వస్తావు?” నేను ఆ తేదీలు అతనికి చెప్పాను. అప్పుడు రాజు నన్ను పంపడానికి ఇష్టపడ్డాడు.
7 నేను రాజుతో ఇంకా ఇలా అన్నాను. “రాజు గారికి అభ్యంతరం లేకపోతే నేను యూదా దేశం చేరే దాకా నది అవతల ప్రాంతాల్లో ప్రయాణించడానికి అక్కడి అధికారులు నన్ను అనుమతించేలా ఉత్తర్వులు ఇవ్వండి.
8 రాజుగారి అడవులపై అధికారి అయిన ఆసాపుకు కూడా లేఖ రాసి ఇవ్వండి. యెరూషలేం ఆలయం దగ్గర ఉన్న కోట తలుపుల కోసం, కోట గోడ కోసం, నేను నివసించబోయే ఇంటి దూలాల కోసం అతడు కలప ఇవ్వాలి.”
దేవుని కరుణా హస్తం నాపై ఉన్నందువల్ల రాజు నా మనవి విన్నాడు.
9 తరువాత నేను నది అవతల ఉన్న అధికారుల దగ్గరకి చేరుకుని వారికి రాజుగారి ఆజ్ఞాపత్రాలు అందజేశాను. రాజు సేనాధిపతులను గుర్రపు రౌతులను నాతో పంపించాడు.
10 హోరోనీ జాతివాడు సన్బల్లటు, అమ్మోను జాతి వాడు టోబీయా అనే సేవకులు ఇదంతా విన్నారు. ఇశ్రాయేలీయులకు ఆసరాగా ఒకడు రావడం వారికి ఎంతమాత్రం నచ్చలేదు.
నెహెమ్యా యెరూషలేం సరిహద్దు గోడలను పరీక్షించడం
11 నేను యెరూషలేముకు వచ్చి మూడు రోజులు ఉన్నాను.
12 రాత్రి వేళ నేనూ నాతో ఉన్న కొందరూ లేచాం. యెరూషలేం గురించి దేవుడు నా హృదయంలో పుట్టించిన ఆలోచన నేనెవరితోనూ చెప్పలేదు. నేను ఎక్కిన జంతువు తప్ప మరేదీ నా దగ్గర లేదు.
13 నేను రాత్రి వేళ లోయ ద్వారం గుండా నక్క బావి వైపుకు చెత్త ద్వారం వరకూ వెళ్ళాను. కూలిపోయిన యెరూషలేం సరిహద్దు గోడలను పరీక్షించాను. దాని తలుపులు తగలబడిపోయి ఉన్నాయి.
14 తరవాత నేను ఊట ద్వారానికి వచ్చి రాజు కోనేటికి వెళ్ళాను. అయితే అది ఇరుకుగా ఉంది. నేను స్వారీ చేస్తున్న జంతువు పోవడానికి సందు లేదు.
15 నేను రాత్రి వేళ లోయలోబడి వెళ్ళి ఆ ప్రాకారాన్ని చూసి, లోయ ద్వారం గుండా వెనక్కి తిరిగి వచ్చాను.
16 అయితే నేను ఎక్కడికి వెళ్ళానో ఏమి చేసానో అధికారులకు తెలియలేదు. యూదులకు గానీ యాజకులకు గానీ రాజ వంశీకులకు గానీ అధికారులకు గానీ పని చేసే ఇతరులకు గానీ నేను ఆ సంగతి ఇంకా చెప్పలేదు.
17 వారితో నేను “మనం ఎంత కష్టంలో ఉన్నామో మీకు తెలుసు. యెరూషలేము పాడుబడి పోయింది. కోట తలుపులు తగలబడి పోయాయి. ఇదంతా మీరు చూస్తూనే ఉన్నారు. రండి, యెరూషలేము ప్రాకారం తిరిగి కడదాం, ఇకపై మనం నింద పాలు కాకూడదు” అన్నాను.
18 దేవుని కరుణాహస్తం నాకు తోడుగా ఉన్న సంగతి, రాజు నాకు అభయమిచ్చిన మాటల గురించీ నేను వారితో చెప్పాను. అందుకు వారు “మనం లేచి కట్టడం మొదలు పెడదాం” అన్నారు. వారు ఈ మంచి పనికి సిద్ధపడ్డారు.
19 అయితే హోరోనీ జాతివాడు సన్బల్లటు, అమ్మోనీ జాతివాడు టోబీయా అనే దాసుడు, అరబీయుడు గెషెము ఆ మాట విని మమ్మల్ని ఎగతాళి చేశారు. మా పనిని హేళన చేశారు. “మీరు చేస్తున్నదేమిటి? రాజు మీద తిరుగుబాటు చేస్తున్నారా?” అన్నారు.
20 అందుకు నేను “ఆకాశంలో ఉన్న దేవుడే మా పని సఫలం చేస్తాడు. మేము ఆయన సేవకులం. మేమంతా పూనుకుని కడతాం. అయితే మీకు మాత్రం యెరూషలేంలో భాగం గానీ, హక్కు గానీ, వారసత్వపరమైన వంతు గానీ ఎంత మాత్రం లేవు” అన్నాను.