19
అశుద్ధతను తొలగించే నీళ్ళు
1 యెహోవా మోషే అహరోనులతో,
2 “యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదంటే, ఇశ్రాయేలీయులు కళంకం లేనిదీ, మచ్చ లేనిదీ, ఎప్పుడూ కాడి మోయ్యని ఎర్ర ఆవును నీ దగ్గరికి తీసుకురావాలని వారితో చెప్పు.
3 మీరు యాజకుడైన ఎలియాజరుకు దాన్ని అప్పగించాలి. ఒకడు పాళెం బయటికి దాన్ని తోలుకెళ్ళి అతని ఎదుట దాన్ని వధించాలి.
4 యాజకుడైన ఎలియాజరు దాని రక్తం కొంచెం వేలితో తీసి, సన్నిధి గుడారం ఎదుట ఆ రక్తాన్ని ఏడుసార్లు చిమ్మాలి.
5 అతని కళ్ళ ఎదుట ఒకడు ఆ ఆవును కాల్చాలి. దాని చర్మం, మాంసం, రక్తం, పేడతో సహా కాల్చెయ్యాలి.
6 ఇంకా ఆ యాజకుడు దేవదారు కర్ర, హిస్సోపు, ఎర్రరంగు నూలు తీసుకుని, ఆ ఆవును కాలుస్తున్న మంటల్లో వాటిని వెయ్యాలి.
7 అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉతుకుకుని, నీళ్లతో తలస్నానం చేసిన తరువాత పాలెంలో ప్రవేశించి సాయంకాలం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.
8 దాన్ని కాల్చినవాడు నీళ్లతో తన బట్టలు ఉతుకుకుని నీళ్లతో తలస్నానం చేసి సాయంకాలం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.
9 ఇంకా శుద్ధుడైనవాడు ఒకడు ఆ ఆవు బూడిదను పోగు చేసి పాలెం బయట ఒక శుద్ధమైన స్థలంలో పెట్టాలి. ఆ బూడిదను ఇశ్రాయేలీయుల సమాజం కోసం భద్రం చెయ్యాలి. ఆ బూడిద పాపపరిహారార్ధ అర్పణ నుంచి వచ్చింది గనక, పాపం నుంచి శుద్ధీకరణ కోసం వారు ఆ బూడిదను నీళ్ళతో కలుపుతారు.
10 ఆ ఆవు బూడిదను పోగు చేసిన వాడు తన బట్టలు ఉతుక్కుని, సాయంకాలం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. ఇది ఇశ్రాయేలీయులకూ, వారిల్లో నివాసం ఉంటున్న పరదేశులకూ శాశ్వతమైన శాసనం.
11 మానవ శవాన్ని ముట్టుకున్నవాడు ఏడు రోజులు అశుద్ధుడుగా ఉంటాడు.
12 అతడు మూడో రోజు ఆ నీళ్ళతో పాపశుద్ధి చేసుకుని, ఏడో రోజు శుద్ధుడౌతాడు. అయితే అతడు మూడో రోజు పాపశుద్ధి చేసుకోకపోతే ఏడో రోజు శుద్ధుడు కాడు.
13 మనిషి శవాన్ని ముట్టుకున్నవాడు ఆ విధంగా పాపశుద్ధి చేసుకోకపోతే అతడు యెహోవా మందిరాన్ని అపవిత్రం చేసినవాడౌతాడు. పాపపరిహార జలం అతని మీద చల్ల లేదు గనక ఆ వ్యక్తిని ఇశ్రాయేలీయుల్లో లేకుండా చెయ్యాలి. అతడు అశుద్ధుడుగానే ఉండిపోతాడు. అతని అశుద్ధత అతని మీద ఉంటుంది.
14 ఎవరైనా ఒక గుడారంలో చనిపోతే, దాని గురించిన చట్టం ఇది. ఆ గుడారంలో ప్రవేశించే ప్రతివాడూ, ఆ గుడారంలో ఉన్నవారూ ఏడు రోజులు అశుద్ధంగా ఉంటారు.
15 మూత వేయకుండా తెరచి ఉన్న పాత్రలన్నీ అశుద్ధం ఔతాయి.
16 గుడారం బయట కత్తితో నరికిన వాడినైనా, శవాన్నైనా, మనిషి ఎముకనైనా, సమాధినైనా ముట్టుకున్నవాడు ఏడు రోజులు అశుద్ధుడుగా ఉంటాడు.
17 అశుద్ధుడైన వ్యక్తి కోసం, పాప పరిహారార్థమైన కాలిన బూడిద కొంచెం తీసుకుని ఒక కూజాలో ఉన్న మంచినీళ్ళతో కలపాలి.
18 తరువాత ఒక శుద్ధుడు హిస్సోపు తీసుకుని ఆ నీళ్ళల్లో ముంచి, ఆ గుడారం మీద, దానిలోని ఉపకరణాలు అన్నిటి మీదా, అక్కడున్న మనుషుల మీదా చల్లాలి. ఎముకనుగాని, కత్తితో నరికిన వాణ్ణి గాని, శవాన్నిగాని, సమాధినిగాని ముట్టుకున్న వాడి మీద కూడా దాన్ని చల్లాలి.
19 మూడో రోజు, ఏడో రోజూ, శుద్ధుడు అశుద్ధుని మీద దాన్ని చల్లాలి. ఏడో రోజు అతడు పాపశుద్ధి చేసుకుని, తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో స్నానం చేసి, సాయంకాలానికి శుద్ధుడౌతాడు.
20 ఎవరైనా అశుద్ధుడుగానే ఉండి పాపశుద్ధి చేసుకోడానికి నిరాకరిస్తే, అతడు యెహోవా పరిశుద్ధ స్థలాన్ని అశుద్ధం చేశాడు గనక అలాంటి వాణ్ణి సమాజంలో లేకుండా చేయాలి. పాపపరిహార జలం అతని మీద చల్ల లేదు గనక అతడు అశుద్ధుడుగానే ఉంటాడు.
21 ఈ పరిస్థితులకు సంబంధించిన శాశ్వతమైన శాసనం ఏదంటే-పాపపరిహార జలం చల్లేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. పాపపరిహార జలం ముట్టుకున్నవాడు సాయంకాలం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. అశుద్ధుడు ముట్టుకున్నదంతా అశుద్ధం
22 దాన్ని ముట్టుకున్న వారిందరూ సాయంకాలం వరకూ అశుద్ధులుగా ఉంటారు.”