32
యొర్దాను నది తూర్పు ప్రాంతం
1 రూబేనీయులకు, గాదీయులకు, పశువులు అతి విస్తారంగా ఉండడం వలన యాజెరు, గిలాదు ప్రాంతాలు మందలకు తగిన స్థలమని వారు గ్రహించారు.
2 వారు మోషేతో, యాజకుడు ఎలియాజరుతో సమాజ నాయకులతో
3 “అతారోతు, దీబోను, యాజెరు, నిమ్రా, హెష్బోను, ఏలాలే, షెబాము, నెబో, బెయోను అనే ప్రాంతాలు,
4 అంటే ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట యెహోవా జయించిన దేశం పశువుల మందలకు అనువైంది. మీ సేవకులైన మాకు మందలు ఉన్నాయి.
5 కాబట్టి మా మీద మీకు దయ కలిగితే, మమ్మల్ని యొర్దాను నది దాటించవద్దు. మాకు ఈ దేశాన్ని వారసత్వంగా ఇవ్వండి” అన్నారు.
6 అప్పుడు మోషే గాదీయులకు, రూబేనీయులకు ఇలా జవాబిచ్చాడు. “మీ సోదరులు యుద్ధాలు చేస్తూ ఉంటే మీరు ఇక్కడే ఉండిపోవచ్చా?
7 యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన దేశానికి వెళ్ళకుండా మీరు వారి హృదయాలను ఎందుకు నిరుత్సాహ పరుస్తున్నారు?
8 ఆ దేశాన్ని చూసి రావడానికి కాదేషు బర్నేయలో నేను మీ తండ్రులను పంపినప్పుడు వారు కూడా ఇలాగే చేశారు కదా.
9 వారు ఎష్కోలు లోయలోకి వెళ్లి ఆ దేశాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలను అధైర్యపరిచారు కాబట్టి యెహోవా తమకిచ్చిన దేశంలో ప్రవేశించలేకపోయారు.
10 ఆ రోజు యెహోవా కోపం తెచ్చుకున్నాడు.
11 ఇరవై సంవత్సరాలకు మించి, ఐగుప్తుదేశం నుండి వచ్చిన మనుషుల్లో యెహోవాను పూర్ణ మనస్సుతో అనుసరించిన కెనెజీయుడు, యెఫున్నె కొడుకు కాలేబు, నూను కొడుకు యెహోషువ తప్ప
12 మరి ఎవ్వడూ పూర్ణమనస్సుతో నన్ను అనుసరించలేదు కాబట్టి నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశాన్ని మరి ఎవరూ చూడనే చూడరు, అని శపథం చేశాడు.
13 అప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవా కోపం రగులుకోవడం వల్ల ఆయన దృష్ఠికి చెడుతనం చూపిన ఆ తరం వారంతా నాశనం అయ్యే వరకూ వారిని అరణ్యంలో తిరిగేలా చేశాడు.
14 ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవాకు మరింత కోపం పుట్టించేలా ఆ పాపుల పిల్లలైన మీరు వారి స్థానంలో బయలుదేరారు.
15 మీరు ఆయన్ని అనుసరించకుండా వెనక్కి తగ్గిపోతే ఆయన ఈ ప్రజలందరినీ ఈ అడవిలోనే నిలిపివేస్తాడు. ఆ విధంగా మీరు ఈ ప్రజలందరి నాశనానికి కారకులౌతారు.”
16 అందుకు వారు అతనితో “మేము ఇక్కడ మా పశువుల కోసం దొడ్లూ, మా పిల్లల కోసం ఊరులూ కట్టుకుంటాం.
17 ఇశ్రాయేలు ప్రజలను వారివారి స్థలాలకు చేర్చే వరకూ మేము యుద్ధానికి సిద్ధపడి వారి ముందు సాగిపోతాం. అయితే మా పిల్లలు ఈ ప్రాంత ప్రజల భయం వలన ప్రాకారాలున్న ఊర్లలో నివసించాలి.
18 ఇశ్రాయేలీయుల్లో ప్రతివాడూ తన తన వారసత్వాన్ని పొందేవరకూ మా ఇళ్ళకు తిరిగి రాము.
19 తూర్పున యొర్దాను ఇవతల మాకు వారసత్వం దొరికింది కాబట్టి ఇక యొర్దాను అవతల వారితో వారసత్వం అడగం” అన్నారు.
20 అప్పుడు మోషే వారితో “మీరు మీ మాట మీద నిలబడి యెహోవా సన్నిధిలో యుద్ధానికి సిద్ధపడి యెహోవా తన ఎదుటనుండి తన శత్రువులను వెళ్లగొట్టే వరకూ
21 యెహోవా సన్నిధిలో మీరంతా యొర్దాను అవతలికి వెళ్ళి
22 ఆ దేశాన్ని జయించిన తరవాత మీరు తిరిగి రావచ్చు. మీరు యెహోవా దృష్టికీ ఇశ్రాయేలీయుల దృష్టికీ నిర్దోషులుగా ఉంటారు. అప్పుడు ఈ దేశం యెహోవా సన్నిధిలో మీకు వారసత్వం అవుతుంది.
23 మీరు అలా చేయకపోతే యెహోవా దృష్టికి పాపం చేసిన వారవుతారు కాబట్టి మీ పాపం మిమ్మల్ని పట్టుకొంటుందని తెలుసుకోండి.
24 మీరు మీ పిల్లల కోసం ఊర్లను, మీ పశువుల కోసం దొడ్లను కట్టుకుని మీరు చెప్పిన ప్రకారం చేయండి అన్నాడు.”
25 అందుకు గాదీయులు, రూబేనీయులు మోషేతో “మా యజమానివి నువ్వు ఆజ్ఞాపించినట్టు నీ సేవకులైన మేము చేస్తాం.
26 మా పిల్లలు, భార్యలు, మా ఆవుల మందలు గిలాదు ఊళ్ళలో ఉంటారు.
27 నీ సేవకులైన మేము, అంటే మా సైన్యంలో ప్రతి యోధుడు మా యజమానివి నువ్వు చెప్పినట్టు యెహోవా సన్నిధిలో యుద్ధం చేయడానికి యొర్దాను అవతలికి వస్తాము” అన్నారు.
28 కాబట్టి మోషే వారిని గురించి యాజకుడైన ఎలియాజరుకు, నూను కుమారుడు యెహోషువకు, ఇశ్రాయేలు గోత్రాల్లో పూర్వీకుల వంశాల నాయకులకు ఇలా ఆజ్ఞాపించాడు,
29 “గాదీయులు, రూబేనీయులు అందరూ యెహోవా సన్నిధిలో యుద్ధానికి సిద్దపడి మీతో కూడా యొర్దాను అవతలికి వస్తే, ఆ దేశాన్ని మీరు జయించిన తరవాత మీరు గిలాదు దేశాన్ని వారికి వారసత్వంగా ఇవ్వాలి.
30 కాని వారు యుద్ధానికి సిద్ధపడి మీతో కలిసి అవతలకి రాకపోతే వారు కనాను దేశంలో మీ మధ్యనే వారసత్వం పొందుతారు”
31 దానికి గాదీయులు, రూబేనీయులు “యెహోవా నీ సేవకులైన మాతో చెప్పినట్టే చేస్తాం.
32 మేము యెహోవా సన్నిధిలో యుద్ధానికి సిద్ధపడి నది దాటి కనాను దేశంలోకి వెళ్తాం. అప్పుడు యొర్దాను ఇవతల మేము వారసత్వం పొందుతాం” అని జవాబిచ్చారు.
33 అప్పుడు మోషే వారికి, అంటే గాదీయులకు, రూబేనీయులకు, యోసేపు కుమారుడు మనష్షే అర్థగోత్రం వారికి, అమోరీయుల రాజైన సీహోను రాజ్యాన్ని, బాషాను రాజైన ఓగు రాజ్యాన్ని, వాటి ఊళ్ళన్నిటినీ ఆ దేశాల చుట్టూ ఉన్న గ్రామాలనూ ఇచ్చాడు.
34 గాదీయులు దీబోను, అతారోతు, అరోయేరు, అత్రోతు, షోపాను,
35 యాజెరు, యొగ్బెహ, బేత్నిమ్రా, బేత్హారాను
36 అనే ఊళ్ళలో ప్రాకారాలు, పశువుల దొడ్లు కట్టుకున్నారు.
37 రూబేనీయులు హెష్బోను, ఏలాలే, కిర్యతాయిము, నెబో, బయల్మెయోను,
38 షిబ్మా అనే ఊళ్లు కట్టి, వాటికి కొత్త పేర్లు పెట్టారు.
39 మనష్షే సంతానం అయిన మాకీరీయులు గిలాదుపై దండెత్తి దాన్ని ఆక్రమించి దానిలోని అమోరీయులను వెళ్లగొట్టారు.
40 మోషే మనష్షే కొడుకు మాకీరుకు గిలాదును ఇచ్చాడు.
41 అతని సంతానం అక్కడ నివసించింది. మనష్షే కొడుకు యాయీరు వెళ్లి అక్కడి గ్రామాలను ఆక్రమించి వాటికి యాయీరు గ్రామాలు అని పేరు పెట్టాడు.
42 నోబహు వెళ్లి కెనాతును దాని గ్రామాలను ఆక్రమించి దానికి నోబహు అని తన పేరు పెట్టాడు.