ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
గ్రంథకర్త
ఈ పత్రిక తాను రాశాడని (1:1) చెప్పాడు. అంతర్గత లక్షణాలు, శైలి, చారిత్రిక అంశాలు దీన్ని దృఢపరుస్తున్నాయి. అది సంఘం కూడా ఈ పత్రిక రచన, అధికారం పౌలుదేనని వక్కాణించింది. ఫిలిప్పి పత్రిక క్రీస్తు మనస్సును ఆవిష్కరించింది (2:1-11). ఈ లేఖ రాసినప్పుడు పౌలు ఖైదీ అయినప్పటికీ అతడు పూర్ణానందం తో ఉన్నాడు. కష్టాల కడలిలో, బాధల్లో సైతం క్రైస్తవులు ఆనందంగా ఉండగలరని ఫిలిప్పి పత్రిక నేర్పిస్తున్నది. క్రీస్తులోని నిరీక్షణ మూలంగా మనం ఆనందంగా ఉండగలం.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 60 - 63 మధ్యభాగం
రోమ్ లో చెరలో ఉండి పౌలు ఈ పత్రిక రాశాడు. (అపో. కా. 28-30). ఈ పత్రికను ఎపఫ్రోదితు ఫిలిప్పి సంఘానికి తీసుకుపోవాలి. ఇతడు ఫిలిప్పి సంఘం నుంచి పౌలుకు ఆర్ధిక సాయం తీసుకుని వచ్చాడు. (2:25; 4:18). అయితే అతడు రోమ్ లో ఉన్న కాలంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తిరుగు ప్రయాణం ఆలస్యం అయింది. అందుకని పౌలు ఇతని ద్వారా ఈ లేఖ పంపుతున్నాడు (2:26-27).
స్వీకర్త
ఫిలిప్పి నగరంలోని క్రైస్తవ సంఘం. ఇది మాసిడోనియా జిల్లాలో ప్రధాన నగరం.
ప్రయోజనం
చెరలో తన పరిస్థితులు (1:12-26), విడుదల గనక కలిగితే తన పథకాలు (1:23 24) ఫిలిప్పి విశ్వాసులకు తెలియజేయాలని పౌలు ఆశించాడు. సంఘంలో కొన్ని విభేదాలు, విరోధాలు ఉన్నట్టు కనిపించింది. అందువల్ల అపోస్తలుడు సంఘ ఐక్యత దృష్ట్యా వినయగుణం యొక్క ప్రాముఖ్యతను ప్రోత్సహిస్తూ రాశాడు (2:1-18; 4:2-3). కాపరి గుణగణాలకు సంబంధించిన సిద్ధాంతం తెలిసిన వాడుగా కొందరు భిన్న బోధకుల హానికరమైన బోధలకు వ్యతిరేకంగా ఈ లేఖ రాశాడు (3:2, 3). తిమోతిని సంఘానికి పరిచయం చెయ్యడానికి, ఎపఫ్రోదితు ఆరోగ్య పరిస్థితి, అతని ఉద్దేశాలు తెలియజేయడానికి పులు ఈ లేఖ రాశాడు. సంఘం పంపిన కానుకలను బట్టి వారికి కృతజ్ఞతలు తెలిపాడు (4:10-20).
ముఖ్యాంశం
ఆనంద జీవనం
విభాగాలు
1. అభినందనలు — 1:1, 2
2. పౌలు స్థితి, సంఘానికి ప్రోత్సాహం — 1:3-2:30
3. భిన్న బోధల విషయంలో హెచ్చరికలు — 3:1-4:1
4. అంతిమ ప్రోత్సాహ వాక్కులు — 4:2-9
5. కృతజ్ఞతలు — 4:10-20
6. చివరి శుభాకాంక్షలు — 4:21-23
1
విశ్వాసికి జీవం క్రీస్తే
1 ఫిలిప్పీ పట్టణంలో క్రీస్తు యేసుకు చెందిన పరిశుద్ధులందరికీ సంఘ నాయకులకూ పరిచారకులకూ క్రీస్తు యేసు దాసులైన పౌలు, తిమోతి రాస్తున్న సంగతులు.
2 మన తండ్రి దేవుని నుండీ ప్రభువైన యేసు క్రీస్తు నుండీ మీకు కృపా, శాంతీ కలుగు గాక.
3 నేను మిమ్మల్ని ఎప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా నా దేవునికి వందనాలు చెబుతాను.
4 మీ కోసం నేను ప్రార్థించే ప్రతిసారీ అది ఆనందభరితమైన ప్రార్థనే.
5 సువార్త విషయంలో మొదటి రోజు నుంచి ఇప్పటి వరకూ మీ సహవాసానికి వందనాలు.
6 మీలో ఈ మంచి పని మొదలు పెట్టినవాడు యేసు క్రీస్తు తిరిగి వచ్చే రోజు వరకూ ఆ పని కొనసాగించి పూర్తి చేస్తాడు. ఇది నా గట్టి నమ్మకం.
7 మిమ్మల్ని గురించి నేనిలా భావించడం సబబే. ఎందుకంటే మీరు నా హృదయంలో ఉన్నారు. నేను ఖైదులో ఉన్నప్పుడూ, నేను సువార్త పక్షంగా వాదిస్తూ నిరూపిస్తున్నపుడు మీరంతా ఈ కృపలో నాతో పాలివారుగా ఉన్నారు.
8 క్రీస్తు యేసు ప్రేమ లోతుల్లో నుంచి, మీ కోసం నేనెంత తపిస్తున్నానో దేవుడే నాకు సాక్షి.
హింసలపై విజయం సాధించిన ఆనందం
9 మీ ప్రేమ జ్ఞానంతో, సంపూర్ణ వివేచనతో అంతకంతకూ వృద్ధి చెందుతూ ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.
10 దేవునికి మహిమ, స్తుతి కలిగేలా మీరు శ్రేష్ఠమైన విషయాలను పరీక్షించి తెలుసుకుని, యేసు క్రీస్తు ద్వారా కలిగే నీతిఫలాలతో నిండి, క్రీస్తు వచ్చే రోజు వరకూ యథార్థంగా నిర్దోషంగా ఉండాలన్నదే నా ప్రార్థన
11 అంతేకాక దేవునికి మహిమ, స్తుతి కలిగేలా, మీరు యేసు క్రీస్తు ద్వారా కలిగే నీతి ఫలాలతో నిండి ఉండాలి.
12 సోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా వ్యాపించడానికే అని మీరు తెలుసుకోవాలని ఇప్పుడు కోరుతున్నాను.
13 ఎలాగంటే, నా సంకెళ్ళు క్రీస్తు కోసమే కలిగాయని రాజ భవనం కావలి వారికీ తక్కిన వారందరికీ తెలిసిపోయింది.
14 అంతేకాక, ప్రభువులోని సోదరుల్లో ఎక్కువమంది నా బంధకాలను బట్టి స్థిర విశ్వాసం కలిగి, నిర్భయంగా దేవుని వాక్కు ప్రకటించడానికి ఎక్కువ ధైర్యం తెచ్చుకున్నారు.
15 కొంతమంది అసూయతో కలహబుద్ధితో, మరి కొంతమంది మంచి ఉద్దేశంతో క్రీస్తును ప్రకటిస్తున్నారు.
16 ప్రేమతో క్రీస్తును ప్రకటించేవారికి నేను సువార్త పక్షాన వాదించడానికి నియామకం పొందానని తెలుసు.
17 అయితే మిగతా వారు బంధకాల్లో ఉన్న నాకు మరింత బాధ కలిగించాలని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు.
18 అయితేనేం? కపటంతో గానీ సత్యంతో గాని, ఎలాగైనా క్రీస్తును ప్రకటించడం మాత్రం జరుగుతూ ఉంది. అందుకు నేను ఆనందిస్తున్నాను. ఇక ముందు కూడా ఆనందిస్తాను.
19 మీ ప్రార్థనల వలన, యేసు క్రీస్తు ఆత్మసాయం వలన, నా విడుదల కోసం ఇదంతా జరుగుతూ ఉందని నాకు తెలుసు.
20 నేను ఏ విషయంలోనైనా సిగ్గుపాలు కానని నాకు నిబ్బరమైన ఆశాభావం ఉంది. అయితే, ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా నా జీవితం వలన గానీ, చావు వలన గానీ క్రీస్తును నా శరీరంతో ఘనపరుస్తాను అనే ధైర్యం ఉంది.
21 నావరకైతే బతకడం క్రీస్తే, మరి చావడం లాభమే.
22 అయినా శరీరంలో నేనింకా బతుకుతూ నా ప్రయాసకు ఫలితం ఉంటే, అప్పుడు నేనేం కోరుకోవాలో నాకు తెలియడం లేదు.
23 ఈ రెండింటి మధ్య ఇరుక్కుపోయాను. నేను లోకాన్ని విడిచి క్రీస్తుతోనే ఉండిపోవాలని నా కోరిక. అన్నిటికంటే అదే ఉత్తమం.
24 అయినా నేను శరీరంతో ఉండడం మీకోసం మరింత అవసరం.
25-26 తద్వారా, నేను మీ దగ్గరికి తిరిగి రావడంవల్ల క్రీస్తు యేసులో నన్ను బట్టి మీరు గర్వ పడతారు. మీరు విశ్వాసంలో అభివృద్ధి, ఆనందం పొందడానికి నేను జీవిస్తూ మీ అందరితో ఉంటానని నాకు గట్టి నమ్మకం ఉంది.
27 నేను మిమ్మల్ని చూడడానికి వచ్చినా, రాకపోయినా, అందరూ కలిసికట్టుగా సువార్త విశ్వాసం పక్షంగా పోరాడుతూ, ఏక భావంతో నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినేలా, మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి.
28 మిమ్మల్ని ఎదిరించే వారికి ఏ విషయంలోనూ భయపడవద్దు. మీ ధైర్యం వారికి నాశనం, మీకు రక్షణ కలుగుతాయని తెలిపే సూచన. ఇది దేవుని వలన కలిగే విడుదల.
29-30 గతంలో నేను సాగించిన పోరాటాన్ని చూసారు. దాన్ని గురించి వింటున్నారు. మీరు కూడా అదే పోరాటంలో ఉన్నారు. కాబట్టి దేవుడు మీకు కేవలం క్రీస్తును విశ్వసించే అవకాశమే కాకుండా, ఆయన కోసం కష్టాలు అనుభవించే అవకాశం కూడా కలిగించాడు.