22
ప్రధాన సంగీతకారుని కోసం, అయ్యలెతు షహరు (జింకల లయ) రాగంలో దావీదు కీర్తన.
నా దేవా, నా దేవా, నువ్వు నన్నెందుకు విడిచిపెట్టేశావు? నన్ను రక్షించడానికీ, నా వేదన వాక్కులు వినడానికీ, నువ్వు దూరంగా ఎందుకున్నావు?
నా దేవా, పగలు నేను మొరపెడతాను, కాని నువ్వు జవాబివ్వవు. రాత్రివేళ నేను మౌనంగా ఉండను!
నువ్వు పవిత్రుడవు. ఇశ్రాయేలు చేసే స్తుతులతో రాజుగా సింహాసనం మీద కూర్చుని ఉంటావు.
మా పితరులు నీలో నమ్మకం ఉంచారు. నువ్వు వాళ్ళను రక్షించావు.
వాళ్ళు నీకు మొరపెట్టినప్పుడు విడుదల పొందారు. వాళ్ళు నీలో నమ్మకం ఉంచి నిరుత్సాహపడలేదు.
కాని నేను మనిషిని కాదు. పురుగును. మనుషుల ద్వేషం అనుభవించాను, మానవాళికి అవమానంగా ఉన్నాను.
నన్ను చూసిన వాళ్ళందరూ నన్ను ఆక్షేపిస్తున్నారు. నన్ను వెక్కిరిస్తూ, నన్ను చూసి తలలు ఆడిస్తున్నారు.
అతడు యెహోవాలో నమ్మకం పెట్టుకున్నాడు, యెహోవా అతన్ని రక్షించనివ్వండి. అతడు ఆయనలో ఆనందిస్తున్నాడు గనక యెహోవా అతన్ని రక్షించనివ్వండి, అని వాళ్ళు అంటున్నారు.
ఎందుకంటే గర్భంలోనుంచి నన్ను తీసిన వాడివి నువ్వే. నేను నా తల్లి రొమ్ములపై ఉన్నప్పుడే నీపై నమ్మకం పుట్టించావు.
10 గర్భంలో ఉండగానే నేను నీ మీద ఆధారపడ్డాను. నేను నా తల్లి కడుపులో ఉన్నప్పటినుంచి నువ్వే నా దేవుడివి.
11 ఆపద ముంచుకు వచ్చింది. నాకు దూరంగా ఉండకు. నాకు సహాయం చేసేవాళ్ళు లేరు.
12 చాలా ఎద్దులు, బలమైన బాషాను దేశపు వృషభాలు నన్ను చుట్టుముట్టాయి.
13 వేటను చీలుస్తూ, గర్జిస్తూ ఉన్న సింహంలాగా వాళ్ళు తమ నోళ్లు పెద్దగా తెరిచారు.
14 నన్ను నీళ్ళలా పారబోస్తున్నారు. నా ఎముకలన్నీ స్థానం తప్పాయి.
నా హృదయం మైనంలా ఉంది. నా అంతర్భాగాల్లో అది కరిగిపోతూ ఉంది.
15 నా బలం* చిల్లపెంకులా ఎండిపోయింది. నా నాలుక నా దవడకు అంటుకుంటూ ఉంది. మరణ ధూళిలో నువ్వు నన్ను పడుకోబెట్టావు.
16 కుక్కలు నన్ను చుట్టుముట్టాయి, దుష్టులు గుంపుగూడి నన్ను ఆవరించారు. వాళ్ళు నా చేతులను నా పాదాలను పొడిచారు.
17 నా ఎముకలన్నీ నేను లెక్కపెట్టగలను. వాళ్ళు నా వైపు తేరి చూస్తున్నారు.
18 నా వస్త్రాలు పంచుకుంటున్నారు. నా అంగీ కోసం చీట్లు వేస్తున్నారు.
19 యెహోవా, దూరంగా ఉండకు. నా బలమా, త్వరపడి నాకు సహాయం చెయ్యి.
20 ఖడ్గం నుంచి నా ప్రాణాన్ని, కుక్కల పంజాలనుంచి నా విలువైన ప్రాణాన్ని రక్షించు.
21 సింహం నోటి నుండి నన్ను రక్షించు. అడవిదున్న కొమ్ములనుంచి నన్ను రక్షించు.
22 నీ నామం నా సోదరులకు ప్రచారం చేస్తాను. సమాజం మధ్య నిన్ను స్తుతిస్తాను.
23 యెహోవా పట్ల భయం ఉన్నవారలారా, ఆయన్ని స్తుతించండి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయన్ని ఘనపరచండి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయన్ని చూసి విస్మయం చెందండి.
24 ఆయన బాధపడే వాళ్ళ బాధను తృణీకరించలేదు, వాళ్ళను చూసి ఆయన అసహ్యపడలేదు. అతనినుంచి తన ముఖం దాచుకోలేదు. బాధలో ఉన్నవాడు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించాడు.
25 మహా సమాజంలో నీ నుండి నా స్తుతి వస్తుంది. ఆయనపట్ల భయభక్తులు కలిగిన వారి ఎదుట నా మొక్కుబడులు చెల్లిస్తాను.
26 బాధితులు భోజనం చేసి తృప్తి పొందుతారు. యెహోవాను వెదికేవాళ్ళు ఆయనను స్తుతిస్తారు. వారి హృదయాలు శాశ్వతకాలం జీవిస్తాయి గాక.
27 భూనివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా వైపు తిరుగుతారు. జాతుల కుటుంబాలన్నీ ఆయన§ ఎదుట వంగి నమస్కారం చేస్తాయి.
28 ఎందుకంటే రాజ్యం యెహోవాదే. జాతులను పాలించేవాడు ఆయనే.
29 భూమి మీద వర్ధిల్లుతున్న వాళ్ళందరూ *ఆరాధిస్తారు. తమ సొంత ప్రాణాలు కాపాడుకోలేని వాళ్ళు, మట్టిలోకి దిగిపోతున్న వాళ్ళందరూ ఆయన ఎదుట వంగి నమస్కరిస్తారు.
30 రానున్న ఒక తరం వాళ్ళు ఆయన్ని సేవిస్తారు. తమ తరవాతి తరానికి ప్రభువును గురించి చెబుతారు.
31 వాళ్ళు వచ్చి ఆయన న్యాయ విధానం గురించి చెబుతారు. ఆయన క్రియలను ఇంకా పుట్టని వారికి చెబుతారు!
* 22:15 నా బలం నా గొంతు 22:21 రక్షించు ఆయన సమాధానం ఇస్తాడు 22:26 వారి మీ § 22:27 ఆయన నీ * 22:29 విందు భోజనం తిని