53
ప్రధాన సంగీతకారుని కోసం. మహలతు రాగంలో దావీదు రాసిన దైవధ్యానం.
దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. వారు చెడిపోయారు, అసహ్యకార్యాలు చేస్తారు. మంచి జరిగించేవాడు ఒక్కడూ లేడు.
జ్ఞానం కలిగి తనను వెదికేవారు ఉన్నారేమో అని దేవుడు ఆకాశం నుండి మనుషులను పరిశీలించాడు.
వారంతా దారి తప్పి పూర్తిగా చెడిపోయారు. మంచి చేసే వాడు లేడు. ఒక్కడూ లేడు.
వారు దేవునికి ప్రార్థన చేయరు. వారు నా ప్రజలను దోచుకున్నారు*. వారికి ఏమీ తెలియడం లేదా?
భయకారణం లేకుండానే వారు భయభ్రాంతులయ్యారు. ఎందుకంటే నీకు వ్యతిరేకంగా పోగయ్యే వారి ఎముకలను దేవుడు విరగ్గొడతాడు. దేవుడు వారిని తోసిపుచ్చాడు కాబట్టి వారు సిగ్గుపడతారు.
సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగుతుంది. దేవుడు తన ప్రజలను చెరలో నుండి వెనక్కి రప్పించేటప్పుడు యాకోబు సంతానం హర్షిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు సంతోషిస్తారు.
* 53:4 వారు నా ప్రజలను దోచుకున్నారు రొట్టెను తిన్నట్టుగా నా ప్రజలను తినేస్తూ దుర్మార్గం జరిగిస్తారు