27
యూదా రాజైన యోతాము
27:1-4, 7-9; 2రాజులు 15:33-38
1 యోతాము పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు అతనికి 25 ఏళ్ళు. అతడు యెరూషలేములో 16 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి సాదోకు కుమార్తె. ఆమె పేరు యెరూషా.
2 యెహోవా మందిరంలో ప్రవేశించడం తప్ప అతడు తన తండ్రియైన ఉజ్జియా చేసిన ప్రకారమే చేస్తూ యెహోవా దృష్టికి యధార్థంగా ప్రవర్తించాడు. అతని కాలంలో ప్రజలు మరింత దుర్మార్గంగా ప్రవర్తించారు.
3 అతడు యెహోవా మందిర పై ద్వారాన్ని కట్టించి ఓపెలు దగ్గర ఉన్న గోడను చాలావరకూ కట్టించాడు.
4 అతడు యూదా కొండప్రాంతంలో పట్టణాలనూ, అరణ్య ప్రాంతంలో కోటలనూ, బురుజులనూ కట్టించాడు.
5 అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధం చేసి జయించాడు కాబట్టి అమ్మోనీయులు ఆ సంవత్సరం అతనికి 3, 400 కిలోల వెండినీ, అరవై రెండు వేల తూముల గోదుమలనూ, అరవై రెండు వేల తూముల బార్లీ ధాన్యాన్ని చెల్లించారు. అమ్మోనీయులు రెండవ సంవత్సరం మూడవ సంవత్సరం కూడా అంతే సొమ్ము అతనికి చెల్లించారు.
6 యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యధార్థం ప్రవర్తించాడు కాబట్టి అతడు శక్తిమంతుడయ్యాడు
7 యోతాము గురించిన ఇతర విషయాలు, అతడు చేసిన యుద్దాలన్నిటినీ గురించి, అతని పద్ధతులను గురించి, ఇశ్రాయేలు, యూదారాజుల గ్రంథంలో రాసివున్నాయి.
8 అతడు పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు 25 ఏళ్ల వాడై యెరూషలేములో 16 ఏళ్ళు పాలించాడు.
9 యోతాము కన్ను మూసి తన పూర్వికుల దగ్గరికి చేరాడు. అతణ్ణి దావీదు పట్టణంలో పాతిపెట్టారు. అతని కొడుకు ఆహాజు అతనికి బదులు రాజయ్యాడు.