5
క్రీస్తు మంచి సేవకుని క్రియలు
1 వయసులో పెద్దవాణ్ణి కఠినంగా మందలించ వద్దు. అతనిని తండ్రిగా భావించి హెచ్చరించు.
2 యువకులను సోదరులుగా, వయసు పైబడిన స్త్రీలను తల్లులుగా, యువతులను సోదరీలుగా ఎంచి పూర్ణ పవిత్రతతో హెచ్చరించు.
3 నిజమైన వితంతువులను గౌరవించు.
4 అయితే ఏ వితంతువుకైనా పిల్లలు గాని, మనవలు గాని ఉంటే, వీరు మొదట తమ ఇంటివారి పట్ల తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడం నేర్చుకోవాలి. ఇది దేవునికి ఎంతో ఇష్టం.
5 నిజంగా వితంతువు ఒక్కతే ఉండి, దేవుని మీదనే తన నమ్మకం పెట్టుకుని, ఆయన సాయం కోసం రేయింబగళ్ళు ప్రార్ధిస్తూ, విన్నపాలు చేస్తూ ఉంటుంది.
6 అయితే విలాసాల్లో బతికే వితంతువు బతికి ఉన్నా చచ్చినట్టే.
7 వారు నింద పాలు కాకుండేలా వీటిని కూడా బోధించు.
8 ఎవడైనా తన బంధువులను, మరి ముఖ్యంగా తన స్వంత ఇంటివారిని పోషించకపోతే వాడు విశ్వాసాన్ని వదులుకున్న వాడు. అలాటివాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు.
9 అరవై ఏళ్ళ కంటే ఎక్కువ వయస్సు ఉండి, గతంలో ఒక్క పురుషుడికే భార్యగా ఉన్న స్త్రీని మాత్రమే విధవరాలిగా నమోదు చెయ్యి.
10 ఆమె మంచి పనుల్లో పేరు పొంది ఉండాలి. అంటే, పిల్లలను పెంచడం, ఆతిథ్యం ఇవ్వడం, పవిత్రుల పాదాలు కడగడం, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడం, లేదా ప్రతి మంచి పనీ చేయడానికి పూనుకుని ఉండడం. అలాటి వారిని విధవరాళ్ళ జాబితాలో చేర్చవచ్చు.
11 పడుచు వితంతువులను లెక్కలో చేర్చవద్దు. క్రీస్తుకు విరోధంగా వారి వాంఛలు ఎక్కువైపోతే పెళ్ళి చేసుకోవాలనుకుంటారు.
12 ఇలా వారు తమ మొదటి నిర్ణయాన్ని వదిలేసి తమ మీదికి అపరాధం తెచ్చుకుంటారు.
13 వారు ఇంటింటికీ తిరుగుతూ, సోమరులవుతారు. అంతేగాక, వారు పనికిమాలిన మాటలు మాటలాడుతూ, వాగుడుకాయలై ఇతరుల విషయాల్లో తల దూర్చేవారుగా తయారవుతారు.
14 కాబట్టి యువతులు పెళ్ళి చేసుకుని పిల్లలను కని ఇంటి పనులు చూసుకుంటూ, శత్రువుకు నిందించే అవకాశమివ్వకుండా ఉండాలని నా ఉద్దేశం.
15 ఇప్పటికే కొంతమంది దారి తప్పి సాతాను వెంట వెళ్ళిపోయారు.
16 ఏ విశ్వాసురాలి ఇంట్లోనైనా వితంతువులు ఉంటే, వారి గురించిన భారం సంఘానికి లేకుండా ఆమె తానే వారికి సహాయం చేయాలి.
17 చక్కగా నడిపించే పెద్దలను, ముఖ్యంగా వాక్యోపదేశంలో, బోధలో కష్టపడే వారిని, రెండింతలు గౌరవానికి యోగ్యులుగా పరిగణించాలి.
18 ఇందుకు అనుగుణంగా లేఖనంలో, “కళ్ళం నూర్చే ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు” అనీ, “పనివాడు తన జీతానికి అర్హుడు” అనీ ఉంది.
19 ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనే తప్ప సంఘ పెద్ద మీద నిందారోపణ అంగీకరించ వద్దు.
20 మిగతా వారు భయపడేలా పాపం చేసిన వారిని అందరి ఎదుటా గద్దించు.
21 విరోధ బుద్ధితో గానీ భేద భావంతో గానీ ఏమీ చేయక ఈ నియమాలను పాటించాలని దేవుని ఎదుటా, క్రీస్తు యేసు ఎదుటా, దేవుడు ఎన్నుకున్న దూతల ఎదుటా నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను.
22 ఎవరి మీదా త్వరపడి చేతులుంచవద్దు. ఇతరుల పాపాల్లో భాగం పంచుకోవద్దు. నిన్ను నీవు పవిత్రునిగా ఉండేలా చూసుకో.
23 ఇక నుండి నీళ్ళు మాత్రమే గాక నీ కడుపులో తరచుగా వచ్చే వ్యాధి కోసం కొద్దిగా ద్రాక్షారసం తాగు.
24 కొందరి పాపాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. అవి వారి తీర్పుకు ముందే నడుస్తున్నాయి. మరి కొంతమంది పాపాలు వారి వెంటే వెళుతున్నాయి.
25 అలాగే కొన్ని మంచి పనులు స్పష్టంగా కనిపిస్తాయి. మిగిలిన వాటిని సైతం దాచి ఉంచడం సాధ్యం కాదు.