6
1 నేను సూర్యుని క్రింద మరొక చెడు చూశాను, అది మనుష్యజాతి మీద ఎంతో భారంగా ఉంది.  
2 దేవుడు కొందరికి ధనం, ఆస్తి, గౌరవం ఇస్తారు, తద్వార వారి హృదయాలు కోరుకున్నవేవి వారికి కొదువగా ఉండవు. కాని వాటిని అనుభవించే సామర్థ్యాన్ని వారికి దేవుడు ఇవ్వరు, అపరిచితులు వాటిని అనుభవిస్తారు. ఇదంతా అర్థరహితమే, చెడ్డ విషయమే.   
3 ఒకడు వందమంది పిల్లలను కని అనేక సంవత్సరాలు జీవించినప్పటికీ, అతడు బ్రతికినంత కాలం తన అభివృద్ధిని అనుభవించకపోతే, సరియైన రీతిలో సమాధి చేయబడకపోతే, అతనికంటే గర్భస్రావమైపోయిన పిండమే నయము.  
4 గర్భస్రావమైన పిండం నిరుపయోగంగా వచ్చి చీకటిలోకి వెళ్లిపోతుంది, చీకటిలో దాని పేరు కప్పబడుతుంది.  
5 అది ఎన్నడు సూర్యుని చూడకపోయినా దానికి ఏమి తెలియకపోయినా, ఆ మనిషి కన్నా దానికే ఎక్కువ విశ్రాంతి ఉంది.  
6 అతడు రెండువేల సంవత్సరాలు బ్రతికినా తన అభివృద్ధిని అనుభవించలేడు. అందరు వెళ్లేది ఒకే చోటికే కదా?   
7 మనుష్యులు పడే శ్రమ అంతా కడుపు కోసమే,  
అయినా వారి ఆశకు తృప్తి కలగదు.   
8 మూర్ఖుల కంటే జ్ఞానులకున్న ప్రయోజనం ఏముంది?  
ఇతరుల ఎదుట ఎలా జీవించాలో  
తెలుసుకున్న బీదవారికి లాభం ఏంటి?   
9 కోరిక వెంట పడడం కంటే  
కళ్లకు కనిపించేది మేలు.  
అయినా ఇది కూడా అర్థరహితమే.  
గాలికి ప్రయాసపడడమే.   
   
 
10 ఉనికిలో ఉన్నవన్నీ ఇంతకు ముందు తెలిసినవే.  
మనుష్యులు ఎలా ఉంటారో పూర్వం నుండి తెలిసిందే;  
తనకంటే బలవంతుడితో ఎవరు పోరాడలేరు.   
11 మాటలు ఎక్కువ  
అర్థం తక్కువ,  
దానివల్ల ఎవరికి ప్రయోజనం?   
12 నీడలా తమ జీవితకాలాన్ని అర్థరహితంగా గడిపే మనుష్యుల బ్రతుకులో వారికి ఏది క్షేమమో ఎవరికి తెలుసు? వారు గతించాక సూర్యుని క్రింద భూమి మీద ఏం జరుగుతుందో వారికి ఎవరు చెప్తారు?