5
ఆదాము నుండి నోవహు వరకు
1 ఆదాము వంశావళి యొక్క జాబితా ఇదే.
దేవుడు మనుష్యజాతిని సృష్టించినప్పుడు వారిని దేవుని పోలికలో చేశారు.
2 ఆయన వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించారు. ఆయన వారిని ఆశీర్వదించి వారికి “మనుష్యజాతి” అని పేరు పెట్టారు.
3 ఆదాము 130 సంవత్సరాలు జీవించి తన పోలికలో తన స్వరూపంలో ఒక కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాడు.
4 షేతు పుట్టిన తర్వాత ఆదాము 800 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
5 ఆదాము మొత్తం 930 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
6 షేతు 105 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి ఎనోషు పుట్టాడు.
7 ఎనోషు పుట్టిన తర్వాత షేతు 807 సంవత్సరాలు బ్రతికాడు; అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
8 షేతు మొత్తం 912 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
9 ఎనోషు 90 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి కేయినాను పుట్టాడు.
10 కేయినాను పుట్టిన తర్వాత ఎనోషు 815 సంవత్సరాలు బ్రతికాడు; అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
11 ఎనోషు మొత్తం 905 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
12 కేయినాను 70 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి మహలలేలు పుట్టాడు.
13 మహలలేలు పుట్టిన తర్వాత కేయినాను 840 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
14 కేయినాను మొత్తం 910 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
15 మహలలేలు 65 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి యెరెదు పుట్టాడు.
16 యెరెదు పుట్టిన తర్వాత మహలలేలు 830 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
17 మహలలేలు మొత్తం 895 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
18 యెరెదు 162 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి హనోకు పుట్టాడు.
19 హనోకు పుట్టిన తర్వాత యెరెదు 800 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
20 యెరెదు మొత్తం 962 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
21 హనోకు 65 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి మెతూషెల పుట్టాడు.
22 మెతూషెల పుట్టిన తర్వాత హనోకు 300 సంవత్సరాలు బ్రతికి దేవునితో నమ్మకంగా నడిచాడు; ఈ సమయంలో ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
23 హనోకు మొత్తం 365 సంవత్సరాలు జీవించాడు.
24 హనోకు దేవునితో నమ్మకంగా నడిచాడు; తర్వాత ఒక రోజు దేవుడు అతన్ని తీసుకెళ్లారు కాబట్టి అతడు కనబడలేదు.
25 మెతూషెల 187 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి లెమెకు పుట్టాడు.
26 లెమెకు పుట్టిన తర్వాత మెతూషెల 782 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
27 మెతూషెల మొత్తం 969 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
28 లెమెకు 182 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి ఒక కుమారుడు పుట్టాడు.
29 అతనికి నోవహు అని పేరు పెట్టి, “యెహోవా శపించిన ఈ భూమిని సాగుచేయడానికి మనం పడే ప్రయాసలో, మన చేతుల బాధాకరమైన శ్రమలలో ఆయన మనలను ఆదరిస్తారు” అని అన్నాడు.
30 నోవహు పుట్టిన తర్వాత లెమెకు 595 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
31 లెమెకు మొత్తం 777 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
32 నోవహు 500 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి షేము, హాము యాపెతులు పుట్టారు.