12
యోబు 
 
1 అప్పుడు యోబు ఇచ్చిన జవాబు:   
2 నిస్సందేహంగా లోకంలో మీరే జ్ఞానులు,  
మీతో పాటే జ్ఞానం అంతరిస్తుంది!   
3 అయినా మీకున్నట్లే నాకు కూడా గ్రహించే మనస్సు ఉంది,  
నేను మీకేమి తీసిపోను.  
ఈ విషయాలు తెలియనివారు ఎవరు?   
   
 
4 నేను దేవునికి ప్రార్థించగా ఆయన సమాధానం ఇచ్చినప్పటికీ,  
నా స్నేహితుల ముందు నేను నవ్వులపాలయ్యాను,  
నీతిగా నిందారహితంగా ఉన్న నేను నవ్వులపాలయ్యాను.   
5 నిశ్చింతగా ఉన్నవారు అభాగ్యులను తిరస్కరిస్తారు,  
పాదాలు జారిపోతున్న వారి విధిని చూసి ఎగతాళి చేస్తారు.   
6 బందిపోటు దొంగల గుడారాలు ప్రశాంతంగా ఉంటాయి,  
దేవునికి కోపం పుట్టించే వారు సురక్షితంగా ఉంటారు,  
వారి దేవుడు వారి చేతిలోనే ఉన్నాడు.   
   
 
7 కాని జంతువులను అడగండి అవి మీకు బోధిస్తాయి,  
ఆకాశంలోని పక్షులను అడగండి అవి మీకు చెప్తాయి.   
8 భూమితో మాట్లాడండి అది మీకు బోధిస్తుంది,  
సముద్రంలోని చేపలు మీకు తెలియచేస్తాయి.   
9 వీటన్నిటిని యెహోవా హస్తం చేసిందని  
తెలుసుకోలేనివారు ఎవరు?   
10 ఆయన చేతిలో జీవులన్నిటి ప్రాణం  
మానవులందరి ఊపిరి ఉంది.   
11 నాలుక ఆహారం రుచిని చూసినట్లు  
చెవి మాటలను పరిశీలించదా?   
12 వృద్ధుల దగ్గర జ్ఞానం దొరకదా?  
దీర్ఘాయువు గ్రహింపును తీసుకురాదా?   
   
 
13 జ్ఞానం శక్తి దేవునికి చెందినవి;  
ఆలోచన గ్రహింపు ఆయనవే.   
14 దేవుడు పడగొట్టిన దానిని తిరిగి కట్టలేరు;  
ఆయన బంధించిన వారిని ఎవరూ విడిపించలేరు.   
15 ఆయన జలాలను ఆపేస్తే అవి ఎండిపోతాయి;  
ఆయన వాటిని వదిలేస్తే అవి భూమిని వరదలతో నాశనం చేస్తాయి.   
16 బలం వివేకం ఆయనకు చెందినవే;  
మోసపోయేవారు మోసగించేవారు ఆయన వారే.   
17 ఆయన ఆలోచనకర్తలను దిగంబరులుగా నడిపిస్తారు,  
న్యాయాధిపతులను బుద్ధిహీనులుగా చేస్తారు.   
18 ఆయన రాజులు వేసిన సంకెళ్ళు తీసివేస్తారు  
వారి నడుము చుట్టూ తాడు కడతాడు.   
19 యాజకులను దిగంబరులుగా చేసి నడిపిస్తారు,  
స్థిరంగా పాతుకుపోయిన అధికారులను పడగొడతారు.   
20 నమ్మకమైన సలహాదారుల మాటలను నిరర్థకం చేస్తారు,  
పెద్దల వివేచనను తీసివేస్తారు.   
21 ఆయన అధిపతుల మీద అవమానాన్ని కురిపిస్తారు,  
బలవంతులను నిరాయుధులనుగా చేస్తారు.   
22 ఆయన చీకటిలోని లోతైన విషయాలను వెల్లడిస్తారు  
చిమ్మ చీకటిని వెలుగులోకి తెస్తారు.   
23 ఆయన దేశాలను గొప్ప చేస్తారు వాటిని నాశనం చేస్తారు;  
దేశాలను విశాలపరుస్తారు వాటిని చెదరగొడతారు.   
24 ఆయన భూలోక నాయకుల గ్రహింపును తీసివేస్తారు;  
వారు దారిలేని ఎడారిలో తిరుగులాడేలా చేస్తారు.   
25 వారు వెలుగు లేదా చీకటిలో తడబడతారు;  
ఆయన వారిని త్రాగుబోతు తూలినట్లు తూలేలా చేస్తారు.