19
యోబు 
 
1 అప్పుడు యోబు ఇచ్చిన జవాబు:   
2 “ఎంతకాలం మీరు నన్ను వేధించి  
మాటలతో నలుగగొడతారు?   
3 ఇప్పటికి పదిసార్లు మీరు నన్ను నిందించారు;  
సిగ్గులేకుండా మీరు నాపై దాడి చేశారు.   
4 ఒకవేళ నేను తప్పు చేసినట్లైతే  
నా తప్పు నా మీదికే వస్తుంది.   
5 మిమ్మల్ని మీరు నా కంటే హెచ్చించుకొని  
నా మీద నా అవమానాన్ని మోపితే,   
6 దేవుడు నాకు అన్యాయం చేశారని  
నా చుట్టూ ఆయన తన వల వేశారని తెలుసుకోండి.   
   
 
7 “నాపై ‘దౌర్జన్యం జరుగుతుంది’ అని నేను మొరపెట్టినా నాకు జవాబు రాదు;  
సహాయం చేయమని అడిగినా నాకు న్యాయం జరుగదు.   
8 నేను దాటకుండా ఆయన నా దారిని మూసివేశారు;  
నా త్రోవలను చీకటితో కప్పివేశారు.   
9 ఆయన నా గౌరవాన్ని తొలగించారు.  
నా తలపై నుండి కిరీటాన్ని తీసివేశారు.   
10 నేను నశించే వరకు అన్నివైపులా ఆయన నన్ను విరగ్గొట్టారు;  
చెట్టును పెల్లగించినట్లు ఆయన నా నిరీక్షణను పెల్లగించారు.   
11 నా మీద ఆయన కోపం రగులుకుంది;  
ఆయన నన్ను తన శత్రువుగా భావించారు.   
12 ఆయన సైన్యాలన్నీ ఒక్కటిగా వచ్చి,  
నాకు విరోధంగా ముట్టడి దిబ్బలు వేసి  
నా గుడారం చుట్టూ మకాం వేశారు.   
   
 
13 “ఆయన నా సహోదరులను నాకు దూరం చేశారు;  
నా పరిచయస్థులందరూ నాకు పూర్తిగా పరాయివారయ్యారు.   
14 నా బంధువులు నా నుండి దూరంగా వెళ్లిపోయారు;  
నా ప్రాణస్నేహితులు నన్ను మరచిపోయారు.   
15 నా అతిథులకు నా ఇంటి పనికత్తెలకు నేను విదేశీయునిగా ఉన్నాను;  
పరాయివానిగా చూసినట్లు వారు నన్ను చూస్తున్నారు.   
16 నేను పనివాన్ని పిలిచినా, నేను వాన్ని బ్రతిమాలినా,  
వాడు పలకడం లేదు.   
17 నా శ్వాస కూడా నా భార్యకు అసహ్యం కలిగిస్తుంది;  
నా కుటుంబం నన్ను అసహ్యించుకుంటుంది.   
18 చిన్నపిల్లలు కూడా నన్ను దూషిస్తున్నారు;  
నేను కనిపిస్తే నన్ను ఎగతాళి చేస్తున్నారు.   
19 నా ప్రాణస్నేహితులంతా నన్ను అసహ్యించుకుంటున్నారు;  
నేను ప్రేమించినవారు నా మీద తిరగబడుతున్నారు.   
20 నేను అస్థిపంజరంలా తయారయ్యాను.  
నా పళ్ల చిగుళ్ళ పైచర్మం మాత్రమే మిగిలి ఉంది.   
   
 
21 “జాలి పడండి, నా స్నేహితులారా, నాపై జాలి చూపండి  
ఎందుకంటే దేవుని హస్తం నన్ను మొత్తింది.   
22 దేవుడు వెంటాడినట్లు మీరు కూడా నన్నెందుకు వెంటాడుతున్నారు?  
నా శరీరం నాశనమైపోయింది, ఇది చాలదా?   
   
 
23 “నా మాటలు ఒక గ్రంథపుచుట్టలో,  
వ్రాయబడి ఉంటే బాగుండేది!   
24 అవి నిత్యం ఉండేలా ఇనుపగంటతో రాతి మీద చెక్కి  
సీసంతో నింపితే బాగుండేది!   
25 నా విమోచకుడు సజీవుడని,  
తుదకు ఆయన భూమి మీద నిలబడతారని నాకు తెలుసు.   
26 నా చర్మం నాశనమైపోయిన తర్వాత  
నా శరీరంతో నేను దేవుని చూస్తాను.   
27 మరొకరు కాదు, నేనే  
నా కళ్ళతో స్వయంగా దేవుని చూస్తాను.  
నా హృదయం నాలో ఎంత ఆరాటపడుతుంది!   
   
 
28 “ఒకవేళ మీరు, ‘దీనికంతటికి మూలకారణం అతనిలోనే ఉంది,  
అతన్ని మనమెలా వేటాడాలి’ అని అనుకుంటే,   
29 మీరు ఖడ్గానికి భయపడాలి;  
ఎందుకంటే కోపమనే ఖడ్గం శిక్షను విధిస్తుంది,  
అప్పుడు మీరు తీర్పు ఉందని తెలుసుకుంటారు.”