41
1 “లెవియాథన్ ను చేపగాలంతో లాగగలవా?  
త్రాడుతో దాని నాలుకను కట్టగలవా?   
2 దాని జమ్ము తాడును ముక్కుకు వేయగలవా?  
దవడకు గాలం ఎక్కించగలవా?   
3 దయచూపమని అది నిన్ను వేడుకుంటుందా?  
మృదువైన మాటలు నీతో మాట్లాడుతుందా?   
4 జీవితాంతం నీవు దానిని బానిసగా ఉంచుకునేలా  
అది నీతో ఒప్పందం చేసుకుంటుందా?   
5 ఒక పక్షితో ఆడుకున్నట్లు నీవు దానితో ఆడుకుంటావా?  
నీ ఇంట్లోని అమ్మాయిలు ఆడుకోడానికి దానిని కట్టి ఉంచగలవా?   
6 వ్యాపారులు దానితో పరివర్తకం చేస్తారా?  
వారు దానిని ముక్కలుగా కోసి వ్యాపారులకు అమ్ముతారా?   
7 దాని చర్మం నిండా బల్లెములను గుచ్చగలవా?  
చేపలను పట్టే ఈటెలతో దాని తల నిండా పొడవగలవా?   
8 నీవు దాని మీద చేయి వేసి చూడు,  
దానితో చేసే పోరాటాన్ని జ్ఞాపకం చేసుకుని మళ్ళీ అలా చేయవు.   
9 దానిని వశపరుచుకోవాలనే ఆశ అబద్ధం;  
కేవలం దానిని చూస్తే చాలు ఎవరైనా భయపడిపోతారు.   
10 దానిని లేపే సాహసం ఎవరు చేయలేరు.  
అలాంటప్పుడు నా ఎదుట ఎవరు నిలబడగలరు?   
11 నేను తిరిగి చెల్లించవలసి ఉందని ఎవరు నన్ను అడగగలరు?  
ఆకాశం క్రింద ఉన్నదంతా నాదే.   
   
 
12 “లెవియాథన్ అవయవాల గురించి, దానికున్న అధిక బలాన్ని గురించి,  
దాని మనోహరమైన రూపాన్ని గురించి చెప్పకుండా ఉండలేను.   
13 దానిపై కవచాన్ని ఎవరు లాగివేయగలరు?  
దాని రెండంతల కవచంలోకి ఎవరు చొచ్చుకోగలరు?   
14 భయంకరమైన పళ్ళ వరుస గల,  
దాని నోటిద్వారాన్ని తెరవడానికి ఎవరు సాహసం చేస్తారు?   
15 దాని వీపుమీది పొలుసులు చాలా గట్టివి;  
అవి దగ్గరగా బిగుసుగా కూర్చబడ్డాయి.   
16 గాలికూడా వాటి మధ్యలోనికి చొరబడలేనంత  
ప్రతిదీ దాని తర్వాత దానికి చాలా దగ్గరగా ఉంటుంది.   
17 ఒక దానితో ఒకటి అతుక్కుని ఉన్నాయి,  
అవి అంటిపెట్టుకుని ఉంటాయి వాటిని ఎవరు వేరు చేయలేరు.   
18 దాని గురక కాంతి వెలుగులను విసురుతుంది;  
దాని కళ్లు ఉదయపు కిరణాల్లా ఉన్నాయి.   
19 దాని నోటి నుండి అగ్నిజ్వాలలు ప్రవహిస్తాయి;  
నిప్పు కణాలు ఎగిరివస్తాయి.   
20 జమ్ము మంట పై ఉడికే కుండలో నుండి పొగ వచ్చినట్లు  
దాని నాసికా రంధ్రాల్లో నుండి పొగ వస్తుంది.   
21 దాని ఊపిరి నిప్పు కణాలను రాజేస్తుంది,  
దాని నోటి నుండి మంటలు బయలుదేరతాయి.   
22 బలం దాని మెడలో ఉంటుంది;  
నిరాశ దాని ముందర నడుస్తుంది.   
23 దాని మాంసం యొక్క మడతలు దగ్గరగా కలుపబడ్డాయి;  
అవి దృఢంగా అంటుకుని ఉంటాయి.   
24 దాని రొమ్ము బండలా గట్టిగా,  
తిరుగటిరాయి క్రింది దిమ్మలా ఉంటుంది.   
25 అది లేచినప్పుడు, బలవంతులు భయపడతారు;  
అది కొట్టకుండానే పారిపోతారు.   
26 ఖడ్గంతో దాడి చేసినా ప్రభావం ఉండదు,  
ఈటెలు బాణాలు బరిసెలు దాని మీద పని చేయవు.   
27 దానికి ఇనుము అంటే తుక్కుతో  
ఇత్తడి అంటే పుచ్చిపోయిన చెక్కతో సమానము.   
28 బాణాలు దానిని పారిపోయేలా చేయలేవు;  
వడిసెల రాళ్లు దానికి పొట్టుతో సమానము.   
29 దుడ్డుకర్ర దానికి తుక్కు ముక్కలా ఉంటుంది;  
వడిగా వెళ్తున్న ఈటెను చూసి నవ్వుతుంది.   
30 దాని దిగువ భాగం పగిలిన కుండపెంకుల వలె గరుకుగా ఉంటాయి,  
బురద మీద నూర్పిడి కర్రను పోలిన గుర్తులను ఏర్పరుస్తుంది.   
31 అది దాని గందరగోళంతో నీటిని మరిగేలా చేస్తుంది.  
అది సముద్రాన్ని కదిలించి నూనె మరుగుతున్న కుండలా చేస్తుంది.   
32 అది వెళ్లిన దారంతా మెరుస్తున్న నురుగును వదలుతుంది;  
అది చూసేవారికి సముద్రానికి తెల్ల వెంట్రుకలు ఉన్నాయేమో అనిపిస్తుంది.   
33 భూమి మీద దానికి సమానమైనదేదీ లేదు;  
ఒక భయంలేని సృష్టి.   
34 అహంకారం కలిగిన వాటన్నిటిని చిన్న చూపు చూస్తుంది;  
గర్వపడే వాటన్నిటికి అది రాజు.”