5
1 “నీవు మొరపెట్టు, కాని నీకు సమాధానం ఎవరిస్తారు?  
పరిశుద్ధులలో ఎవరు నీకు సహాయం చేస్తారు?   
2 ఆగ్రహం మూర్ఖులను చంపుతుంది.  
అసూయ బుద్ధిహీనులను చంపుతుంది.   
3 మూర్ఖులు వేరుపాదుకోవడం నేను చూశాను,  
కాని హఠాత్తుగా వారి ఇల్లు శపించబడింది.   
4 వారి పిల్లలకు క్షేమం దూరమవుతుంది,  
వారి పక్షంగా వాదించేవారు లేక న్యాయస్థానంలో వారు నలిగిపోతారు.   
5 ఆకలితో ఉన్నవారు వారి పంటను తినివేస్తారు,  
ముండ్ల మధ్యలో ఉన్నవాటిని కూడా వారు తీసుకుంటారు,  
దాహంతో ఉన్నవారు వారి ఆస్తి కోసం కాచుకుని ఉంటారు.   
6 కష్టం దుమ్ములో నుండి పుట్టదు.  
బాధ భూమిలో నుండి మొలకెత్తదు.   
7 నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు  
నరులు బాధల కోసమే పుడుతున్నారు.   
   
 
8 “ఒకవేళ నేనే నువ్వైతే, నేను దేవునికే మొరపెడతాను;  
ఆయన ఎదుట నా వాదన చెప్పుకుంటాను.   
9 పరిశోధించలేని మహాకార్యాలను  
లెక్కించలేని అద్భుత క్రియలను ఆయన చేస్తారు.   
10 ఆయన భూమిపై వాన కురిపిస్తారు;  
పొలాలకు నీటిని పంపిస్తారు.   
11 ఆయన దీనావస్థలోనున్న వారిని పైకి లేపుతారు,  
దుఃఖపడేవారిని క్షేమానికి లేవనెత్తుతారు.   
12 వంచకుల చేతులు విజయం సాధించకుండ,  
ఆయన వారి ఆలోచనలను తలక్రిందులు చేస్తారు.   
13 జ్ఞానులను వారి యుక్తిలోనే ఆయన పట్టుకుంటారు,  
వంచకుల ఆలోచనలు తుడిచివేయబడతాయి.   
14 పగటివేళ వారి మీదికి చీకటి వస్తుంది;  
రాత్రిలో తడుముకున్నట్లు వారు మధ్యాహ్న వేళలో తడుముకుంటారు.   
15 వారి నోటి నుండి వచ్చే పదునైన మాటల నుండి ఆయన బీదలను రక్షిస్తారు;  
బలవంతుల చేతిలో నుండి ఆయన వారిని రక్షిస్తారు.   
16 కాబట్టి బీదలకు నిరీక్షణ ఉంది,  
అన్యాయం తన నోరు మూసుకుంటుంది.   
   
 
17 “దేవుడు సరిదిద్దేవారు ధన్యులు;  
కాబట్టి సర్వశక్తిమంతుని క్రమశిక్షణను నిర్లక్ష్యం చేయకు.   
18 గాయం చేసేది ఆయనే, గాయాన్ని కట్టేది కూడా ఆయనే;  
ఆయన గాయపరుస్తారు, కాని ఆయన చేతులే స్వస్థపరుస్తాయి.   
19 ఆరు ఆపదల్లో నుండి ఆయన నిన్ను విడిపిస్తారు;  
ఏడు బాధల్లో ఏ హాని నిన్ను తాకదు.   
20 కరువు కాలంలో చావు నుండి,  
యుద్ధంలో ఖడ్గం అంచు నుండి ఆయన నిన్ను తప్పిస్తారు.   
21 కొరడాలవంటి నోటిమాటల నుండి నిన్ను కాపాడతారు,  
నాశనం వచ్చినా నీవు భయపడవు.   
22 కరువు నాశనం వచ్చినప్పుడు నీవు నవ్వుతావు,  
అడవి మృగాలకు నీవు భయపడే అవసరం లేదు.   
23 ఎందుకంటే పొలం లోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుంటావు,  
అడవి జంతువులు నీతో సమాధానంగా ఉంటాయి.   
24 నీ గుడారం క్షేమనివాసమని నీవు తెలుసుకుంటావు;  
నీ ఆస్తులను లెక్క చూడగా వాటిలో ఒకటి కూడా పోదు.   
25 నీకు చాలామంది పిల్లలు ఉంటారని,  
నీ సంతానం భూమిమీది గడ్డిని పోలి ఉంటుందని నీవు తెలుసుకుంటావు.   
26 పంట కాలంలో ధాన్యం సేకరించబడినట్లు  
పూర్తి వయస్సు నిండిన తర్వాత నీవు సమాధికి చేరతావు.   
   
 
27 “మేము ఇది పరిశీలించాము, ఇది నిజము.  
కాబట్టి ఈ మాటలు విని నీ మంచి కోసం తెలుసుకో.”