కీర్తన 102
దుఃఖముచేత ప్రాణము సొమ్మసిల్లినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర. 
 
1 యెహోవా, నా ప్రార్థన వినండి;  
సాయం కోసం నేను పెడుతున్న నా మొర మీకు చేరును గాక.   
2 నేను కష్టంలో ఉన్నప్పుడు  
మీ ముఖాన్ని నాకు మరుగు చేయకండి.  
మీ చెవి నా వైపు త్రిప్పండి;  
నేను మొరపెట్టినప్పుడు, త్వరగా జవాబివ్వండి.   
   
 
3 నా దినాలు పొగలా కనుమరుగు అవుతున్నాయి;  
నా ఎముకలు నిప్పుకణాల్లా కాలిపోతున్నాయి.   
4 దెబ్బకు వాడిన గడ్డిలా ఉంది నా హృదయం;  
నేను భోజనం చేయడం మరచిపోతున్నాను.   
5 నా బాధలో నేను గట్టిగా మూలుగుతూ ఉన్నందుకు  
నేను అస్థిపంజరంలా ఉన్నాను.   
6 నేను ఎడారి గుడ్లగూబలా,  
శిధిలాల మధ్య బిగ్గరగా అరిచే గుడ్లగూబలా ఉన్నాను.   
7 నేను మేల్కొని ఉన్నాను;  
ఇంటికప్పు మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకలా ఉన్నాను.   
8 రోజంతా నా శత్రువులు నన్ను తిడతారు;  
నన్ను ఎగతాళి చేసేవారు నా పేరును శాపంగా ఉపయోగిస్తారు.   
9 నేను బూడిదను ఆహారంగా తింటున్నాను  
పానీయంలో కన్నీరు కలిపి త్రాగుతున్నాను.   
10 మీ ఉగ్రతను బట్టి;  
మీరు నన్ను ఎత్తి అవతల విసిరివేశారు.   
11 నా రోజులు సాయంకాలపు నీడలా ఉన్నాయి;  
నేను గడ్డిలా వాడిపోతున్నాను.   
   
 
12 కాని యెహోవా, మీరు ఎప్పటికీ ఆసీనులై ఉంటారు;  
మీ జ్ఞాపకం తరతరాలకు నిలిచి ఉంటుంది.   
13 మీరు లేచి సీయోనుపై కనికరం చూపిస్తారు,  
ఎందుకంటే ఆమెపై దయ చూపే సమయం వచ్చింది;  
నిర్ణీత సమయం వచ్చింది.   
14 దాని రాళ్లు మీ సేవకులకు ఇష్టమైనవి;  
దుమ్ము వారికి దయ కలిగించింది.   
15 జనులు యెహోవా నామానికి భయపడతారు,  
భూరాజులంతా మీ మహిమ ఎదుట వణకుతారు.   
16 ఎందుకంటే యెహోవా సీయోనును పునర్నిర్మించి  
తన మహిమతో ప్రత్యక్షమవుతారు.   
17 దిక్కులేని దరిద్రులు ప్రార్థిస్తే ఆయన వింటారు;  
ఆయన వారి మనవులను త్రోసివేయరు.   
   
 
18 ఇది రాబోయే తరాల కోసం వ్రాయబడును గాక,  
ఇంకా సృజించబడని ప్రజలు యెహోవాను స్తుతించుదురు గాక:   
19-20 “బందీల మూలుగులు వినడానికి  
మరణశిక్ష విధించబడిన వారిని విడుదల చేయడానికి,  
యెహోవా ఎత్తైన పరిశుద్ధాలయం నుండి క్రిందికి వంగిచూశారు,  
పరలోకంలో నుండి భూమిని చూశారు.”   
21-22 ఈ విధంగా ఎప్పుడైతే ప్రజలు రాజ్యాలు  
యెహోవాను ఆరాధించడానికి సమాజముగా కూడుతారో  
అప్పుడు సీయోనులో యెహోవా నామం ప్రకటించబడుతుంది  
యెరూషలేములో ఆయన స్తుతించబడతారు.   
   
 
23 నా జీవిత గమనంలో నా బలాన్ని కృంగదీశారు;  
ఆయన నా రోజుల్ని తగ్గించారు.   
24 అందుకు నేనన్నాను:  
నా దేవా, నా దినాల మధ్యలో నన్ను తీసుకెళ్లకండి;  
మీ సంవత్సరాలు తరతరాలకు సాగిపోతూనే ఉంటాయి.   
25 ఆదిలో మీరు భూమికి పునాదులు వేశారు,  
ఆకాశాలు మీ చేతి పని.   
26 అవి అంతరించిపోతాయి, కాని మీరు నిలిచి ఉంటారు;  
ఒక వస్త్రంలా అవన్నీ పాతగిల్లుతాయి.  
మీరు వాటిని దుస్తుల్లా మార్చి వేస్తారు  
అవి అంతరిస్తాయి.   
27 కాని మీరు అలాగే ఉంటారు,  
మీ సంవత్సరాలకు అంతం ఉండదు.   
28 మీ సేవకుల పిల్లలు మీ సన్నిధిలో నివాసం చేస్తారు;  
వారి పిల్లలు మీ సమక్షంలో స్థిరంగా ఉంటారు.