కీర్తన 104
1 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు.  
   
 
యెహోవా నా దేవా, మీరు చాలా గొప్పవారు;  
ఘనత ప్రభావాన్ని ధరించుకున్నారు.   
   
 
2 యెహోవా వెలుగును వస్త్రంలా ధరిస్తారు;  
ఆయన ఒక గుడారంలా ఆకాశాన్ని విస్తరించి   
3 తన గదుల కిరణాలను వాటి నీటిపై వేస్తారు.  
ఆయన మేఘాలను తన రథంగా చేసుకుని  
వాయు రెక్కలపై స్వారీ చేస్తారు.   
4 ఆయన వాయువులను తనకు దూతలుగా,  
అగ్ని జ్వాలలను తనకు సేవకులుగా చేస్తారు.   
   
 
5 భూమిని దాని పునాదులపై నిలిపారు;  
అది ఎన్నటికి కదలదు.   
6 మీరు దానిని ఒక వస్త్రంలా నీటి అగాధాలతో కప్పారు;  
జలాలు పర్వతాలకు పైగా నిలిచాయి.   
7 మీ మందలింపుతో జలాలు పారిపోయాయి,  
మీ ఉరుముల ధ్వనికి పలాయనం చిత్తగించాయి;   
8 అవి పర్వతాలకు మీదుగా వెళ్లాయి,  
అవి లోయల్లోకి దిగిపోయాయి,  
వాటికి మీరు నిర్ణయించిన చోటుకు అవి చేరుకున్నాయి.   
9 అవి దాటలేని సరిహద్దును మీరు ఏర్పరిచారు;  
అవి ఎన్నటికి భూమిని ముంచివేయవు.   
   
 
10 ఆయన ఊటలను కనుమలలోకి నీటిని కుమ్మరింపజేస్తారు;  
అవి పర్వతాల మధ్య ప్రవహిస్తున్నాయి.   
11 అవి పొలాలలోని అడవి మృగాలకు నీరు అందిస్తాయి;  
అడవి గాడిదలు తమ దాహం తీర్చుకుంటాయి.   
12 ఆ జలాల ప్రక్కన ఆకాశపక్షులు గూడు కట్టుకుంటాయి;  
కొమ్మల మధ్య అవి పాడతాయి.   
13 తన ఆకాశ గదుల్లో నుండి ఆయన పర్వతాలను తడుపుతారు;  
ఆయన క్రియా ఫలం చేత భూమి తృప్తి చెందుతుంది.   
14 ఆయన పశువుల కోసం గడ్డి పెరిగేలా చేస్తున్నారు,  
మనుష్యులు శ్రమించి సాగుచేయడానికి మొక్కలను మొలిపిస్తున్నారు,  
అలా భూమి నుండి ఆహారాన్ని పుట్టిస్తున్నారు:   
15 మానవ హృదయాలకు సంతోషం కలిగించడానికి ద్రాక్షరసాన్ని,  
వారి ముఖాలను ప్రకాశించేలా చేయడానికి నూనెను,  
వారి హృదయాలను బలపరిచే ఆహారాన్ని ఇస్తున్నారు.   
16 యెహోవా వృక్షాలు,  
లెబానోనులో దేవదారు చెట్లు చాలినంత నీరు కలిగి ఉన్నాయి.   
17 అక్కడ పక్షులు వాటిలో గూళ్ళు కట్టుకుంటాయి;  
కొంగలు సరళ వృక్షాలపై నివాసముంటాయి.   
18 అడవి మేకపోతులు ఎత్తైన పర్వతాలమీద మేస్తూ ఉంటాయి;  
కుందేళ్ళు బండ సందులను ఆశ్రయిస్తాయి.   
   
 
19 రుతువుల్ని సూచించడానికి ఆయన చంద్రుని చేశారు,  
ఎప్పుడు అస్తమించాలో సూర్యునికి తెలుసు.   
20 మీరు చీకటి కలుగజేస్తారు, అది రాత్రి అవుతుంది,  
అడవి మృగాలన్నీ వేట కోసం సంచరిస్తాయి.   
21 సింహాలు వాటి వేట కోసం గర్జిస్తాయి,  
అవి దేవుని నుండి ఆహారం వెదకుతాయి.   
22 సూర్యుడు ఉదయించగానే, అవి వెళ్లిపోతాయి;  
అవి గుహలకు వెళ్లి పడుకుంటాయి.   
23 అప్పుడు మనుష్యులు వారి పనులకు వెళ్లిపోతారు,  
సాయంకాలం వరకు వారు కష్టపడతారు.   
   
 
24 యెహోవా! మీ కార్యాలు ఎన్నో!  
మీ జ్ఞానంతో మీరు వాటన్నిటిని చేశారు;  
భూమి అంతా మీ సృష్టితో నిండి ఉంది.   
25 అదిగో విశాలమైన, మహా సముద్రం,  
అందులో లెక్కలేనన్ని జలచరాలు  
దానిలో జీవులు చిన్నవి పెద్దవి ఉన్నాయి.   
26 అందులో ఓడలు ఇటు అటు తిరుగుతాయి,  
సముద్రంలో ఆడుకోడానికి మీరు సృజించిన లెవియాథన్ అక్కడ ఉంది.   
   
 
27 సకాలంలో మీరు వాటికి వాటి ఆహారం పెడతారని,  
జీవులన్నీ మీ వైపే చూస్తున్నాయి.   
28 మీరు దానిని వారికి ఇచ్చినప్పుడు,  
అవి సమకూర్చుకుంటాయి;  
మీరు గుప్పిలి విప్పి పెడుతుంటే  
అవి తిని తృప్తి చెందుతాయి.   
29 మీ ముఖం మరుగైతే  
అవి కంగారు పడతాయి;  
మీరు వాటి ఊపిరిని ఆపివేసినప్పుడు,  
అవి చనిపోయి మట్టి పాలవుతాయి.   
30 మీరు మీ ఆత్మను పంపినప్పుడు,  
అవి సృజించబడ్డాయి,  
మీరే భూతలాన్ని నూతనపరుస్తారు.   
   
 
31 యెహోవా మహిమ నిరంతరం ఉండును గాక;  
యెహోవా తన క్రియలలో ఆనందించును గాక.   
32 ఆయన భూమిని చూస్తే, అది కంపిస్తుంది,  
ఆయన పర్వతాలను తాకితే, అవి పొగలు గ్రక్కుతాయి.   
   
 
33 నా జీవితకాలమంతా నేను యెహోవాకు పాడతాను;  
నేను బ్రతికి ఉన్నంత కాలం నా దేవునికి నేను స్తుతిగానం చేస్తాను.   
34 నేను యెహోవాయందు ఆనందిస్తుండగా,  
నా ధ్యానము ఆయనకు ఇష్టమైనదిగా ఉండును గాక.   
35 అయితే పాపులు భూమి మీద నుండి పూర్తిగా తుడిచివేయబడుదురు గాక  
దుష్టులు ఇక ఉండక పోవుదురు గాక.  
   
 
నా ప్రాణమా, యెహోవాను స్తుతించు.  
   
 
యెహోవాను స్తుతించు.